‘ఎంపీ మలివాల్ ఘటనతో ఆప్ ఓడిపోతుంది’
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్నికల వేళ జరిగిన ఈ ఘటనతో ఆప్ ఓటమి పాలవుతోందా?
స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పుబడుతున్న బిజెపి.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకంత ఓటమిని ఆమ్ ఆద్మీ పార్టీ చవిచూస్తుందని పేర్కొంది.
బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విలేఖరులతో మాట్లాడుతూ.. కుమార్‌ను రక్షించడానికి ముఖ్యమంత్రి తన వంతు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ సూచన మేరకు ఆయన సహాయకుడు మలివాల్‌పై దాడి జరిగిందన్నారు.
మౌనం వహించడం సిగ్గుచేటు..
"అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో కుమార్, ఇతరులు మలివాల్‌ను ఏడు, ఎనిమిది సార్లు కొట్టారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ మౌనం వహించడం విచిత్రం. సిగ్గుచేటు కూడా." అని భాటియా అన్నారు.
దాడిలో కేజ్రీవాల్ ప్రమేయం గురించి నిజం దాచడానికి, సిఎం నివాసంలోని సిసిటివి కెమెరాల ఫుటేజీని అటు ఇటుగా మార్చారని, కుమార్ మొబైల్ ఫోన్ ఫార్మాట్ చేశారని బిజెపి అధికార ప్రతినిధి ఆరోపించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు రేపు (మే 25న) ఎన్నికలు జరగనున్నాయి. అన్నిచోట్ల బీజేపీ గెలుస్తుందని భాటియా విశ్వాసం వ్యక్తం చేశారు.