రాహుల్‌కు రాజకీయ చతురత లేదా?
x

రాహుల్‌కు రాజకీయ చతురత లేదా?

రాహుల్‌ ‌గాంధీ రాజకీయాలకు సరైన వ్యక్తి కాదని మాజీ రాష్ట్రపతి ముందే ఉహించారా? రాహుల్‌ ‌వ్యవహరించిన తీరే 2014లో పార్టీ ఓటమికి కారణమా?


‘‘ప్రణబ్‌, ‌మై ఫాదర్‌: ఎ ‌డాటర్‌ ‌రిమెంబర్స్’’ (PRANAB, My father - A daughter remembers) అనే పుస్తకంలో రాహుల్‌ ‌గాంధీ (Rahul Gandhi) గురించిన చాలా విషయాలు బయటకు తెలుస్తాయి కాబోలు. డిసెంబర్‌ 11‌న మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్‌ ‌ముఖర్జీ (Pranab Mukherjee) జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.


‘‘గాంధీ-నెహ్రూ వంశంలోని అహంకారమంతా ఆయనకు ఉంది. కాని రాజకీయ చతురత లేదు.’’ ఈ మాటలు రాహుల్‌ ‌గాంధీని ఉద్దేశించి రాసినవే.. అసలు ఈ విషయాలను బయటపెట్టింది ప్రణబ్‌ ‌ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ. ఈమె కాంగ్రెస్‌ ‌మాజీ అధికార ప్రతినిధి. 2021లో రాజకీయాల నుంచి వైదొలిగారు.క్లాసికల్‌, ‌కొరియోగ్రాఫర్‌ అయిన శర్మిష్ట.. ప్రస్తుతం ప్రణబ్‌ ‌ముఖర్జీ లెగసీ ఫౌండేషన్‌ను నడుపుతున్నారు. పుస్తకంలోని విశేషాలను ఆమె ఇటీవల మీడియాతో పంచుకున్నారు.

ప్రణబ్‌ ‌షాకయ్యారట..

ఆ రోజు సెప్టెంబర్‌ 27, 2013. ‌మాజీ మంత్రి, పార్టీ కమ్యూనికేషన్‌ ‌డిపార్టుమెంట్‌ ‌చీఫ్‌ అజయ్‌ ‌మకెన్‌ ‌ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దానికి రాహుల్‌ ‌కూడా హాజరయ్యారు. సమావేశం మధ్యలో ‘‘ఈ ఆర్డినెన్స్ అర్థరహితం. చెత్తబుట్టలో పడేయాలి’’ అంటూ అందరు చూస్తుండగానే..ఆర్డినెన్స్ ‌కాపీని చించేశారట రాహుల్‌ (Rahul). ఈ ‌ఘటనతో ప్రణబ్‌ ‌షాకయ్కారట.


‘‘మరుసటి ఏడాది (2014) జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ పరాభవానికి ఈ ఘటనే ప్రధాన కారణమని’’ నాన్న డైరీలో రాసి ఉందని శర్మిష్ఠ (Sharmistha Mukherjee) చెప్పారు.

కాంగ్రెస్‌ 44 ‌సీట్లకు పడిపోవడం..నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రావడం మనకు తెలిసిందే.

అసలు ఆ ఆర్డినెన్స్‌ (Ordinance) లో ఏముంది?

నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ‌లాంటి వారిని కాపాడేందుకు 2013లో అప్పటి యూపీఏ (UPA) గవర్నమెంట్‌ ఓ Ordinance తీసుకొచ్చింది. దోషులుగా తేలిన శాసనసభ్యులపై తక్షణం అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ తీర్పును దాటవేయడమే ఈ ఆర్డినెన్స్ ‌లక్ష్యం. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు పెండింగ్‌లో ఉండగా.. వారు సభ్యులుగా కొనసాగవచ్చని ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు.

‘‘వాస్తవానికి తన తండ్రి ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకమని’’ శర్మిష్ట చెప్పారు.

‘‘చాలా కాలం తర్వాత నాన్నకి అంత కోపం రావడం చూశాను! ‘‘అసలు రాహుల్‌ ఎవరు? ఆయన మంత్రివర్గంలో సభ్యుడు కాదు. కేబినెట్‌ ‌నిర్ణయాన్ని బహిరంగంగా చెత్తబుట్టలో వేయడానికి’ అని తండ్రితో జరిగిన సంభాషణను శర్మిష్ఠ పుస్తకంలో కోట్‌ ‌చేసినట్టున్నారు.

తేడా గుర్తించకపోతే పీఎంవోను ఎలా నడిపిస్తారు?

‘‘ఒక రోజు ఉదయం మొఘల్‌ ‌గార్డెన్స్ (‌ప్రస్తుతం అమృత్‌ ఉద్యాన్‌)‌లో నాన్న మార్నింగ్‌ ‌వాక్‌ ‌చేస్తున్నారు. ఆ సమయంలో నాన్నకు కలిసేందుకు రాహుల్‌ ‌వచ్చారు. సాధారణంగా మార్నింగ్‌ ‌వాక్‌, ‌పూజ సమయాల్లో నాన్న ఎవరిని కలవడానికి ఇష్టపడరు. అయితే రాహుల్‌ ‌వచ్చి మాట్లాడారు. నిజానికి రాహుల్‌ ఆ ‌రోజు సాయంత్రం నాన్నను కలవాల్సి ఉందని నాకు తర్వాత తెలిసింది. పొరపాటున రాహుల్‌ ‌కార్యాలయ సిబ్బంది సాయంత్రం మీటింగ్‌ని ఉదయానికి షెడ్యూల్‌ ‌చేశారు. దీని గురించి నాన్నను అడిగినప్పుడు.. రాహుల్‌ ‌గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. రాహుల్‌ ‌కార్యాలయం ఉదయం, సాయంత్రానికి తేడా గుర్తించకపోతే, పీఎంవో (ప్రధాని కార్యాలయం)ని ఎలా నడిపిస్తారు?’’ అన్నారని ప్రణబ్‌ ‌కూతురు శర్మిష్ట తెలిపారు.


రాహుల్‌లో ఆ ధోరణిని ప్రణబ్‌ ‌గమనించారా?

రాజకీయాలంటే ఇష్ట లేకపోవడం, వాటిమీద అవగాహన లేకపోవడం, తరుచూ కనిపించకుండా పోయే ధోరణి పట్ల ప్రణబ్‌ అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారట. రాజకీయాల్లో నిమగ్నమవ్వాలంటే ఏడాది పొడవునా, ప్రతి రోజూ నిరంతర నిబద్ధత అవసరమని ప్రణబ్‌ ‌భావించేవారట.

ఆవిర్భావ దినోత్సవానికి గైర్హాజరు..

2014లో పార్టీ 130వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన ఏఐసీసీ (AICC) జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాహుల్‌ ‌గైర్హాజరవడాన్ని ముఖర్జీ గుర్తించారు. ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి.

‘‘సోనియాజీ (Sonia Gandhi) తన కుమారుడిని వారసుడిగా కోరుకుంటున్నారు. కానీ అతని చరిష్మా, రాజకీయ అవగాహన లేకపోవడం సమస్యలుగా కనిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెస్‌ను పునరుద్ధరించగలరా? అతను ప్రేరణగా నిలవగలడో.. లేదో.. నాకు తెలియదు.’’ అని ప్రణబ్‌ ‌తన డైరీలో రాశాడట.

ప్రణబ్‌ ‌గురించి...

ప్రణబ్‌ ‌ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతి (2012 - 2017). అంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలకు మంత్రి అయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రణబ్‌ .. ‌రాజకీయ కురువృద్ధుడనే చెప్పాలి. కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీలో ఆయన 23 ఏళ్ల పాటు సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌కు వెన్నంటి ఉన్న ఆయన ఆగస్టు 31, 2020న 84 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.



పార్టీ ఎలా స్పందిస్తుందో..

రాహుల్‌ ‌గాంధీ గురించిన చాలా విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వీటన్నిటిపై కాంగ్రెస్‌ ‌పార్టీ (Congress) అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..

Read More
Next Story