మనీ,మద్యం పంపిణీ నివారణకు ఈసీ,పోలీసుల చర్యలు
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు మనీ,మద్యం పంపిణీపై దృష్టిసారించాయి. దీంతో మనీ,మద్యాన్ని నివారించేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణలో పార్లమెంట్ పోలింగ్ ముందు రోజు ఓటర్లను ప్రభావితం చేసేందుకు మనీ, మద్యం, బహుమతుల పంపిణీ జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా వేశారు. దీని కోసం ఈసీ అధికారులే కాకుండా సెల్ప్ హెల్ప్ గ్రూపులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను రంగంలో దించింది.
- ఫంక్షన్ హాళ్లలో బహుమతుల పంపిణీ,ఉచితంగా భోజనాలు పెట్టడంపై ఈసీ వ్యయ నియంత్రణ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రత్యేకంగా ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లలో కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేశారు.
- కార్యకర్తలకు బిర్యానీలు, మద్యం బాటిళ్లు అందిస్తున్నారనే ఫిర్యాదుల మేర ఈసీ అధికారులు పోలీసులతో కలిసి తనిఖీలు ముమ్మరం చేశారు. బహుమతులు పంపిణీ చేస్తున్నారని వచ్చిన సమాచారంతో ఎన్నికల అధికారులు పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
అప్రమత్తమైన ఈసీ, పోలీసు అధికారులు
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంపిణీకి పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు సమాయత్తమయ్యారనే సమాచారం మేర ఎన్నికల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ సందర్భంగా 72 గంటల పాటు పోలీసులు నిఘా వేసి ఆన్ లైన్ నగదు లావాదేవీలపై కూడా దృష్టి సారించారు.మద్యం రవాణాను ట్రాక్ చేయడం కోసం అంతర్-రాష్ట్ర సరిహద్దు, వాణిజ్య పన్నుల చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు.
నగదు,మద్యం బాటిళ్ల సీజ్
నగరంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రూ.42 కోట్ల నగదు, రూ.కోటికి పైగా విలువైన 7,370 మద్యం బాటిళ్లు, కోటి రూపాయల డ్రగ్స్, రూ. 13 కోట్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 430 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఓటర్లకు పంపిణీ చేయడానికి ఉంచిన 24 లక్షల రూపాయల విలువైన బహుమతులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే కోట్లాది రూపాయల నగదు, మద్యం బాటిళ్లు దొరికాయంటే ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ పార్టీలు ఏ మేర మనీ, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయో విదితమవుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పోలింగ్ కోసం సర్వం సిద్ధం
మే 13వతేదీన సోమవారం పార్లమెంట్ పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు.శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షించడానికి సెక్టార్ అధికారులను నియమించారు. అధిక ఉష్ణోగ్రత, తీవ్రమైన వడగాలులు వీస్తే క్యూలో నిలబడిన ఓటర్లు, పోలింగ్ అధికారుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాుట ఆరోగ్య సౌకర్యాలు కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం షామియానాలు కూడా ఏర్పాటు చేశారు.
ఈసీ ప్రత్యేక యాప్
ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్‌లను తెలుసుకోవడానికి, క్యూ గురించి తెలుసుకోవడం కోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. ఓటర్ల వాహనాలను పార్కింగ్ చేయడానికి అనువైన స్థలాలు గుర్తించారు. ఎన్నికల ముందు రోజు ఎన్నికల అధికారులు విధులకు హాజరు కావడానికి, పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి రావడానికి వివిధ ప్రాంతాల నుంచి పోలింగ్ సిబ్బందికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు.పోలింగ్ రోజు అంతరాయం లేని సేవలను అందించడానికి మొబైల్,టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు, విద్యుత్ శాఖలు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లతో ఏర్పాట్లు చేశారు.
దివ్యాంగుల కోసం సక్షం యాప్
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ సక్ష్యం యాప్ ను అభివృద్ధి చేసింది. దివ్యాంగులు ఓటేసేందుకు వీలుగా సక్ష్యం యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్,యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉంచారు.వికలాంగ ఓటర్లు పోలింగ్ రోజున పిక్ అండ్ డ్రాప్ సౌకర్యాన్ని పొందేలా యాప్‌ని ఉపయోగించవచ్చు.
సరిహద్దు చెక్ పోస్టులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం పంపిణీకి తెర వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు ఎంట్రీ పాయింట్లు ఏర్పాటు చేశారు. సీసీ టీవీల పర్యవేక్షణలో పోలీసు ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పర్యవేక్షిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న బృందంలో పోలీసు, ఎక్సైజ్, ఆర్టీఏ, జీఎస్టీ సిబ్బంది రోజుకు మూడు షిఫ్టులలో పని చేసేలా నియమించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్‌లకు వెలుపల సీసీటీవీ కెమెరాలు అమర్చారు. పోలింగ్ రోజున వెబ్ కాస్టింగ్ కోసం అన్ని పోలింగ్ స్టేషన్లలో కెమెరాలు అమర్చారు.
ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెర పడనుంది. ఈనెల 13న రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కు 48 గంటలకు ముందు ప్రచారానికి తెరవేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, మిగిలిన 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి శనివారంతో తెర పడుతున్న నేపథ్యంలో రాజకీయ ప్రచారానికి బల్క్ ఎస్ఎంఎస్, వాయిస్ మెసేజ్ లు పంపించరాదని ఈసీ ఆదేశించింది. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు 48 గంటల వ్యవధిలో లౌడ్‌స్పీకర్‌ని ఉపయోగించడానికి అనుమతించమని ఈసీ స్పష్టం చేసింది.
కీలక పార్లమెంట్ నియోజకవర్గాలపై పోలీసుల నిఘా
తెలంగాణలో కీలకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాలపై పోలీసులు నిఘా వేశారు. ప్రచార పర్వం ముగియనుండటంతో ఓటర్లకు మద్యం, మనీ పంపిణీని నివారించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సెన్సిటివ్ ప్రాంతాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించిన పోలీసులు కేంద్ర బలగాలను మోహరించారు. ఇప్పటికే 1100 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జియో ట్యాగింగ్ చేశారు.
Next Story