జూపార్కుల్లో జంతువుల ఆకలి తీరుస్తున్న ఆపద్బాంధవులు
x
ఏనుగును దత్తత తీసుకునేందుకు చెక్కు అందిస్తున్న శ్రీహరి దంపతులు(ఫొటో : జూపార్కు సౌజన్యంతో)

జూపార్కుల్లో జంతువుల ఆకలి తీరుస్తున్న ఆపద్బాంధవులు

ఏపీ, తెలంగాణలోని జూపార్కుల్లో జంతువుల ఆకలి తీర్చేందుకు జంతుప్రేమికులు ముందుకు వచ్చారు.హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్టణాల్లోని జంతువులను దత్తత తీసుకుంటున్నారు.


పచ్చని చెట్లు...పక్షుల కిలకిలరావాలు...సింహాలు, పులులు, చిరుతల గర్జనలు...గజరాజుల ఘీంకారాలు...నెమళ్ల నాట్యాలు...చెంగుచెంగున దూకే జింకలు...నిలువెత్తు జిరాఫీలు...పడగవిప్పి బుసలు కొట్టే పాములు...ఇలా ఒకటేమిటి అన్ని రకాల జంతువులున్న హైదరాబాద్, తిరుపతి, విశాఖ జూపార్కుల్లో జంతువుల ఆకలి తీర్చేందుకు జంతుప్రేమికులు ముందుకు వస్తున్నారు. జూపార్కుల్లో జంతువుల సంఖ్య పెరగడంతో బడ్జెట్ సరిపోక ఆకలితో అలమటిస్తున్న జంతువుల ఆకలి తీర్చేందుకు మేమున్నామంటూ పలువురు ఆపద్భాంధవులు ముందుకు వచ్చారు.


ఏనుగును దత్తత తీసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దంపతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దంపతులు శ్రీహరి, శ్రీజలు హైదరాబాద్ లోని నెహ్రూ జాపార్కులోని ఏనుగును దత్తత తీసుకున్నారు. ఏనుగుకు కావాల్సిన ఆహారం కోసం నెల రోజుల పాటు అయ్యే రూ.25వేల చెక్కును వారు జూపార్కు క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్ కు కు అందజేశారు. ఏనుగును దత్తత తీసుకున్న శ్రీహరి, శ్రీజలను క్యూరేటర్ అభినందించారు. జూపార్కులోని జంతువులను సందర్శించిన వీరు జంతువుల సంరక్షణ చూసి జూ అధికారులలను ప్రశంసించారు. జంతు ప్రేమికులకు జంతు దత్తత పథకం ఒక అద్భుతమైన పథకమని, ఏనుగును దత్తత తీసుకునే అవకాశాన్ని కల్పించినందుకు జూ అధికారులు శ్రీహరి దంపతులు ధన్యవాదాలు తెలిపారు.

సాఫ్ట్ వేర్ దంపతులు శ్రీహరి, శ్రీజ దత్తత తీసుకున్న ఏనుగు

ఉపాసన ఏనుగు దత్తత
హైదరాబాద్ జంతుప్రదర్శనశాలలోని ఆడ ఏనుగు రాణిని ప్రముఖ టాలీవుడ్ నటుడు రాంచరణ్ భార్య, అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ ఉపాసన 2020వ సంవత్సరంలో దత్తత తీసుకున్నారు. జంతు ప్రేమికురాలైన ఉఫాసన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఆడ ఏనుగును దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు ఈ ఏనుగు పోషణ నిమిత్తం రూ.5 లక్షల చెక్కును జూపార్కు క్యూరెటరుకు అప్పగించారు.

చిన్నారులు సైతం...
జూపార్కులోని వన్యప్రాణులను చిన్నారులు సైతం దత్తత తీసుకొని జంతువుల పట్ల తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. గతంలో చిన్నయ్ సిద్ధార్థ్ షా అనే బాలుడు జూపార్కులోని రాయల్ బెంగాల్ టైగరును మూడు నెలల పాటు దత్తత తీసుకున్నారు. ఈ పులి పోషణ కోసం రూ.25వేలు అందజేసిన బాలుడు చిన్నవాడైనా జంతువుల పట్ల పెద్ద మనసు చాటుకున్నాడు. హైదరాబాద్ నగరానికి చెందిన హవిషా జైన్, విహాన్ అతుల్ షా అనే ఇద్దరు చిన్నారులు కూడా పక్షులను దత్తత తీసుకొని వాటి తిండి గింజల కోసం రూ.5వేలు విరాళంగా అందించారు. చిన్నారులు తమ కిడ్డీ బ్యాంకుల్లో దాచిన డబ్బును జంతువుల దత్తతకు ఇస్తున్నారని జూపార్కు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హనీఫ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పెరిగిన జంతువుల సంఖ్యతో పెరిగిన నిర్వహణ భారం
నెహ్రూ జూపార్కులో జంతువుల సంఖ్య పెరగడంతో వీటి నిర్వహణ భారంగా మారడంతో 2002వ సంవత్సరంలో అధికారులు వన్యప్రాణుల దత్తత పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం 2010వసంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జంతువుల దత్తత పథకం ద్వారా జూకు రూ.80 లక్షల ఆదాయం వచ్చింది. 2014-15వ సంవత్సరంలో ఈ ఆదాయం రూ.44లక్షలకు పడిపోయినా మళ్లీ పెరిగింది. 2019-20 ఏప్రిల్ నెల వరకు 118 జంతువులను నగర ప్రజలు దత్తత తీసుకున్నారు.

జంతువుల పోషణ కోసం...
సింహం, ఏనుగు, తెల్లపులి, చింపాంజీ, రామచిలుక, పాము ఇలా జంతువు ఏదైనా జంతు ప్రేమికులైన ఐటీ, ప్రైవేటు సంస్థల యజమానులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి జూపార్కులో జంతువుల పోషణ నిమిత్తం దత్తత తీసుకోవడం ద్వారా విరాళాలు అందిస్తున్నారు. నగదు, చెక్కులు, డీడీల రూపంలో జూపార్కుకు విరాళాలు అందిస్తున్నారు. జంతువుల దత్తత ద్వారా జూపార్కు ఆర్థిక కష్టాల నుంచి బయటపడిందని జూపార్కు అధికారులు చెప్పారు.

జూపార్కులో పులుల దత్తత

జంతువును బట్టి దత్తత విరాళాలు...
జంతువులను బట్టి అవి తినే తిండిని బట్టి లెక్క కట్టి దత్తతకు జూపార్కు అధికారులు ఫిక్స్‌డ్ విరాళాలను నిర్ణయించారు. ఏనుగు లేదా జిరాఫీ దత్తత కోసం ఏడాదికి రూ.5లక్షలు, సింహం, పులి అయితే ఏడాదికి లక్ష రూపాయలు, చీత, జాగ్వార్, చిరుతపులికి అయితే ఏడాదికి రూ.75వేలు. పక్షులకు అయితే ఏడాదికి రూ.25వేలు, పాముల కోసం రూ.30వేలు దత్తత తీసుకునే వారు యానిమల్ నిర్వహణ కోసం చెల్లించాలి. జిరాఫీకి రూ.1.8 లక్షలు, ఎలుగుబంటికి రూ.1.1లక్షలు, చింపాంజీకి రూ.75వేలు, అడవిదున్నకు రూ.73వేలు, జీబ్రాకు రూ.60వేలు, రెండు తోడేళ్లకు రూ.55వేలు, కృష్ణ జింకకు రూ.36వేలు, మొసలికి రూ.24వేలు, హంసకు రూ.18వేలు, 10 తాబేళ్లకు రూ.11వేలు, గుడ్లగూబకు రూ.9,500, లవ్ బర్డ్స్ కు రూ.వెయ్యి దత్తత రుసుముగా నిర్ణయించారు.

పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకల్లో భాగంగా...
పుట్టినరోజు...పెళ్లి రోజు...ఇలా ప్రత్యేక సందర్భాల్లో జంతుప్రేమికులు ముందుకు వచ్చి జంతువుల దత్తత తీసుకుంటున్నారు. కరోనా తర్వాత జంతువుల దత్తత జోరుగా సాగుతుందని జూపార్కు క్యూరెటర్ డాక్టర్ సునీల్ హిరమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

తిరుపతి జూపార్కులో సైతం...
ఆసియాలోనే అతి పెద్దదైన తిరుపతి నగరంలోని శ్రీవెంకటేశ్వర జూపార్కులో 1250 ఎకరాల విస్తీర్ణంలో 1145 రకాల జంతువులున్నాయి. కరోనా తర్వాత జంతువుల నిర్వహణకు బడ్జెట్ తగ్గడంతో జంతువుల ఆకలి తీర్చేందుకు జంతువుల దత్తతకు శ్రీకారం చుట్టారు. దీంతో పలువురు జంతు ప్రేమికులు వచ్చి జంతువుల దత్తత ద్వారా విరాళాలు అందిస్తున్నారు.

విశాఖపట్టణం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో...
విశాఖపట్టణంలోని ఇందిరాగాంధీ జంతుప్రదర్శనశాలలో జంతువులను దత్తత తీసుకునేందుకు ప్రజలు ముందుకు వచ్చారు. జంతువులను దత్తత తీసుకున్న వారికి ఏడాదిలో ఐదుగురికి రెండుసార్లు ఉచిత ప్రవేశం కల్పించారు. దీంతోపాటు జూపార్కు టీ షర్టు, టోపీలను ఉచితంగా ఇస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు జంతుప్రదర్శనశాలల్లో జంతువుల ఆకలి తీర్చేందుకు జంతు ప్రేమికులు దత్తత పేరిట విరాళాలు ఇస్తుండటం అభినందనీయం.


Read More
Next Story