హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ఏఐ రంగం...కొత్తగా లక్షన్నర ఉద్యోగాలు
x
Hyderabad Hitech City

హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ఏఐ రంగం...కొత్తగా లక్షన్నర ఉద్యోగాలు

హైదరాబాద్ నగరం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మారనుందా? అంటే అవునంటోంది తెలంగాణ సర్కారు. ఏఐలో హైదరాబాద్ సాధిస్తున్న ప్రగతి, ఉద్యోగావకాశాలపై స్టోరీ...


వచ్చే రెండేళ్లలో లక్షన్నర మందికి కొత్తగా ఏఐ ఆధారిత ఉద్యోగాలు వస్తాయని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు ఏఐలో శిక్షణ పొందుతున్నారు. దీంతో ఏఐ మార్పులకు అనుగుణంగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఐఐటీలు పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాయి. మద్రాస్ ఐఐటీ ఏఐ నిపుణులను తయారు చేసేందుకు వీలుగా యూకేలోని బర్మింగ్ హామ్ యూనివర్శిటీతో కలిసి ఏఐ ఎమ్మెస్సీ మాస్టర్స్ కోర్సును ప్రవేశపెట్టింది. భవిష్యత్ ఏఐదేనని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐపై హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, ఐఐటీలు 300కు పైగా పరిశోధనాపత్రాలు వెలువడ్డాయి. టెక్ ప్రపంచంలో ఏఐ మానియా నడుస్తుండటంతో హైదరాబాద్ నగరంలో అందరి దృష్టి దీనిపై పడింది. ఏఐకి హైదరాబాద్ అన్ని రకాల అనుకూలమని టెక్ నిపుణులు చెబుతున్నారు.


ఏఐ గ్లోబల్ సమ్మిట్, ఏఐ సిటీ

హైదరాబాద్ నగరంలో జులై 1,2 తేదీల్లో ఏఐ సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి జయేష్ రంజన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఏఐ సంస్థలను ఆహ్వానించి ఏఐ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న ఆర్టిఫిసీయల్ ఇంటలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచం నలుమూలల నుంచి ఏఐ కంపెనీలను పిలుస్తామని జయేష్ రంజన్ వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని 500 ఎకరాల్లో దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఏఐ సీటీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కారు సన్నాహాలు ప్రారంభించింది. ఏఐ, రోబోటిక్స్, కంప్యూటర్ విజన్ రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2025వ సంవత్సరానికి 150 స్టార్టప్ కంపెనీలను నెలకొల్పడం ద్వారా 500 ఏఐ సంబంధిత ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు.


ఏఐ స్టార్టప్‌లకు ప్రోత్సాహం

మరో వైపు టీహబ్ ఏఐకు ప్రాధాన్యమిచ్చి స్టార్టప్ ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. తెలంగాణ ఏఐ మిషన్, నాస్కామ్ లు సంయుక్తంగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ పై నివేదికను కూడా రూపొందించాయి. ప్రపంచ-స్థాయి లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, విభిన్న ఏఐ అప్లికేషన్‌లపై టీహబ్ ఈ నెలలో ప్రత్యేక లెక్చర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక సంస్థలో ఏఐ సాంకేతికతను అమలు చేయడంలో ఎదురయ్యే అడ్డంకులు, వాటిని అధిగమించేందుకు వ్యూహాలపై టీహబ్ మార్చి చివరివారంలో చర్చా వేదికలు కూడా నిర్వహించనుంది. హైదరాబాద్ నగరంలో ఏఐ విస్తరిస్తే మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని టెక్ నిపుణులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

విస్తరిస్తున్న ఏఐ రంగం

తెలంగాణలోని హైదరాబాద్ నగరం కేంద్రంగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విస్తరించనుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఏఐ రంగంలో హైదరాబాద్ నగరం వేగంగా దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో జులై నెలలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సదస్సు నిర్వహిస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తాజాగా ప్రకటించారు. ప్రపంచంలోనే హైదరాబాద్ నగరాన్ని ఏఐ రాజధానిగా చేసేందుకు వీలుగా ఏఐ ఎక్స్‌లెన్స్ సెంటరును ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన టీ హబ్ స్టార్టప్ ఇంక్యుబేటర్ తరహాలోనే ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ కేంద్రాన్ని నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తులు, పెన్షనర్ల వెరిఫికేషన్, రోడ్లపై గుంతలను గుర్తించడంలో ఏఐ సాంకేతికతను వినియోగించనున్నారు.


ఎందుకు హైదరాబాద్ ఏఐకి అనుకూలం?

దేశంలోనే హైదరాబాద్ నగరం బెస్ట్ లివబుల్ సిటీగా నిలిచింది. హైదరాబాద్ నగరంలో వందకుపైగా జాతీయ పరిశోధనా సంస్థలు, ఐఐటీ, ఎన్ఐటీ, త్రిపుల్ ఐటీ, ఐఎస్‌బీ, మహీంద్రా, టాటా స్కిల్ యూనివర్శిటీలు, ఐటీ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల సెంటర్లు, ఇలా ఒకటేమిటి పలు రకాల ప్రతిష్ఠాత్మక సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా ఉంది. తెలంగాణలో ఉన్న 165 ఇంజినీరింగ్ కళాశాలల్లో యువత టెక్ కోర్సులు అభ్యసిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసేందుకు కావాల్సిన టెక్ స్కిల్ ఉన్న అభ్యర్థులకు హైదరాబాద్ లో కొరత లేదు. దీంతో అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు సైతం నేడు హైదరాబాద్ వైపు ఛూస్తున్నాయి. ఐకియా, లులూ,అమెజాన్,ప్లిప్ కార్ట్, మెట్రో, డీమార్ట్ సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ లో విస్తరిస్తున్నాయి. దీంతో ఏఐకి హైదరాబాద్ అనుకూలంగా మారింది.
వాతావరణంలోనూ బెస్ట్ నగరంగా హైదరాబాద్ నిలచింది. దేశంలో మధ్యలో ఉన్న హైదరాబాద్ రక్షణ పరంగా చూస్తే సురక్షితం. దీంతో పాటు ఇక్కడ ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం లేదు. దీంతోపాటు ఇక్కడ భూకంపాలు కూడా సంభవించవచని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెప్పారు. మరీ ఎండలు కాకుండా మరీ చలి కాకుండా అందరికీ అనువైన వాతావరణం,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మానవ వనరులు, హైదరాబాద్ లో ఉండటంతో అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మారిందని, దీంతోనే ఏఐ నూతన సాంకేతికత కూడా విస్తరిస్తుందని హైదరాబాద్ నగరానికి చెందిన ఐఐటీ మాజీ విద్యార్థి, సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బొజెడ్ల నరేష్ బాబు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఎన్నెన్నో ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ కేంద్రం
ప్రపంచంలోనే అతి పెద్దదైన గూగుల్, వరల్డ్ ఈ కామర్స్ దిగ్గజసంస్థ అమెజాన్ కు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిలిచింది. మైక్రోసాఫ్ట్ ప్రధాన రెండో క్యాంపస్ కూడా మన నగరంలోనే ఉంది. యాపిల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు కూడా ఇక్కడే కేంద్రాలు ఏర్పాటు చేశాయి. దీంతో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డాటా ప్రొటెక్షన్ వంటి సాంకేతికతకు మన నగరం కేంద్రంగా మారబోతోందని సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ టి. ప్రద్యుమ్న చెప్పారు. భారతదేశంలోనే హైదరాబాద్ టెక్ హబ్ గా నిలిచింది. భవిష్యత్ లో ఏఐ,మెషీన్ లెర్నింగ్ రంగాల్లో పెట్టుబడులు అధికంగా రానున్నాయని తెలంగాణ ఐటీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు. ఐటీ ఎగుమతులు పెరగడంతోపాటు లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది.

పెరిగిన ఐటీ ఎగుమతులు
హైదరాబాద్ కేంద్రంగా ఐటీ ఎగుమతులతోపాటు ఉద్యోగావకాశాలు పెరిగాయి. టీహబ్, వీహబ్, రిచ్, తెలంగాణ ఇన్నోవేషన్స్ నెట్ వర్క్, టీఎస్ఐసీ ఇంక్యుబేటర్ల ఏర్పాటుతో ఐటీ రంగం పురోగమించింది. గతంలో రూ.57,258 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులుండగా ప్రస్థుతం 2,41,275 కోట్లకుపైగా పెరిగింది. గతంలో 3,23,396 మంది ఐటీ నిపుణులుండగా, వీరి సంఖ్య 9 లక్షలమందికి పెరిగింది. భవిష్యత్ ఏఐతోనే కొనసాగుతుందనే వార్తలతో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తాము కూడా ఏఐలో నైపుణ్యం సాధించేందుకు మద్రాస్ ఐఐటీ, యూకేలోని బర్మింగ్ హామ్ యూనివర్శిటీ సంయుక్తంగా కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ ఎమ్మెస్సీ కోర్సులో చేరానని చెప్పారు ఐఐటీ మాజీ విద్యార్థి ఎస్.ఎం. షరీఫ్.



Read More
Next Story