మజ్లిస్,బీజేపీల వినూత్న ప్రచారం..విజయం ఎవరిని వరించేనో?
x
Madhavi Latha,Asaduddin innovative campaign

మజ్లిస్,బీజేపీల వినూత్న ప్రచారం..విజయం ఎవరిని వరించేనో?

పాతబస్తీలో పోటీ చేస్తున్న మజ్లిస్, బీజేపీ అభ్యర్థులు వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు.ఒవైసీ బైక్‌పై,మాధవీలత ఇంటింటికి తిరుగుతున్నారు.


హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మజ్లిస్, బీజేపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ వర్సెస్ మాధవి లత పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. హైదరాబాద్‌లోని బహిరంగ సభ వేదిక వద్దకు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తన అనుచరులు వెంటరాగా బైక్‌పై పాత బస్తీ గల్లీల్లో వెళుతూ సామాన్యునిలా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

- తలకు హాఫ్ హెల్మెట్ పెట్టుకొని బైక్ పై వెళుతున్న అసద్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెహాన్ బీఫ్ షాపు జిందాబాద్ అంటూ అసద్ వ్యాఖ్యలు చేయడం వివాదం రేపింది.
- మరో వైపు బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత కూడా బాణం ఎక్కుపెట్టి,డాన్సులు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.
- ఇద్దరు అభ్యర్థుల వినూత్న ప్రచారం పాతబస్తీలో చర్చనీయాంశంగా మారింది.

బైక్ పై వెళుతూ ప్రచారం చేస్తున్న మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ


గాలిపటం ఎగురవేస్తున్నట్లు అసద్ ప్రచారం

పాతబస్తీలో బైక్ పై తిరుగుతూ, బహిరంగసభల్లో పాల్గొంటూ. పాదయాత్రగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను పలకరిస్తూ అసదుద్దీన్ ఓట్ల వేట సాగిస్తున్నారు. సభల్లో గాలిపటం ఎగురవేస్తున్నట్లు రెండు చేతుల హావభావాలతో తన ఎన్నికల గుర్తు అయిన గాలిపటాన్ని ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఐదోసారి గెలవాలని అసదుద్దీన్ ఒవైసీ లక్ష్యంగా పెట్టుకొని ప్రచార వ్యూహాలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. రెహాన్ బీఫ్ షాపు జిందాబాద్ అంటూ గోవధను సమర్థించిన అసదుద్దీన్ పై కేసు పెట్టాలని బీజేపీ అభ్యర్థి మాధవీలత ఫిర్యాదు చేశారు.

గాలిపటం కటింగ్ చేస్తూ మాధవీలత ప్రచారం
మరోవైపు హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవీలత హైదరాబాద్‌లోని ఓల్డ్‌ సిటీలో ఇంటింటి ప్రచారం చేస్తూ మహిళలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఒపెన్ టాప్ జీపులో ర్యాలీలు జరుపుతూ మజ్లిస్ ఎన్నికల గుర్తు అయిన గాలిపటాన్ని కటింగ్ చేస్తూ హావభావాలతో ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే మసీదు వైపు బాణం ఎక్కుపెట్టి సంధించినట్లు హావభావాలు ప్రదర్శించడంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. మరో వైపు మాధవీలత కమలం గుర్తును చేత్తో పట్టుకొని ఓటర్లకు చూపిస్తూ కమలం గుర్తుకే ఓటేయాలని కోరుతూ ముందుకు వెళుతున్నారు. అక్కడక్కడా స్థానిక మహిళలతో మాట్లాడుతూ, వారితో కలిసి డాన్సులు చేస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారు.

కమలం గుర్తు చూపిస్తూ మాధవీలత ఇంటింటి ప్రచారం


హైకోర్టును ఆశ్రయించిన మాధవీలత

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత తనపై పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎఐఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీలు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల్లో గెలుస్తున్నాయని హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఆరోపించారు.వీడియోలను మార్ఫింగ్ చేసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించే కాంగ్రెస్ పార్టీ. విద్వేషంతో కూడిన ప్రసంగాలు చేసే మజ్లిస్ వంటి పార్టీలపై చర్యలు తీసుకోవాలని మాధవీలత కోరారు. మజ్లిస్ నేతలు పోలింగ్‌ స్టేషన్లలో బోగస్ ఓట్లు వేస్తారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో గత 40 ఏళ్లలో ఒవైసీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆమె విమర్శించారు.

హైదరాబాద్ ప్రచారరంగంలో దిగనున్న రాజాసింగ్
బుధవారం పాతబస్తీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత రోడ్ షోలో పాల్గొనేందుకు రాజాసింగ్ ఎట్టకేలకు అంగీకరించారు. ఇన్నాళ్లు హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారానికి రాజాసింగ్ దూరంగా ఉన్నారు.
- హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వినూత్న ప్రచారంతో బీజేపీ అభ్యర్థి మాధవీలత, మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీలు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరి వినూత్న ప్రచారం విజయాన్ని చేకూర్చి పెడుతుందో జూన్ మొదటివారంలో జరగనున్న ఓట్ల లెక్కింపు పర్వంలో తేలనుంది.








Read More
Next Story