తెలంగాణ సూపర్ సిక్స్ నియోజకవర్గాలివే...
తెలంగాణలో ఆరు కీలక పార్లమెంట్ నియోజకవర్గాలపై అందరూ దృష్టి సారించారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పార్లమెంట్ పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
సికింద్రాబాద్, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ప్రధాన పార్టీల పక్షాన ప్రముఖులు పోటీ చేస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
- తెలంగాణలో అధిక పార్లమెంట్ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ సాగుతోంది. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచినా నువ్వా? నేానా? అన్నట్లు ద్విముఖ పోరు నెలకొంది.
- ఎన్నికల ప్రచార పర్వం ముగిసి పొలింగ్ పర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పోరుపై ‘ఫెడరల్ తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం...
సికింద్రాబాద్‌లో త్రిముఖ పోటీ
2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో వరుస విజయాలతో కమలం కంచుకోటగా మారిన సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో సిట్టింగ్ ఎంపీ అయిన కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ సారథి జి కిషన్‌రెడ్డి పోటీ చేస్తుండటంతో ఈ స్థానం ప్రతిష్ఠాత్మకంగా మారింది. కేంద్రమంత్రిపై సీనియర్ నేతలైన శాసనసభ్యులు దానం నాగేందర్(కాంగ్రెస్ పార్టీ), టి పద్మారావు గౌడ్ (బీఆర్ఎస్) అభ్యర్థులుగా గట్టి పోటీ ఇస్తున్నారు. కేంద్రమంత్రిగా తాను సికింద్రాబాద్ ప్రగతి కోసం చేసిన పనులను చెబుతూ కిషన్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెల్చుకోగా, నాంపల్లి స్థానాన్ని మజ్లిస్ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఫలితాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ కు అత్యధికంగా 4.63 లక్షల ఓట్లు వచ్చాయి. 2.8 లక్షల ఓట్లతో కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలిచింది. 2.16 లక్షల ఓట్లతో బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల తరపున సీనియర్ నేతలు అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది.
కరీంనగర్‌లో పోటాపోటీ
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పోటీ చేస్తుండటంతో ఈ స్థానంపై అందరూ దృష్టి సారించారు. హిందూ సెంటిమెంట్ రగిలిస్తూ ప్రచారంలో బండి సంజయ్ దూసుకుపోతుండగా, దాన్ని నిలువరించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు వెలిచాల రాజేందర్ రావు, వినోద్ కుమార్ లు శ్రమించారు. మాజీ ఎంపీ అయిన రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తాను గతంలో కరీంనగర్ స్మార్ట్ సిటీతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓటర్లకు వివరించి చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరో వైపు 2023 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంది. దీంతో తమ పార్టీకి అసెంబ్లీ ఫలితాలు రిపీట్ అయి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు గెలుస్తారని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ విశ్వాసంతో ఉన్నారు. మొత్తంమీద కరీంనగర్ లో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
హైదరాబాద్‌లో ద్విముఖ పోరు
మజ్లిస్ కంచుకోట అయిన హైదరాబాద్ లోక్ సభ బరిలో ప్రధాన పార్టీల నుంచి నలుగురు అభ్యర్థులు నిలిచినా, ప్రధాన పోటీ మజ్లిస్, బీజేపీల మధ్యనే నెలకొంది. యాభై ఏళ్లుగా విజయం సాధిస్తూ మజ్లిస్ కంచుకోటలో పాగా వేయాలని బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత యత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనదైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన అసదుద్దీన్ ఈ సారి ఓట్లు చీలకుండా ఉండేందుకు ఎంబీటీ అభ్యర్థిని బరిలో లేకుండా రాజీ కుదుర్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో 60 శాతానికి పైగా ఉన్న ముస్లిం ఓట్లతో మరోసారి పతంగ్ ఎగురవేసేందుకు అసదుద్దీన్ యత్నిస్తున్నారు. హిందూత్వ ఏజెండాతో గంపగుత్తగా హిందూ ఓట్లను పొందడం ద్వారా విజయం సాధించాలని మాధవీలత పోరాడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో ద్విముఖ పోరు నెలకొంది.
నిజామాబాద్‌లో పోరు ఆసక్తికరం
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ప్రయత్నం చేస్తున్నారు. పసుపుబోర్డు సాధించిన ఉత్సాహంతో పసుపు రైతుల ఓట్లతో తాను మళ్లీ ఎంపీ అయ్యేందుకు అర్వింద్ వ్యూహాలు రూపొందించారు. రైతులు అధికంగా ఉన్న నిమాజాబాద్ పార్లమెంట్ స్థానంలో నిజాం షుగర్స్ కర్మాగారాలను తెరిపించేందుకు కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్న చర్యలతో చెరకు రైతుల్లో ఆ పార్టీ పట్ల మొగ్గు కనిపిస్తోంది. పసుపు రైతులు బీజేపీ పక్షాన, చెరకు రైతులు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి బరిలో నిలిచారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు హామీలిస్తూ జీవన్ రెడ్డి ఓట్ల వేట సాగిస్తున్నారు. మరో వైపు బీఆర్ఎస్ పక్షాన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రైతులే నిర్ణయాత్మక పాత్ర పోషించే నిజామాబాద్ బరిలో పార్లమెంట్ పోరు ఆసక్తికరంగా మారింది.
మల్కాజిగిరిలో ముమ్మర పోరు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు కమలనాథులు ఉవ్విళూరుతున్నారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రచారంలో ముందున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డిని ఎన్నికల బరిలో దించిన సీఎం రేవంత్ రెడ్డి అత్యధికంగా 9 సార్లు ఇక్కడ ప్రచారం చేశారు. గ్యారంటీల అమలు తమకు విజయాన్ని చేకూర్చి పెడతాయని కాంగ్రెస్ ఆశిస్తోంది. మల్కాజిగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం, క్యాడర్ తో స్థానికుడైన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. అసెంబ్లీ ఫలితాలు రిపీట్ అయితే తమకే విజయం వరిస్తుందని లక్ష్మారెడ్డి చెబుతున్నారు. అతిపెద్ద నియోజకవర్గంతో పాటు వలస ఓటర్లు అధికంగా ఉన్న మల్కాజిగిరిలో వలస ఓటర్లు వారి వారి సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లి పోయిన నేపథ్యంలో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం కనిపిస్తోంది. మొత్తంమీద మల్కాజిగిరిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది.
ఖమ్మంలో నువ్వా?నేనా అన్నట్లు పోటీ
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నా, ప్రధానంగా పోటీ ఇద్దరు నేతల మధ్యనే ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన నామ నాగేశ్వరరావు మరోసారి బరిలో దిగారు. ఖమ్మంలోనే నివాసముంటున్న నామాకు నియోజకవర్గంలో ఓటర్లతో నేరుగా పరిచయాలున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల క్యాడర్ నామా కోసం శ్రమిస్తోంది. ఎంపీగా తాను చేసిన ప్రగతి పనులు, తన తండ్రి నామ ముత్తయ్య ట్రస్టు నిధులతో చేసిన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని నామ ధీమాగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ కంచుకోట అయిన ఖమ్మం పార్లమెంట్ పరిధిలో గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ మిత్ర పక్షమైన సీపీఐ ఎమ్మెల్యే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల బలం, బలగం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డికి మద్ధతుగా నిలిచారు. మరో వైపు మోదీకున్న క్రేజుతో తానే గెలుస్తానని బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు చెబుతున్నారు. మొత్తం మీద ఖమ్మం గుమ్మంలో ప్రధాన పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ఉంది.
Next Story