హైదరాబాద్ కిర్తీ కిరీటంలో మరో కలికితురాయి
x
పచ్చటి చెట్లతో అలరారుతున్న నగర రోడ్డు అందాలు

హైదరాబాద్ కిర్తీ కిరీటంలో మరో కలికితురాయి

గ్లోబల్ సిటీ హైదరాబాద్ కిర్తీ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సిటీ నేచర్ ఛాలెంజ్ కార్యక్రమంలో రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది.


హైదరాబాద్ నగరంతోపాటు నగర శివార్లలోనూ వివిధ రకాల ఎతైన పచ్చని చెట్లు...పచ్చని మొక్కలతో అలరారుతున్న పార్కులు నగర వాసులకు పచ్చదనంతో పాటు ఒకింత ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. జల కళతో ఉట్టిపడుతున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట, అమీన్ పూర్ లాంటి పలు సరస్సులు...రంగురంగుల పక్షుల కిలకిల రావాలతో నగర శోభ మరింత పెరిగింది.

- ప్రపంచవ్యాప్తంగా గత నెలలో జరిగిన సిటీ నేచర్ ఛాలెంజ్‌లో మన హైదరాబాద్‌ నగరం రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలోని పలు నగరాల్లో సాగుతున్న సిటీ నేచర్ ఛాలెంజ్ ఈవెంటులో హైదరాబాద్ గత ఏడాది పాల్గొనడం ప్రారంభించింది. సిటీ నేచర్ ఛాలెంజ్ పోటీల్లో మన భారత దేశంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్‌లోని నానక్‌మట్ట రెండవ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌కు రెండో ఏడాది ‘‘ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్’’ ట్యాగ్ లభించింది.
- ప్రపంచ వ్యాప్తంగా సిటీ నేచర్ వార్షిక గ్లోబల్ ఛాలెంజ్ పోటీల్లో 670కి పైగా నగరాలు పాల్గొన్నాయి. ఆసియా ఖండంలోనే హైదరాబాద్ననగరం హాంకాంగ్ తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది. లా పాజ్, బొలీవియా, మాంటెర్రీ మెక్సికో, శాన్ ఆంటోనియో నగరాలు ప్రపంచంలోని మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

సిటీ నేచర్ ఛాలెంజ్ లో 2,092 జాతుల వృక్షాలు
గత నెలలో హైదరాబాద్ నగరంలో నాలుగు రోజుల పాటు జరిగిన నేచర్ ఛాలెంజ్ ఈవెంట్‌లో 527 మంది పరిశీలకులు 2,092 జాతులకు చెందిన చెట్లను గుర్తించారు. పర్యావరణ ప్రేమికులైన పరిశీలకులు నాలుగు రోజుల్లో 34,388 చెట్లను పరిశీలించారు. 262 వేప చెట్లు,135 సేక్రెడ్ ఫిగ్ చెట్లను ఎక్కువగా చూశారు. పచ్చని ఎతైన చెట్లే కాకుండా 206 నెమళ్లు,వందలాది రెడ్-వెంటెడ్ బుల్బుల్ పక్షులను చూసి వాటి ఫొటోలు క్లిక్ మనిపించారు. సిటీ నేచర్ ఛాలెంజ్ ఈవెంటులో గత ఏడాది 350 మంది పర్యావరణ ప్రేమికులు పాల్గొనగా ఈ ఏడాది 527 మందికి పెరిగినట్లు పర్యావరణ ప్రేమికుడు, బర్డ్ వాచర్ శ్రీరామ్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాము ఈ ఏడాది గుర్తించిన వివిధ రకాల జాతుల వృక్షాల సంఖ్య 2,092కి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

సిటీ నేచర్ ఛాలెంజ్ ప్రారంభం ఎక్కడంటే...
ప్రపంచ వ్యాప్తంగా సిటీ నేచర్ ఛాలెంజ్‌ను కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన అలిసన్ యంగ్, రెబెక్కా జాన్సన్, లాస్ ఏంజిల్స్ కౌంటీలోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని లీలా హిగ్గిన్స్ ప్రారంభించారు. ఈ పోటీ మొదట లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోకు మాత్రమే పరిమితమైంది. తర్వాత నేచర్ ఛాలెంజ్ ప్రపంచంలోని ఇతర నగరాలకు విస్తరించారు.

నగర జీవవైవిధ్యం డాక్యమెంట్ చేయడమే లక్ష్యం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగర జీవవైవిధ్యాన్ని డాక్యుమెంట్ చేయడమే సిటీ నేచర్ ఛాలెంజ్ లక్ష్యమని పర్యావరణ ప్రేమికులు ప్రణవ్, అశ్వటిబిజు, గురు ముఖి, ప్రగ్యామౌడ్గిల్ చెప్పారు. హైదరాబాద్ సిటీ నేచర్ ఛాలెంజ్ 2024 ఈవెంట్ నగరంలోని ఫారెస్ట్ కాలేజీ, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, మంజీరా డ్యామ్, అనంతారం, ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, బయోడైవర్శిటీ పార్కు, కేబీఆర్ తదితర పార్కుల్లో సాగింది. ప్రకృతి ప్రేమికుల్లో చైతన్యం నింపి ఉన్న చెట్లను ఫొటోలు తీసి వాటిని ఆన్ లైన్ లో పోస్టు చేస్తుంటామని శ్రీరామ్ రెడ్డి వివరించారు.

చెట్లను నరక వద్దు...
హైదరాబాద్ నగర వీధుల్లో ప్రతిరోజూ చెట్లను నరికివేస్తుండటం పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది. చెట్ల నరికివేత పర్యవసానంగా హైదరాబాద్ నగరవాసులు 45 డిగ్రీలకుపైగా సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై వేసవి వేడితో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చెట్లు నరికివేతతో పాటు భవనాల నిర్మాణంతో హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్ గా మారింది. నగరంలో చెట్లను సంరక్షించడానికి పర్యావరణ ప్రియులు యత్నాలు ప్రారంభించారు. చెట్లను పెంచితే ప్రకృతి సోయగాలతో పాటు క్రిమికీటకాలు, పక్షలు, జంతుజాలాలతో అలరారుతూ పర్యవరణ సమతౌల్యం ఏర్పడుతుందని పర్యావరణ ప్రేమికుడు శ్రీరామ్ రెడ్డి చెప్పారు.

చెట్ల సంరక్షణకు ప్రత్యేక కమిటీ
హైదరాబాద్ నగరంలో చెట్లను సంరక్షించడానికి 8 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఎన్జీవోలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ, తెలంగాణ అటవీ శాఖ ప్రతినిధులు ఉన్నారు. చెట్లను నరకకుండా ట్రాన్స్‌లోకేట్ చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఉన్న చెట్లను పరిరక్షించడం, మొక్కలు నాటడం ద్వారా హైదరాబాద్ నగరంలో పచ్చదనాన్ని పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని పర్యవరణ ప్రేమికులు పవన్,వనప్రేమి, గంగాధరి సాయిప్రకాష్, వర్షా కృష్ణ చెప్పారు.


Read More
Next Story