డిసెంబర్ 6కు ఒక ప్రత్యేకత ఉంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేసిన రోజు. అయినా విజయవాడ ఆంధ్రరత్న భవన్‌ లో చడీచప్పుడు లేదు


2023 డిసెంబరుకు ఒక ప్రత్యేకత ఉంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేసిన రోజు. అయినా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ కళకళలాడలేదు. రోజూ వచ్చే ఆ నలుగురు తప్ప ప్రజలు రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆంధ్రరత్న భవన్‌పై మిగ్‌జాం తుపాన్‌ గాలులకు రెపరెపలాడుతున్నా భవనంలో పట్టుమని పదిమంది కూడా కనిపించలేదు. ఇక్కడ కట్‌ చేస్తే...

తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. తెలంగాణలో ఉన్న ఆంద్రోళ్లు కాంగ్రెస్‌ను ఆదరించినట్లు వార్తలొచ్చాయి.
ఒకప్పుడు హేమాహేమీలతో ఉండే విజయవాడ ఆంధ్రరత్న భవన్‌ పదేళ్లుగా ఒకింత చిన్నబోయింది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఆంధ్రరత్న భవన్‌ ఓ పెద్ద వేదిక. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరు వచ్చినా ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండే వారు. విభజన తరువాత కృష్ణా జిల్లా కాంగ్రెస్‌ నాయకత్వం ఉండే ఆంధ్రరత్న భవన్‌ రాష్ట్ర కార్యాలయంగా మారింది. 2014 నుంచి 2023 వరకు పేరుకు రాష్ట్ర కార్యాలయమే కాని అప్పుడప్పుడు నాయకులు తప్ప కార్యకర్తలు, కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు కనిపించకుండా పోయారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడుగా ఉన్న కడియాల బుచ్చిబాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో తన అనుచరులతో చేరారు. అప్పటి నుంచి జిల్లా నాయకత్వం పూర్తిగా వీక్‌ అయింది. విజయవాడ నగరంలో ఒక్క కార్పొనేటర్‌ కూడా గెలవక పోవడంతో పార్టీ కార్యాలయానికి వచ్చే వారు కరువయ్యారు. పీసీసీ అధ్యక్షుడు వచ్చినప్పుడో, రాజకీయ వ్యవహారాల కమిటీ నాయకులు వచ్చినప్పుడో ఒకరిద్దరు ముఖ్య కార్యకర్తలు కనిపిస్తారు. లేదంటే వారు కూడా రారు.
ఏపీ కాంగ్రెస్‌ నాయకులు ఏమంటున్నారంటే..
ప్రజా బాహుళ్యంలోకి బలంగా చొచ్చుకుపోగల సామాజిక వర్గాలను గుర్తించి పార్టీ నాయకత్వాన్ని వారికి అప్పగించాలి. అశాస్త్రీయ విభజన జరిగిందని ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కేంద్ర నాయకత్వం కూడా ఆ తరువాత విభజన తప్పనే భావనకు వచ్చింది. జరిగిందేదో జరిగింది. భవిష్యత్‌లోనైనా తప్పులు జరగకుండా ఉండాలంటే ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయంపై పోరాడి, విభజన హామీలు అమలు జరిగేలా చూడాలి.
– గిడుగు పద్మరాజు రుద్రరాజు, పీసీసీ అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్‌.
కేంద్రంపై పోరాడాలి
కేంధ్రప్రభుత్వం ఏపీ విభజన సమయంలో విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు పోరాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో ఆలోచన చేస్తున్నది. ఏపీ ప్రజలు భావ సారూప్యత కలిగిన వారు. సెక్యులర్‌ పార్టీని గౌరవిస్తారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తారు.
–కొలనుకొండ శివాజి, ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ.
ఏపీలో కాంగ్రెస్‌ పునరుజ్జీవం పొందుతుందా?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీవం పొందుతుందా? ఇప్పుడు తెలుగు ప్రజల్లో ఇదే చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా ఏపీకి తీరని అన్యాయం చేశారనే కోపంతో కాంగ్రెస్‌ పార్టీని నామరూపాలు లేకుండా ఏపీ ప్రజలు విసిరి పారేశారు. ఈ పదేళ్లలో ఏపీని అభివృద్ధి చేయడంలో తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా అప్పులు చేసి పథకాలు అమలు చేసే పరిస్థితి వచ్చింది. ఈ దశలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా తిరిగి అప్పులు చేయాల్సిందే. వనరుల సమీకరణపై ఏపార్టీ దృష్టిపెట్టడం లేదు.
సమస్యలపై కాంగ్రెస్‌ పోరాటం ఏదీ..
ప్రజలు పూర్తి స్థాయిలో కలిసి వచ్చినా రాకపోయినా ప్రజా ఉద్యమాలు చేయాల్సిన కాంగ్రెస్‌ పార్టీ ఆ వైపుకు అసలు చూడలేదు. పదేళ్లలో కనీసం రోడ్డుపైకి వచ్చి ఒక పెద్ద ఉద్యమాన్ని రూపొందించిన దాఖలాలు లేవు. నాకు తిరుగులేదని భావించిన తెలంగాణ బీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ను అక్కడి ప్రజలు ముక్కు నేలకు రాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎందుకు ఉద్యమాలు కాంగ్రెస్‌ చేయడం లేదనేది కాంగ్రెస్‌ నాయకుల ముందున్న ప్రశ్న. కక్ష సాధింపులు, ప్రజా సంఘాలను నిర్వీర్యం చేయడం, వార్నింగ్‌ బెల్స్‌ మోగించడం, వేదింపులు, అప్పులు, అవినీతి పెరిగిందనే ఆరోపణలు ప్రస్తుత జగన్‌ ప్రభుత్వంపై ప్రతి పక్ష పార్టీ చేస్తున్నది. కానీ ప్రతిపక్ష స్థానంలోనైనా చోటు సాధించుకోవాలనే ఆలోచన కూడా కాంగ్రెస్‌ నాయకులు చేయడం లేదనే విమర్శ కూడా ఉంది.
విభజన హామీలపై ఎందుకు ఉద్యమించడం లేదు..
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపైనా ఉంది. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ఆనాడు బీజేపీ కూడా సమర్థించింది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని బీజేపీ నాయకులు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. విభజన హామీలు అమలైతే ఆంధ్రప్రదేశ్‌కు రెండు లక్షల కోట్లు లాభం వస్తుందని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ప్రత్యేక హోదాపై అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ ఇప్పుడు మాట్లాటం లేదు. ఎన్నికలకు ముందు మా ప్రత్యేక అజెండా ప్రత్యేక హోదానేనని చెప్పిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఇప్పుడు కళ్లూ చెవులూ మూసుకుని కూర్చున్నది. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే మంచిదని చెప్పిన చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ అసలు కళ్లూ చెవులు, నోరు మూసుకొని కూర్చోవడం దేనికి సంకేతం.
దేశంలో కాంగ్రెస్‌ వస్తేనే ఏపీలో ఉద్యమాలు చేస్తారా?
దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో కాంగ్రెస్‌కు ప్రాణ ప్రతిష్ట జరుగుతుందనే భావనలో కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు. ఉత్తర భారతంలో ఇటీవల ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలైంది. కాంగ్రెస్‌ వారి వాదన ఏంటంటే మూడు రాష్ట్రాలు కలిపి మాకు వచ్చిన ఓట్లు సుమారు 4.80కోట్లు, బీజేపీ వారికి వచ్చిన ఓట్లు 4.90కోట్లు అంటే పది లక్షల ఓట్ల తేడాతో అక్కడ బీజేపీ అధికారం చేపట్టింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సెక్యులర్‌ పార్టీ అధికారం చేపట్టాలని ప్రజలు కోరుకుంటారు. తప్పకుండా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భావనంలో కాంగ్రెస్‌ సీనియర్లు ఉన్నారు.
శస్త్ర చికిత్స జరగాల్సిందే..
ప్రస్తుతం ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో 100 మంది బీసీ శాసన సభ్యులు ఉంటే బాగుటుంది. అప్పుడు బీసీలు కాంగ్రెస్‌ పార్టీని ఓన్‌ చేసుకుంటారు. అంతవరకు ఇలాగే ఉంటుందనే భావనంలో కాంగ్రెస్‌ వారు ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే రేవంత్‌ రెడ్డి ఇక్కడి నాయకుల్లో పరకాయ ప్రవేశం చేయాలి. పంచులపై పంచులు వేయాలి. విస్తృతంగా రాష్ట్రమంతా పర్యటించాలని కాంగ్రెస్‌ నాయకుల్లోని కొందరు ముఖ్య నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. మేమున్నాము. మమ్ములను ఆదరించండనే నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలకు కల్పించాలి. అటువంటి వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలనే వాదన కూడా ఉంది. కనీసం పవన్‌కళ్యాన్‌ స్థాయిలో కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనా తీరును ప్రశ్నించే నాయకుడు కాంగ్రెస్‌లో కనిపంచడం లేదు. దేశంలో సోనియా కుటుంబం మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నది. ఆ స్థాయిలో ఏపీలో జగన్‌ విధానాలను ప్రశ్నిస్తేనే కాంగ్రెస్‌కు సరైన చికిత్స చేసినట్లవుతుందనే భావన ప్రతి కాంగ్రెస్‌ వాదిలోనూ ఉంది.
టీమ్‌ రెడీ చేస్తే వికెట్లు పడతాయి
రాష్ట్రంలో సమస్యలపై, అలాగే రాష్ట్ర విభజన చట్టం అమలుపై ఉద్యమాన్ని నిర్వహించేందుకు ఒక టీం రెడీ కావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆటాడటానికి బలమైన టీము ఉంటుందో దానంతటవే వికెట్లు పడతాయి. అలా వికెట్లు పడటం మొదలైందంటే అధికార, ప్రతిపక్ష పార్టీలకు గుండెదడ మొదలవుతుందనటంలో సందేహం లేదనే వాదన కాంగ్రెస్‌ నాయకుల్లో ఉంది. అమరావతి రాజధానిగా ఉండాలని కాంగ్రెస్‌ వాళ్లు ఎక్కడ ఎప్పుడు వాదన వినిపించారు. పోలవరాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులు ఎందుకు ప్రజలకు చెప్పలేకపోయారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేసే సబ్‌ప్లాన్‌ ఏమైంది. ఆ నిధులు ఏ రూపంలో ఖర్చు చేశారనేది ఎవరైనా ఈ ఐదేళ్ళలో కానీ, గత ఐదేళ్లలో కానీ ప్రశ్నించారా? సమస్యలు బోలెడున్నాయి. సమస్యలపై గళం విప్పి పోరాటం చేస్తే తప్పకుండా కాంగ్రెస్‌ను ప్రజలు తిరిగి ఆదరించే అవకాశం ఉంది. కేవలం ఆంధ్రరత్న భవన్‌లో ప్రెస్‌మీట్లకే పరిమితమైతే ఇలాగే ఉంటుంది.
ఈనెల 13న కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం
ఈనెల 13 ఏపీ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ కమిటీలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కనుమూరి బాపిరాజు, పల్లంరాజు, పీసీసీ మాజీ అధ్యక్షులు డాక్టర్‌ శైలజానాథ్, రఘువీరారెడ్డి, నాయకులు కొప్పుల రాజు, డాక్టర్‌ తులసిరెడ్డి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ వంటి ముఖ్యులంతా ఉంటారు. వీరు పీసీసీ అధ్యక్షులు గిడుగు పద్మరాజు రుద్రరాజు నాయకత్వంలో సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఉంది.
Next Story