ఫ్లాష్... ఫ్లాష్: డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్నికల సభలో కాల్పులు
డొనాల్డ్ ట్రంప్‌పై శనివారం హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ప్రాణాపాయమేమీ లేదు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌పై శనివారం హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ప్రాణాపాయమేమీ లేదు.
పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆయన చెవికి రాసుకుంటూ పోయింది. ఈ దృశ్యాలన్నీ లైవ్ టీవీలో రికార్డ్ అయ్యాయి. ఆయన కుడిచెవిపై రక్తం కనబడుతోంది. వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను చుట్టుముట్టి పక్కకు తీసుకెళ్ళారు.
సభలోని ఒక ప్రేక్షకుడు చనిపోయాడని, మరో ఇద్దరు గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. ఇంకా నిర్ధారించవలసిఉంది. ఈ ఘటనతో సభాప్రాంగణమంతా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. ఎఫ్‌బీఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది. వేదికపైకి బయటనుండి ఒక దుండగుడు ఓ ఎత్తయినప్రదేశంనుంచి కాల్పులు జరిపాడని, అతనిని పట్టుకోవటానికి తాము చేసిన ప్రయత్నంలో చనిపోయాడని భద్రతా సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు.
మరోవైపు, ఈ కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోది కూడా ఘటనపై స్పందించారు. మిత్రుడైన ట్రంప్‌పై జరిగిన ఈ హత్యాప్రయత్నంతో తాను తీవ్రంగా కలత చెందానని అన్నారు.