
తెలంగాణ రైతాంగానికి గడ్డుకాలం...యాసంగి సీజన్ నిరాశాజనకం
తెలంగాణలో ఈ ఏడాది యాసంగి సీజన్ రైతులకు నిరాశ మిగిల్చింది. వర్షాభావ పరిస్థితులు, చెరువుల్లో నీరు చేరకపోవడం, తగ్గిన భూగర్భజలాలతో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది...
తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి సీజనులో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గత యాసంగి సీజనులో 72.63 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ సారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఫిబ్రవరి 14వతేదీ నాటికి సాగు విస్తీర్ణం 60.88 లక్షలకే పరిమితమైంది. గత సంవత్సరం నవంబర్, డిసెంబరు నెలల్లో చుక్క వర్షం కూడా కురవలేదు. ఫిబ్రవరి మూడోవారం వచ్చినా యాసంగి సాగు విస్తీర్ణం మాత్రం పెరగటం లేదు. యాసంగిలో సాగు విస్తీర్ణం అక్టోబరు, నవంబర్, డిసెంబరు నెలల్లో కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటుంది. దీంతో పంటల సాగు నిరాశజనకంగా మారింది. ఈ ఏడాది వేసవికి ముందే భూగర్భజలాలు అడుగంటడంతో ఈ వేసవిలో నీటికి కటకట ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి.
తగ్గిన వరిసాగు విస్తీర్ణం
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ లో వరిసాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది వర్షాలు తక్కువగా కురవడం, వేసవికాలం రాకముందే భూగర్భ జలాలు తగ్గిపోయి వ్యవసాయ బోర్లలో నీటిధార తగ్గింది. సాగునీరు రాక వరిసాగు తగ్గింది. గత ఏడాది యాసంగిలో 2,61,055 ఎకరాల్లో వరి సాగు చేశారు. కానీ ఈ ఏడాది 2,31,117 ఎకరాల్లోనే నాట్లు వేశారు. వరిసాగు 29,938 ఎకరాల్లో తగ్గగా, ఆ మేర గత ఏడాది కంటే జొన్న పంట రెట్టింపు విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. గత ఏడాది 19,193 ఎకరాల్లో జొన్న పంట వేయగా ఈ ఏడాది 36,584 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. వేసిన వరి పంట ఈ సారి దిగుబడులు తగ్గవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారంరోజులుగా ఎండలు మండిపోతుండటంతో పాటు వాతావరణ మార్పుల వల్ల చీడపీడల వ్యాప్తి పెరిగే అవకాశముందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అడుగంటిన భూగర్భ జలాలు...రైతుల ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవక పోవడంతో యాసంగి సీజనులో బోర్లలో నీరు అడుగంటింది. తెలంగాణలో బోర్లపై ఆధారపడి రైతులు పంటలు వేస్తుంటారు. వేసవికాలం రాక ముందే భూగర్భజలాల నీటిమట్టం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు సరిగా లేవు. రాష్ట్రంలో 2.31,117 ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా 1,90,000 ఎకరాల విస్తీర్ణం బోర్ల పారకం కిందనే ఉంది. యాసంగి సీజనులో వరి సాగుకు మరో రెండు నెలల పాటు నీళ్లు అవసరం. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో వరి పంటల తడులకు సరిగా బోరు నీరు అందడం లేదు. బోర్లలో నీటి ధారలు తగ్గితే తాము వేసిన వరిపంట ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జలాశయాల్లో తగ్గిన నీటిమట్టం
నాగార్జునసాగర్ జలాశయాంలో నీరు లేక నల్గొండ జిల్లాలో భూగర్భజల మట్టం పడిపోయింది. గత ఏడాది జనవరిలో భూగర్భజలమట్టం 6.22 మీటర్ల దిగువన ఉండగా ఈ ఏడాది 7.72 మీటర్ల దిగువకు పడిపోయిందని తెలంగాణ భూగర్భ జలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు.ఈ ఏడాది తెలంగాణలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో వర్షాభావ పరిస్థితులతో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్ధ్యం 517.81 టీఎంసీలు కాగా ప్రస్థుతం 319.22 టీఎంసీల నీరే ఉంది. నాగార్జునసాగర్ జలాశయంలో నీరు లేక అడుగంటింది. సాగుకు నీరిచ్చే విషయంలో సందిగ్థతతో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయని వ్యవసాయ శాఖ మాజీ అధికారి ఎన్డీఆర్కే శర్మ చెప్పారు.

