వారానికో రోజు బ్యాగ్‌లెస్ స్కూల్...విద్యార్థులకు బ్యాగుల భారం తగ్గేనా?
x
School Students (Photo Credit : Facebook)

వారానికో రోజు బ్యాగ్‌లెస్ స్కూల్...విద్యార్థులకు బ్యాగుల భారం తగ్గేనా?

పాఠశాల విద్యార్థులకు బ్యాగుల భారం తగ్గేనా అంటే అవునంటున్నారు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు.పుస్తకాల బ్యాగుల బరువు తగ్గించడంపై విద్యాశాఖ దృష్టి సారించింది.


పాఠశాల విద్యార్థులపై బ్యాగుల భారాన్ని తగ్గించేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి ఒక రోజు పాఠశాల విద్యార్థులు బ్యాగులు లేకుండా స్కూలుకు రావాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 12వతరగతి వరకు చదివే విద్యార్థులు వారంలో ఒకరోజు బ్యాగులు లేకుండా పాఠశాలకు రావాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాగుల భారం వల్ల పాఠశాల పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు మధ్యప్రదేశ్ విద్యాశాఖ ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో బ్యాగ్ లెస్ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తామని ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్‌ చెప్పారు. విద్యార్థుల బ్యాగ్ బరువును వారు చదివే తరగతి బట్టి నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు.బ్యాగ్ లెస్ స్కూల్ రోజు పిల్లలు ఆటపాటలతో ఆనందంగా గడపాలని, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం మొదలైన వాటిని ఆస్వాదించాలని మంత్రి చెప్పారు. విద్యార్థులకు పాఠశాల అనేది ఒత్తిడికి సంబంధించిన అంశంగా కనిపించకుండా, వారికి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంచాలని మంత్రి వివరించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను పలువురు వైద్యులు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. తమ తెలంగాణ రాష్ట్రంలోనూ వారం వారం బ్యాగ్ లెస్ డేను అమలు చేయాలని పాఠశాల విద్యార్థుల పేరెంట్స్ కమిటీ సభ్యుడు రాపోలు సతీష్ డిమాండ్ చేశారు.


తరగతిని బట్టి పుస్తకాల బ్యాగ్ బరువు ఎంత ఉండాలంటే...
పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఎంత తూకం బ్యాగులు తీసుకెళ్లాలి అనే విషయంలో ఆయా పాఠశాలల యాజమాన్య కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటోంది. 1, 2 తరగతుల విద్యార్థులు స్కూల్ బ్యాగ్ గరిష్ఠ బరువు 1.6 నుంచి 2.2 కిలోలు ఉండాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అలాగే 3 నుంచి 5వ తరగతి వరకు 1.7 కిలోల నుంచి 2.5 కిలోల బరువు ఉన్న బ్యాగ్, 6, 7 తరగతులకు 2 నుంచి 3 కిలోలు, 8వ తరగతికి 2.5-4 కిలోలు, 9,10వ తరగతి విద్యార్థులకు 2.5 నుంచి 4.5. కిలోల బరువుగల బ్యాగ్ తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల విద్యార్థులు నోటు, టెక్స్టుబుక్ లు తీసుకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో పుస్తకాల బ్యాగ్ బరువు పెరిగి విద్యార్థులు బ్యాక్ పెయిన్, వెన్నెముక సమస్యల బారిన పడుతున్నారని యశోదా ఆసుపత్రి స్పైనల్ కార్డ్ మాజీ డాక్టర్ సంజయ్ కుమార్ చెప్పారు.

బ్యాగ్ లెస్ డే రోజు విద్యార్థులకు ఏం బోధిస్తారంటే...
విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ విద్యా విధానం ప్రకారం బ్యాగ్ లెస్ డే రోజు కళలు, క్విజ్, క్రీడలు, క్రాఫ్ట్ లలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. పాఠశాల విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలను చెప్పడం ద్వారా భవిష్యత్ లో వారు కెరీర్ మార్గాల ఎంపికకు తోడ్పడుతుందని బోయిన్‌పల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం. జ్యోతి చెప్పారు. క్రీడలు, ఫ్యాన్సీ-డ్రెస్ పోటీలు, డిబేట్‌లు, రంగోలి,పెయింటింగ్, డ్రామా, కథలు చెప్పడం, వ్యాయామాలు, శుభ్రతకు సంబంధించిన పనులు, నృత్యాలతో సహా అనేక రకాల కార్యకలాపాలు పాఠశాల విద్యార్థులకు బ్యాగ్ లెస్ రోజు నేర్పుతున్నారు. పిల్లలకు యోగా, వ్యాయామ పద్ధతులు, భాష అభ్యాసం నేర్పుతున్నారు. టెక్నాలజీ, లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

తెలంగాణలో ప్రతీ నెల 4వ శనివారం బ్యాగ్ లెస్ డే
తెలంగాణ రాష్ట్రంలో నెలకు ఒకరోజు మాత్రమే బ్యాగ్ లెస్ డే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రతీ నెల 4వ శనివారం పాఠశాల విద్యార్థులకు బ్యాగ్ లెస్ డే నిర్వహిస్తున్నామని, ఆ రోజు విద్యార్థులకు ఆట, పాటల, కథలు చెప్పి, వాటిలో నుంచి ప్రశ్నలు అడుగుతామని నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండల అప్పర్ ప్రైమరీ పాఠశాల సీనియర్ ప్రధానోపాధ్యాయుడు గంజి మారయ్య చెప్పారు. నెలలో సెకండ్ శనివారం సెలవు అని, మూడో శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. నెలలో నాల్గవ శనివారం పాఠశాల విద్యార్థులకు బ్యాగ్ లెస్ డే నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ తరహాలో ప్రతీ వారం పాఠశాల విద్యార్థులకు బ్యాగ్ లెస్ డే నిర్వహించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలంగాణ ఉన్నత విద్యాశాఖాధికారి ఒకరు చెప్పారు.

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలులో బ్యాగ్ లెస్ డే అమలు చేస్తున్నాం : ప్రిన్సిపాల్ ఎం వరలక్ష్మి
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలులో ఎల్‌కేజీ నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు బ్యాగ్‌లెస్ డేను అమలు చేస్తున్నట్లు ఈ పాఠశాల ప్రిన్సిపాల్ ఎం వరలక్ష్మి చెప్పారు.పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు లేకుండా విద్యార్థులకు సృజనాత్మక స్వీయ-అభ్యాస విధానాలను బోధిస్తున్నామని ఆమె చెప్పారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా తాము బ్యాగ్‌లెస్ డేను నిర్వహిస్తున్నామన్నారు. ఎగ్జిబిట్ల తయారీ, డ్రాయింగ్, పెయింటింగ్,పేపర్ కటింగ్, ఫోల్డింగ్, కోల్లెజ్, లీఫ్ ప్రింటింగ్, 3డి ఆప్టికల్ ఇల్యూషన్ డ్రాయింగ్,తోలుబొమ్మల తయారీ, బులెటిన్ బోర్డు తయారీలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. దీనివల్ల విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహం కనిపించిందని ఆమె వివరించారు. బ్యాగ్ లెస్ డే రోజు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వినోదభరితమైన కార్యకలాపాలు చేపడుతున్నామని ప్రిన్సిపాల్ చెప్పారు.

ఈ వేసవిలో వాటర్ బెల్ మార్చి నుంచి అమలు
ఈ వేసవికాలంలో మార్చి 1వతేదీ నుంచి పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేసవిలో ఎండలు ముదురుతుండటంతో విద్యార్థులు గంటన్నరకు ఒకసారి మంచినీళ్లు తాగేందుకు వీలుగా వాటర్ బెల్ పేరిట ఇంటర్వెల్ ఇస్తామని మేడ్చల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు సి. నిర్మల కుమారి చెప్పారు. వాటర్ బెల్ ఇంటర్వెల్ లో విద్యార్థులు మంచినీరు తాగుతుండటం వల్ల వారు డీహైడ్రేషన్ కు గురికాకుండా నివారించవచ్చిని ఉపాధ్యాయులు చెప్పారు.


Read More
Next Story