"ఆకాశంలో సూర్యచంద్రులు, ఆంధ్రాలో బాబు, కళ్యాణ్‌బాబు"
మొదటి ఎపిసోడ్‌లోనే పవన్ ప్రస్తావన తీసుకొచ్చి మెగాభిమానుల్లో కూడా బాలయ్య ఆసక్తి రేకెత్తించారు. బాలయ్య అభిమానులతోపాటు పవన్ అబిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లను ఆకాశానికి ఎత్తేశారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. ఆకాశంలో సూర్యచంద్రులు ఎలాగో, ఏపీలో చంద్రబాబు, కళ్యాణ్ బాబు అలాగ అంటున్నారని చెప్పారు. కొత్తగా ప్రసారం కాబోతున్న ‘అన్‌స్టాపబుల్’ ఓటీటీ షోలో ఆయన ఈ మాటలు అన్నారు. ఈ షో నాలుగో సీజన్ ఈ నెల 25న రాత్రి 8.30కు ‘ఆహా’ ఓటీటీలో ప్రారంభం కాబోతోంది. మొదటి ఎపిసోడ్‌లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇంటర్వ్యూ చేశారు బాలయ్య. ఈ షో రెండో సీజన్ కూడా చంద్రబాబు ఇంటర్వ్యూతోనే ప్రారంభమయింది.
అన్‌స్టాపబుల్ తాజా ఎపిసోడ్ ప్రోమో ఆసక్తి రేకెత్తించేవిధంగా ఉంది. దేశ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరగని విజయాన్ని అందుకున్న చాణుక్యుడు, మా బావగారు, మీ బాబుగారు అని బాలయ్య చంద్రబాబుకు స్వాగతం పలికారు. కక్ష సాధింపు రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చింది. తాను లక్ష్మణరేఖ దాటనని బాబు చెప్పుకొచ్చారు. అయితే ఎట్టి పరిస్థితులలోనూ తప్పు చేసినవారిని వదిలిపెట్టనని అన్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన అరెస్టు గురించి బాలయ్య ప్రశ్నించారు. జైలులో మొదటిరాత్రి ఎలా గడిచిందని అడిగారు. తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన మీటింగ్ అది అని చంద్రబాబు అన్నారు. ఆ జైలు గోడలమధ్య, లోపల అసలు ఏం జరిగిందనేది ప్రజలకు తెలియాలి అని బాలయ్య అడిగారు. రెండు నిమిషాలు, తాను, పవన్ మాట్లాడుకున్నామని చంద్రబాబు చెప్పారు. ఒక నూతనమైన చరిత్ర రాయటానికి సమయస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్న చారిత్రక రోజు అది అని బాబు అన్నారు. గతంలో తాను థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అని చెప్పేవాడినని, ఇప్పుడు థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనేది తన స్లోగన్ అని బాబు చెప్పారు. ఎప్పటికైనా తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉండాలనేది తన ఆకాంక్ష అన్నారు.
తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ, ఆకాశంలో సూర్యచంద్రులు, ఏపీలో చంద్రబాబు, కళ్యాణ్‌బాబు అంటున్నారు అని చెప్పారు. దానికి బాబు బదులిస్తూ, మీరు సినిమాల్లో అన్‌స్టాపబుల్ అయితే, మేము రాజకీయాలలో అన్‌స్టాపబుల్ అన్నారు.
మొదటి ఎపిసోడ్‌లోనే పవన్ ప్రస్తావన తీసుకొచ్చి అటు మెగాభిమానుల్లో కూడా బాలయ్య ఆసక్తి రేకెత్తించారు. దీనితో ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య అభిమానులతోపాటు పవన్ అబిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆహా అనేది అల్లు అరవింద్, మైహోమ్ రామేశ్వరరావులు కలిసి స్థాపించిన ఓటీటీ అన్న సంగతి తెలిసిందే.