అందాలభామలు...పెళ్లి పేరిట ఘరానా మోసాలు
x
పెళ్లి పేరిట అందాల భామల వీడియో ఛాట్‌తో ఘరానా మోసం

అందాలభామలు...పెళ్లి పేరిట ఘరానా మోసాలు

‘ఖూబ్ సూరత్ రిస్టే’ పేరిట మ్యాట్రిమోనియల్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీని క్రియేట్ చేసిన అందాలభామలు...


హైదరాబాద్ నగరానికి చెందిన అనీసా మొహమ్మదీసిన్ హుండేకర్, జోహార్ ఫాతిమా, మరో మహిళ. మొహమ్మద్ అబ్దుల్ అమీర్ లు కలిసి ముఠాగా ఏర్పడి 2023 మార్చి నెలలో ‘ఖూబ్ సూరత్ రిస్టే’ పేరిట ఇన్‌స్టాగ్రామ్ లో ఐడీని క్రియేట్ చేశారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పాకిస్థాన్ దేశానికి చెందిన యూట్యబ్ ఇన్‌ఫ్లుయెన్సర్, సినీనటి అయిన పర్వ్షా షా అనే అందాల భామ ఫొటోను మ్యాట్రిమోనియల్ ఖాతాలో అప్ లోడ్ చేశారు.


యువతి అందానికి పడిపోయిన యువకుడు
అంతే ఆ అందాలభామ అందానికి ఆకర్షితుడైన ఓ హైదరాబాద్ యువకుడు ఆమెను పెళ్లాడుతానంటూ ఫోనులో సంప్రదించాడు. అలా ఈ ముఠా యువతితో పరిచయం ఏర్పడింది. యువకుడి వ్యక్తిగత ప్రొఫైల్ అడిగి, అతన్ని వివాహం చేసుకునేందుకు అంగీకరించినట్లు తెలిపింది. ఆ యువతి యువకుడితో వీడియో కాల్స్ కూడా చేసింది.



ముగ్గులోకి దించింది ఇలా...

తనకు అత్యవసర ఆరోగ్య సమస్యలు వచ్చాయని యువకుడి నుంచి యువతి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. యువతి ఇచ్చిన బ్యాంకు ఖాతాలకు రూ.25 లక్షలను పంపించాడు. ఆపై ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసిన ఫోటో పాకిస్థాన్ దేశానికి చెందిన పర్వ్షా షా నటిదని తెలుసుకున్న బాధిత యువకుడు తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరాడు. (Matrimonial fraud case) కానీ ఘరానా అమ్మాయిలు వారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించారు.

కిలాడీ లేడీల అరెస్ట్
తాను మోసపోయానని గుర్తించిన బాధిత యువకుడు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 66 (సి) 66(డి), ఐటీ యాక్ట్, సెక్షన్ 318 (4),319(2) ల కింద క్రైం నంబరు 1176/2025 పేరిట కేసు నమోదు చేసి నిందితులైన కిలాడీ లేడీలు అనీసా మొహమ్మదాసీన్ హుండేకర్, జోహోర్ ఫాతిమ, మొహమ్మద్ అబ్దుల్ అమీర్ లను అరెస్టు చేశామని ఇన్ స్పెక్టర్ కె ప్రసాదరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మోసం మోడస్ ఆపరేండస్ ఇలా...
వివాహ సంబంధాల పేరిట సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఈ ముగ్గురు నిందితులు ముఠాగా ఏర్పడి మ్యాట్రిమోనీ పేరిట వివిధ వాట్సాప్ గ్రూపుల్లో చేరారని పోలీసులు చెప్పారు. అందమైన అమ్మాయిల ఫోటోలను ఎడిట్ చేసి వాటిని పోస్టు చేసి తాము పెళ్లి కోసం చూస్తున్న వధువులమని చెప్పి మొబైల్ నంబర్లలో సంప్రదిస్తారు. వీరి ఫోటోలను చూసి ఆసక్తి ప్రదర్శిస్తే వారితో వీడియో కాల్స్ చేసి నమ్మించి వివిధ సాకులతో డబ్బులు వసూలు చేస్తుంటారు. కిలాడీ లేడీల నుంచి రెండు మొబైల్ పోన్లు, ట్యాప్, ల్యాప్ టాప్, బ్యాంక్ పాస్ బుక్ లు, చెక్ పుస్తకాలు, డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆన్ లైన్ లో అప్రమత్తంగా ఉండండి
ఆన్‌లైన్‌లో వ్యక్తులతో సంభాషించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఇన్ స్పెక్టర్ కె ప్రసాదరావు కోరారు. డబ్బు కోసం ఏదైనా అభ్యర్థన వస్తే ప్రధాన హెచ్చరికకు సంకేతంగా గుర్తించాలి సూచించారు.ఎవరితోనూ ఆర్థిక వివరాలను ఎప్పుడూ పంచుకోవద్దని, ఓటీపీలులేదా క్రెడిట్ కార్డ్ వివరాలతో సహా ఏదైనా సున్నితమైన వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని పంచుకోవద్దని ఆయన కోరారు. సైబర్ క్రైమ్ మోసానికి గురైన బాధితులు వెంటనే 1930కి డయల్ చేయవచ్చు లేదా cybercrime.gov.inని సందర్శించవచ్చునని ఇన్ స్పెక్టర్ వివరించారు.


Read More
Next Story