తెలుగు రాష్ట్రాల్లో విక్రయించని ‘భారత్ రైస్’...ఎందుకీ తాత్సారం?
x

తెలుగు రాష్ట్రాల్లో విక్రయించని ‘భారత్ రైస్’...ఎందుకీ తాత్సారం?

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారత్ రైస్ ఇంకా విక్రయించడం లేదు. దేశంలో కేంద్రం రాయితీపై విక్రయిస్తున్న ‘భారత్ రైస్’ తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు ఇంకా రాలేదు....

2 mins read

రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోంది. రాయితీపై కేంద్రం విక్రయిస్తున్న ‘భారత్ రైస్’ ను రెండు తెలంగాణ రాష్ట్రాలకు ఇంకా రాలేదు. ప్రజలకు ‘భారత్ రైస్’ను రాయితీ ధరపై కిలో రూ.29లకే ఫిబ్రవరి 6వతేదీ నుంచి విక్రయిస్తామని కేంద్రప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఈ రాయితీ బియ్యాన్ని హైదరాబాద్ నగరంలోని నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్, రిలయన్స్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంచుతామని కేంద్రం ప్రకటించినా ఇంకా బియ్యం నిల్వలను తెలుగు రాష్ట్రాలకు కేటాయించలేదు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపిస్తుందని, దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలైన పన్నులను ఉత్తరాదికి తరలిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా భారత్ రైస్ కూడా ఇంకా కేటాయించ లేదు.

వినియోగదారుల ఆందోళన

భారత్ రైస్ తెలంగాణలోని కేంద్రాలకు ఇంకా తరలించలేదని తెలంగాణ నాఫెడ్ మేనేజర్ వినయ్ కుమార్ చెప్పారు. మూడు రోజులైనా బియ్యం రాకపోవడంతో నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ ఔట్ లెట్లలో శనగపప్పు, గోధుమపిండిని మాత్రమే విక్రయిస్తున్నామని వినయ్ కుమార్ చెప్పారు. కేంద్రం ప్రకటించినా రాయితీ బియ్యం తెలంగాణలో విక్రయించక పోవడం ఏమిటని మహిళా సంఘం నాయకురాలు పద్మ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో తాము రాయితీ బియ్యం కొనుగోలు కోసం తాము చూశామని, కానీ భారత్ రైస్ రాకపోవడం తమకు నిరాశ కల్పించిందని ఓ గృహిణి భాగ్యలక్ష్మి ఆవేదనగా చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం?

తెలంగాణలో ఈ రాయితీ బియ్యాన్ని హైదరాబాద్ నగరంతోపాటు కరీంనగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, ఆదిలాబాద్ నగరాల్లో విక్రయిస్తామని కేంద్రం ప్రకటించినా ఈ బియ్యం అందుబాటులోకి రాలేదు. భారత్ రైస్ తెలుగు రాష్ట్రాలకు చేరకపోవడంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం, తాత్సారం కనిపిస్తుందని వినియోగదారుల సమాఖ్య మాజీ సభ్యుడు బీవీ రమణ ఆరోపించారు. భారత్ బ్రాండ్ బియ్యాన్ని ఈ కామర్స్ లో విక్రయిస్తామని కేంద్రం చెప్పినా అక్కడ కూడా అందుబాటులో లేవు. ఈ కామర్స్ సైట్లలో కూడా రాయితీ బియ్యం అందుబాటులో లేదని హైదరాబాద్ నగరానికి చెందిన వినియోగదారుడు విష్ణువర్ధన్ చెప్పారు. తెలంగాణలో నాన్ ఫోర్టిఫైడ్ రైస్ అందుబాటులో లేనందువల్ల ఇంకా కేటాయింపులు జరగలేదని తెలంగాణ పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు చెప్పారు.

పౌర సరఫరాలశాఖ స్పందనేది?

కారణాలు ఏవైనా రాయితీ బియ్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రారంభించక పోవడంపై పలువురు ఆహార సలహా సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పేద, సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు భారత్ రైస్ పేరిట పథకాన్ని కేంద్రం దేశ వ్యాప్తంగా ప్రారంభించినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ బియ్యాన్ని ఇంకా అందుబాటులోకి తీసుకు రాకపోవడంపై వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాయితీ భారత్ రైస్ విక్రయించకున్నా ఆయా రాష్ట్రాల పౌర సరఫరాలశాఖ అధికారులు, మంత్రులు మాత్రం స్పందించక పోవడం విశేషం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ రైస్ విక్రయానికి తెర లేపిందని కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ ఆరోపించారు.

Read More
Next Story