చేవెళ్ల బిగ్ ఫైట్, సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డితో కొండా, కాసానీ ఢీ
ముగ్గురు దిగ్గజ నేతలు..వారు వేర్వేరు పార్టీల్లో కీలక స్థానాల్లో పనిచేశారు..వారు ముగ్గురూ పార్టీలు మారి మూడు పక్షాల తరపున చేవేళ్ల ఎంపీ ఎన్నికల బరిలో నిలిచారు.
చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ జి రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకులు. మూడు పార్టీల్లో పనిచేసిన ముగ్గురు కీలక నేతలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు మారారు...జెండా రంగులు మార్చారు...కొత్త ఎన్నికల గుర్తులపై చేవెళ్ల ఓటర్ల తీర్పు కోసం బరిలో నిలిచారు. ముగ్గురు కీలక నేతలు ఆర్థికంగా బలోపేతులు కావడంతో చేవెళ్లలో హోరాహోరీ తలపడుతున్నారు. దీంతో చేవెళ్ల రణరంగం రసవత్తరంగా మారింది.
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం రాజధాని నగరమైన హైదరాబాద్‌కు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నగర శివార్లలోని శేరిలింగపల్లి, రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడిన ఈ కీలక చేవెళ్ల నియోజకవర్గం నుంచి హేమాహేమీలైన నేతలు రంగంలోకి దిగడంతో ఎన్నిక కీలకంగా మారింది. ఈ ఎంపీ పరిధిలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ పార్లమెంట్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బలబలాలు, బలగం ఎలా ఉన్నా ఉద్ధండులైన ముగ్గురు అభ్యర్థులు మూడు వేర్వేరు పార్టీల తరపున ఎన్నికల బరిలో నిలిచారు. చేవెళ్ల పార్లమెంటు బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు విభిన్న రాజకీయ గుర్తింపు ఉంది. ఒకప్పుడు బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలుగా పనిచేసిన వారు కావడం విశేషం.
2019వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన జి రంజిత్ రెడ్డి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి...ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థిగా కండువా వేసుకొని ఎన్నికల బరిలోకి దిగారు. నాటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రన్నరప్‌గా నిలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మరో వైపు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కీలకస్థానంలో పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అనూహ్యంగా గులాబీ కండువా కప్పుకొని ఆ పార్టీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
చేవెళ్లలో ముచ్చటగా మూడు సార్లు ఎన్నికలు
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2009వ సంవత్సరంలో ఏర్పాటైన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు ముచ్చటగా మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009వ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి చేవెళ్ల నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయదుందుభి మోగించారు. అనంతరం 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొత్త అభ్యర్థి జి రంజిత్ రెడ్డి విజయబావుటా ఎగురవేశారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.
గత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే...
2019 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచారు. తన సమీప కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి విశ్వేశ్వర్ రెడ్డిపై 14,317 ఓట్ల తేడాతో రంజిత్ విజయం సాధించారు. రంజిత్ రెడ్డికి 5,28,148 ఓట్లు రాగా, విశ్వేశ్వర్ రెడ్డికి 5,13,831 ఓట్లు వచ్చాయి.ఆ ఎన్నికల్లో బీజేపీకి చెందిన బి. జనార్దన్ రెడ్డికి 2,01,960 ఓట్లు సాధించారు. 2014పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అప్పట్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేయగా ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. అంతకు ముందు 2009 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 1.12 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే చేవెళ్లలో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 2009 వ సంవత్సరం నుంచే పెరుగుతూ వస్తోంది.
బీఆర్ఎస్ బలం, బలగం పనిచేసేనా?
చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం, బలగం పార్లమెంట్ ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపిస్తుందనే అంశంపై ఆధారపడి ఎన్నికల ఫలితం ఉంటుంది. మహేశ్వరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్ ఉంది. మాజీమంత్రి ఇంద్రారెడ్డి భార్య అయిన సబితకు అనుచరగణం ఉంది. చేవెళ్లలో బీఆర్ఎస్ విజయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ కు కానుకగా ఇస్తానని సబితా ఇంద్రారెడ్డి ఇటీవల ప్రతిజ్ఞ చేశారు.‘‘బలం, బలగం ఉన్న తమ పార్టీ అభ్యర్థే గెలుస్తారు’’ అని సబిత చెప్పారు.
సీఎం రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా టి ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. ఇటీవల ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాను బీఆర్ఎస్ లో కొనసాగుతానని గౌడ్ ప్రకటించారు. ‘‘గతంలో ఎంపీలుగా పనిచేసిన రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డిలు బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారు, అందుకే బీసీ అభ్యర్థిని మా బీఆర్ఎస్ కార్యకర్తలు గెలిపించుకుంటారు’’ అని ప్రకాశ్ గౌడ్ ధీమాగా చెప్పారు. చేవెళ్ల ఎమ్మెల్యేగా కాలే యాదయ్య కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కూడా పార్టీ మారవచ్చని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే తాను నియోజకవర్గ నిధుల కోసమే తాను సీఎంను కలిశానని కాలే యాదయ్య వివరణ ఇచ్చారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. నలుగురు ఎమ్మెల్యేల బలం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఏమేర ఉపయోగపడుతుందనేది ఫలితాల్లో తేలనుంది.
అధికార అండతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం
సిట్టింగ్ ఎంపీ జి.రంజిత్ రెడ్డి కి బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో పాటు ఆయన కూడా పోటీకి నిరాసక్తత వ్యక్తం చేశారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము అమలు చేసిన గ్యారంటీలను ప్రచారాస్త్రంగా మలచుకొని, అభివృద్ధి కోసం తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ బలహీనపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చేవెళ్ల పరిధిలోని కొందరు బీఆర్ఎస్ కీలక నేతల ఫిరాయింపులతో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కుమార్తె రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం
చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం ఆ పార్టీ అభ్యర్థికి లాభించే అవకాశముంది. వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, స్పీకర్ జి ప్రసాద్ కుమార్, తాండూర్ ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ముగ్గురు కీలక కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి శ్రమిస్తున్నారు.
టీటీడీపీ నుంచి గులాబీ దళంలో చేరిన కాసాని
కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్‌ఎస్‌లో చేరకముందు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండటంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన కాసాని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈయన ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాపరిషత్ ఛైర్మన్ గా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ముదిరాజ్ బీసీ సామాజికవర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈయన చేవెళ్లలో మొదటి సారి పోటీ చేస్తున్నారు.
చేవెళ్లలో కమలం వికసించేనా?
2014వ సంవత్సరంలో చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్ ఎంపీగా ఎన్నికైన విశ్వేశ్వర్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాషాయ జెండా కప్పుకున్న ఈయన ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఎన్నికల బరిలో దిగారు. విశ్వేశ్వరెడ్డికి రాజకీయ నేపథ్యముంది. ఈయన మాజీ డిప్యూటీ సీఎం కొండా వెంకట రంగారెడ్డి మనవడు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కొండా మాధవ రెడ్డి కుమారుడు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డికి అల్లుడు. విశ్వేశ్వర్ రెడ్డి భార్య సంగీతారెడ్డి అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సంగీతారెడ్డి కూడా తన భర్త కోసం ప్రచారం ప్రారంభించారు. ‘‘మోదీ గత పదేళ్లలో చేసిన అభివృద్ధి పనుుల, మోదీ మానియా, తన రాజకీయ నేపథ్యం, గతంలో ఎంపీగా చేసిన అభివృద్ధి పనులు నన్ను గెలిపిస్తాయి’’ అని విశ్వేశ్వరెడ్డి చెప్పారు.
Next Story