కవాల్ సరస్సుల్లో పక్షుల కళకళ: ఆసియన్ నీటి పక్షుల గణన 2026 విజయవంతం
x
కవాల్ సరస్సులో పక్షుల సందడి

కవాల్ సరస్సుల్లో పక్షుల కళకళ: ఆసియన్ నీటి పక్షుల గణన 2026 విజయవంతం

తెలంగాణలో వలస పక్షుల స్వర్గధామంగా కవాల్ అభయారణ్యం, పదివేల కిలోమీటర్ల ప్రయాణం చేసి కవాల్‌కు చేరిన విదేశీ పక్షులు.


తెలంగాణ రాష్ట్రంలోని కవాల్ అభయారణ్యం మరోసారి వలస పక్షుల సందడితో కళకళలాడింది. జనవరి 3 నుంచి 18 వతేదీ వరకు నిర్వహించిన ఆసియన్ వాటర్‌బర్డ్ సెన్సస్ 2026లో (Asian Waterbird Census 2026) 70కి పైగా దేశ–విదేశీ నీటి పక్షి జాతులు నమోదయ్యాయి.యూరప్, ఉత్తర ఆసియా ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన వలస పక్షులు (Bird activity) కవాల్ అభయారణ్యంలోని సరస్సులను (Kawal lakes) మళ్లీ జీవంతో నింపాయి. ఆసియన్ నీటి పక్షుల గణన–2026లో ఈ అద్భుత దృశ్యం వెలుగులోకి వచ్చింది.నీరు, నిశ్శబ్దం, సహజ ఆవాసాలు ఉంటే పక్షులు అవే వస్తాయని కవాల్ అభయారణ్యంలో జరిగిన ఆసియన్ నీటి పక్షుల గణన మరోసారి నిరూపించింది.




తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కవాల్ అభయారణ్యంలో అటవీశాఖ, హైదరాబాద్ కన్జర్వేషన్ సొసైటీల ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి జనవరి 18వతేదీ వరకు ఆసియన్ నీటి పక్షుల గణన విజయవంతంగా జరిగింది. ఆదివారంతో ముగిసిన ఈ సర్వేలో పలు 70కి పైగా వివిధ పక్షి జాతులను పక్షిప్రియులు నమోదు చేశారు. హైటికాస్ వాలంటీర్లు, అటవీశాఖ ఉద్యోగులు ఈ ఆసియన్ నీటి పక్షుల గణనలో పాల్గొన్నారు. ఆసియన్ నీటి పక్షుల సర్వే నేడు(ఆదివారం) జనవరి 18వతేదీన ముగిసింది. ఈ సర్వేలో అరుదైన విదేశీ పక్షులు దర్శనమిచ్చాయి.




పదివేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన విదేశీ పక్షులు

కవాల్ అభయారణ్యం ఉడుంపూర్ అటవీ రేంజ్‌ పరిధిలోని గాదం చెరువు, కల్పకుంట, దోస్త్‌నగర్ సరస్సు, జన్నారం రేంజ్‌లోని కిష్టాపూర్ సరస్సు, బీర్సాయిపేట రేంజ్‌లోని బీర్సాయిపేట ప్రాంతాల్లోని అయిదు సరస్సుల్లో పలు విదేశాల నుంచి వచ్చిన వలస పక్షులు (Migratory Birds) కనువిందు చేశాయి. యూరోప్, ఉత్తర ఆసియాకు చెందిన పక్షులు ఉన్నట్లు పక్షిప్రియులు గుర్తించారు. ఉత్తర యూరేషియా, యూరప్ ప్రాంతాల నుంచి 10,000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కవాల్ లోని సరస్సులకు తరలివచ్చాయి. శీతాకాలం కావడంతో ఉత్తర ఆసియా,యూరోప్ ప్రాంతాల నుంచి జలచర పక్షులు ఎక్కువగా వలస వచ్చాయని ఈ సర్వేలో తేలింది.విదేశీ వలస పక్షులకు కావాల్సిన ఆహారం,విశ్రాంతి, అనువైన ఆవాసాలు ఉండటంతో అవి కవాల్ అభయారణ్యంలోని సరస్సులకు వచ్చాయని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ(హైటికాస్ )ఉత్తర తెలంగాణ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ వెంకట్ ఎనగందుల ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



ఏఏ పక్షులున్నాయంటే....

ఈ ఆసియన్ పక్షి సర్వేలో గుర్తించిన ముఖ్యమైన వలస పక్షి జాతుల్లో నార్తర్న్ పింటైల్, కామన్ రెడ్‌శాంక్ రెడ్-క్రెస్టెడ్ పోచార్డ్,కామన్ టీల్,కాటన్ పిగ్మీ గూస్,సాండ్‌పైపర్స్,టెమ్మింక్ స్టింట్ వంటి వి ఉన్నాయి.70కు పైగా ఉన్న ఈ వలస పక్షులు సాధారణంగా మార్చి నెలాఖరు వరకు తెలంగాణ సరస్సుల్లో నివాసం ఉండి, ఆ తరువాత ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి వనరులు తగ్గడంతో తిరిగి తమ మాతృ ప్రాంతాలకు ప్రయాణం ప్రారంభిస్తాయని తమ సర్వేలో వెల్లడైందని పక్షుల గణనలో పాల్గొన్న హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వాలంటీర్ విక్రం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కవాల్ అభయారణ్యం సరస్సుల్లో బ్లాక్ వింగడ్ స్టిల్ట్ (Black winged stilt),లిటిల్ రింగ్ డ్ ప్లవర్ (Little Ringed plover),కామన్ ఐరా(Common iora),కావమన్ టైలర్ బర్డ్ (Common tailor bird),బార్న్ స్వాలో(Barn swallow),ఎల్లో వాటాల్డ్ లాప్ వింగ్ (Yellow wattled lapwing),కామన్ రెడ్ షాంక్(Common Red shank),వుల్లీ నెక్ డ్ స్టోర్క్(Woolly necked stork),ఛేంజ్ బుల్ హాక్ ఈగల్(Changeble hawk eagle),బ్లాక్ బెల్లీడ్ టెర్న్(Black bellied tern),డక్ ఎన్ కోరమొరెంట్స్(Ducks n cormorants),నార్తన్ పెయింటైల్(Northern pintail),రెడ్ క్రెస్టెడ్ పోచర్డ్(Red crested Pochard),స్పాట్ బిల్డ్ డక్ (Spot billed duck) పక్షులు ఆసియన్ పక్షుల గణనలో కనిపించాయి.



అంతరించిపోతున్న పక్షిజాతుల నమోదు

కవాల్ అభయారణ్యంలో జరిగిన ఆసియన్ పక్షుల సర్వేలో అంతరించి పోతున్న పక్షిజాతులు దర్శనమిచ్చాయని బర్డ్ లవర్స్ చెప్పారు. ఈ పక్షుల సర్వేలో అత్యంత ప్రాధాన్యత గల ఐ సి యు ఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం అంతరించిపోతున్న జాతిగా గుర్తించబడిన బ్లాక్-బెల్లీడ్ టెర్న్ నమోదైంది.గత ఏడాది (2025) ఒకే ఒక్క అరుదైన పక్షి మాత్రమే నమోదు కాగా, ఈ ఏడాది జన్నారం రేంజ్ పరిధిలోని కిష్టాపూర్ సరస్సులో మూడు అరుదైన పక్షులు నమోదు కావడం గణనీయమైన పురోగతి అని పక్షిప్రేమికులు పేర్కొన్నారు.కవాల్ సరస్సుల్లో పక్షులకు కావాల్సిన ఆహార లభ్యత, మానవ అశాంతి తగ్గడం మెరుగుపడిన పర్యావరణ సూచికగా పరిగణించవచ్చని అటవీశాఖ డీఎఫ్ఓ కె రామ్మోహన్ చెప్పారు.కవాల్ ప్రకృతి దృశ్యంలో జీవవైవిధ్య జలాశయాలుగా లోతట్టు తడి భూముల పర్యావరణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పారు.



సర్వేలో దర్శనమిచ్చిన అరుదైన పెరెగ్రైన్ ఫాల్కన్ పక్షి

కిష్టాపూర్ సరస్సు సమీపంలోని ఒక మొబైల్ కమ్యూనికేషన్ టవర్‌పై పెరెగ్రైన్ ఫాల్కన్ పక్షి కూర్చొని ఉండటం వాలంటీర్లు గమనించారు. ఈ ప్రాంతంలో ఈ రాప్టర్ దర్శనం అరుదైనదిగా భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పక్షిగా గుర్తింపు పొందిన పెరెగ్రైన్ ఫాల్కన్ చేపల వేట సమయంలో గంటకు 320 కిలోమీటర్లకు మించిన వేగంతో వెళుతుందని పక్షుల నిపుణులు తెలిపారు. ఈ పక్షుల ఉనికి తడి నేలల్లో తగినంత ఆహార వనరులు,సమతుల్యత ఉన్నపుడే కనిపిస్తుందని పక్షిప్రేమికులు చెప్పారు. ఆసియన్ వాటర్‌బర్డ్ సెన్సస్ 2026లో కవాల్ టైగర్ రిజర్వ్, దాని చుట్టుపక్కల 70 కి పైగా పక్షి జాతులు నమోదు చేశారు. ఈ పరిశోధన ఫలితాలు తెలంగాణలోని మంచినీటి తడి భూములు వలస పక్షులకు కీలకమైన ఆవాసాలుగా మారాయని తాజాగా వెల్లడైంది.



పక్షులపై పురుగుమందుల ప్రభావం

కవాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులోని అటవీ భూములు, తడి నేలలు, సరస్సులు, నదులు జీవవైవిధ్యానికి నిలయాలుగా ఉండటంతో వలస పక్షుల రాక పెరుగుతుందని పక్షుల గణన నిర్వహించిన డాక్టర్ వెంకట్ ఎనగందుల ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. అభయారణ్యం చుట్టుపక్కల ఉన్న రెవెన్యూ భూములు, పోడు భూముల్లో వేసిన వివిధ పంటలపై అతిగా పురుగుమందులు, రసాయన ఎరువులు వాడుతున్నారని, దీనివల్ల అవి వర్షపునీటి ద్వారా తడి పచ్చిక బయళ్లు, సరస్సుల్లోకి వెళ్లి పక్షులకు ఆహారమైన జల కీటకాలు, చేపల సంఖ్య తగ్గుతుందని వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. పురుగుమందులు, ఎరువులను అధికంగా వాడటం వల్ల అటవీ చిత్తడి నేలల్లో చేపలకు కావాల్సిన ఆహార గొలుసు దెబ్బతింటుందని ఆయన చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి చిత్తడి నేలల సంరక్షణ కమిటీల ద్వారా సమగ్ర తడి పచ్చికబయళ్ల నిర్వహణ, ఆక్రమణల నివారణ, దీర్ఘకాలిక పర్యావరణ స్థిరత్వాన్ని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పక్షి ప్రేమికుడు వెంకట్ వివరించారు.



ఆసియన్ వాటర్‌బర్డ్ సెన్సస్–2026 ఫలితాలు కవాల్ అభయారణ్యంలోని సరస్సులు, తడి భూములు వలస పక్షులకు ఎంత కీలకమో మరోసారి నిరూపించాయి. ఈ ఆవాసాల సంరక్షణ కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో వలస వచ్చే పక్షుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పక్షి నిపుణులు భావిస్తున్నారు.రెక్కల చప్పుడు మౌనంగా చెప్పే సందేశం ఒక్కటే—ప్రకృతి బాగుంటే జీవ వైవిధ్యం తానే వికసిస్తుంది. కవాల్ అభయారణ్యంలో నమోదైన వలస పక్షులు అదే ఆశను కలిగిస్తున్నాయి.



Read More
Next Story