బొటానికల్ గార్డెన్‌లో బర్డ్ వాక్ ఎలా ఉంటుందంటే...
హైదరాబాద్ బొటానికల్ గార్డెన్‌లో బర్డ్ వాక్ పక్షి ప్రియులకు మధురానుభూతులను పంచింది. ప్రకృతి ఒడిలో రంగురంగుల పక్షులు..వాటి కిలకిలరావాలు వింటూ సాగిన బర్డ్ వాక్...
ఎటు చూసినా పచ్చని ఎతైన చెట్లు...మధ్యలో అక్కడక్కడ చిన్న నీటి కుంటలు...ఆ చెట్ల కొమ్మలపై చెంగు చెంగున ఎగురుతూ సందడి చేస్తున్న వివిధ రంగుల రంగుల పక్షులు...నెమళ్లు పురివిప్పి చేసే నాట్యాన్ని, ఆ పక్షులు చేసే కిలకిలరావాలు...ఆ అందమైన పక్షులను చూస్తూ కెమెరాల్లో బంధిస్తూ ముందుకు సాగుతున్న పక్షిప్రియుల సందడితో ఆదివారం ఉదయాన్నే కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌లో బర్డ్ వాక్ ఆదివారం (మార్చి3,2024) జరిగింది. కిలకిల రావాలు చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్న వివిధ రకాల పక్షులను చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. ఉరుకుల పరుగులతో కూడిన జీవితంలో అలసి సొలసిన వారికి ఈ బర్డ్ పార్కు ఒకింత ఆహ్లాదాన్ని అందిస్తోంది.
పక్షులతో ఆహ్లాదం...ఆనందం
నిత్యం ఎదో ఒక పనితో బిజీగా సాగే నగర జీవనంలో వారాంతాల్లో బర్డ్ వాక్‌లో పాల్గొంటే పక్షులతో భావోద్వేగ బంధం ఏర్పడుతోంది. పచ్చని చెట్లు...రంగురంగుల పూల మధ్య ఎన్నెన్నో రంగురంగుల పక్షులను చూస్తూ ముందుకు సాగుతుంటే ఆహ్లాదంతోపాటు ఆనందాన్నిస్తోంది. వారం రోజులపాటు వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో తలమునకలైన నగర జీవులు పని ఒత్తిడిని మర్చి మనసు ఒకింత తేలిక పడుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బర్డ్ వాక్
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ ఛైర్మన్, సీఎం కార్యదర్శి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి పక్షిప్రియుల కోసం ‘బర్డ్ వాక్’ నిర్వహిస్తున్నట్లు ఇచ్చిన ఆహ్వానంతో ఈ ఏడాది మార్చి 3వతేదీ ఆదివారం ఉదయం 6 గంటలకే కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌కు వెళ్లాను. అప్పటికే బొటానికల్ గార్డెన్ ముందు వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరి కనిపించాయి. ప్రభాత వేళ వేలాదిమంది వాకర్లు ఉదయం నడక కోసం ప్రధాన గేటు నుంచి తరలి వచ్చారు. మరో గేటు నుంచి బర్డ్ వాక్ కోసం పక్షిప్రియులు వచ్చారు. నాతోపాటు నగరం నలుమూలల నుంచి 60 మందికి పైగా పక్షిప్రియులు, పిల్లలు, మహిళలు బర్డ్ వాక్ కోసం సిద్ధమై వచ్చారు.
పక్షి ప్రియుల సందడి
బొటానికల్ గార్డెన్ లో బర్డ్ వాక్ సందర్భంగా పక్షిప్రియుల సందడి కనిపించింది. కాళ్లకు వాకింగ్ షూ ధరించి, వాటర్ బాటిల్ వెంట పెట్టుకొని, మెడలో బైనాక్యులర్స్, పెద్దపెద్ద లెన్స్ కెమెరాలు, స్టాండ్లు తీసుకొని పక్షి ప్రియులు తరలివచ్చారు. బొటానికల్ గార్డెన్ లోపలకు వెళ్లగానే మాకు అటవీశాఖ ఎకో టూరిజం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మేనేజర్ కళ్యాణపు సుమన్ రిసీవ్ చేసుకుని బర్డ్ వాక్ షెడ్యూల్ గురించి వివరించి 30 మంది ఒక బృందం చొప్పున రెండు టీములుగా విభజించారు. ఒక్కో బృందం వెంట ఒక నిపుణులైన బర్డ్ వాచర్‌ని పంపించారు.
కనువిందు చేసిన రంగురంగుల పక్షులు
బొటానికల్ గార్డెన్‌లో పలు రకాల రంగురంగుల పక్షులు కనువిందు చేశాయి. మరో వైపు గార్డెన్ లో ఉన్న నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తూ పక్షిప్రియులను అలరించాయి. ఎంతో ఆనందంగా సాగిన బర్డ్ వాక్ లో మా పక్షిప్రియుల బృందం 28 రకాల పక్షులను వీక్షించింది. వివిధ ఉద్యోగాలు చేస్తూ రిటైరై మానసిక ఆనందం కోసం వచ్చిన వారు కొందరైతే...మరికొందరు యువతీ, యువకులు, 5 రోజుల పాటు ఉద్యోగ బాధ్యతలతో అలసిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పిల్లలు ఇలా అన్ని రకాల వయసుల వాళ్లు, అన్ని రకాల వృత్తులు, ఉద్యోగాలు చేస్తున్న వారు మానసిక ఆనందం కోసం బర్డ్ వాక్ కు తరలివచ్చారు.
ఎన్నెన్నో రకాల పక్షులు
ఈ బర్డ్ వాక్ లో పాల పిట్ట (Blue Jay), పికిల పిట్ట (redwented Bulbul), లోట్టకన్ను జిట్ట (Ashy Prinia), నల్ల యోట్రింత (Black Drongo), చిన్న పసరిక (Green bee-eater), ఊదా తేనె పిట్ట (Purple Sunbird), అడవి రామదాసు (Black-winged Kite), మగ నెమలి (peafowl), ఆడ నెమలి (peahens), ముఖి పిట్ట (Kingfisher), బుల్ బుల్ పిట్ట, హెరాన్లు, బాతులు, కొంగలు, కోయిల, ఊర పిచ్చుకలు ఇలా ఒకటేమిటి 28 రకాల పక్షులను బైనాక్యులర్ల ద్వారా పక్షిప్రియులు వీక్షించారు. అనంతరం ఆ పక్షుల అందాల చిత్రాలను తమ తమ కెమెరాల్లో క్లిక్ మనిపించారు.
బర్డ్ వాచింగ్‌తో టెన్షన్ ఫ్రీ...
ప్రకృతి ఒడిలో చెట్ల కొమ్మలపై విహరించే పక్షులను చూస్తే చాలు తన మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుందని హైదరాబాద్ నగరంలోని బర్కత్ పురాకు చెందిన బర్డ్ వాచర్ ఎస్ కే మాల్తారే ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘నేను డిఫెన్స్ విభాగంలో మూడు దశాబ్దాల పాటు డైరెక్టరు హోదాలో పనిచేసి పదవీ విరమణ చేశాను, రిటైరయ్యక ఏదైనా ఉద్యోగం చేయవచ్చు కానీ, నేను నా పదవీ విరమణ అనంతరం జీవితాన్ని ప్రకృతి ఒడిలో పక్షుల మధ్య గడపాలని నిర్ణయించుకున్నాను’’ అంటారు మాల్తారే. తాను ఫోటోగ్రఫీ నేర్చుకొని కెమెరా కొని దేశ వ్యాప్తంగా ఉన్న పక్షి కేంద్రాలను సందర్శిస్తూ ఉంటానని ఆయన చెప్పారు. తాను ఇప్పటి వరకు 75 రకాల పక్షుల ఫొటోలు తీసి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశానని ఆయన తెలిపారు.
పూలు, పక్షుల ఫొటోలు తీస్తుంటా : ప్రభుత్వ పాలిటెక్నిక్ హెడ్ చింతకుంట్ల సంపత్ రెడ్డి
ప్రభుత్వ పాలిటెక్నిక్ హెడ్ గా పనిచేసి రిటైరై వివిధ రకాల పూలు, పక్షుల ఫొటోలు తీయడం హాబీగా మలచుకున్నానని చెప్పారు చింతకుంట్ల సంపత్ రెడ్డి. కరోనా వచ్చిన సమయంలో తాను తన ఇంటి సమీపంలో వివిధ రకాల పూల ఫొటోలు తీశానని, ఆ తర్వాత పక్షుల ఫోటోలు తీయడం హాబీగా చేసుకున్నానని, ఇఆందులోనే తనకు సంతోషం ఉందన్నారు. తనకు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ఇష్టమని, దీనిలో భాగంగా తాను ఏకాగ్రత, పేషన్సీ కోసం తాను బర్డ్స్ ఫోటోలు తీస్తున్నానని చెప్పారు డెలాయిటీ ఉద్యోగి అద్దెపల్లి నిఖిల్. తాను 180 పక్షుల చిత్రాలు తీసి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశానని ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వారాంతాల్లో తాను కూడా బర్డ్ వాక్ కు వస్తుంటానని కేపీహెచ్ బీకి చెందిన విద్యార్థి శశాంక్ చెప్పారు.
పక్షుల చిత్రాలు ఈ బర్డ్స్ వెబ్‌సైట్‌లో పోస్టు చేస్తుంటా...
తాను హాబీగా పక్షుల చిత్రాలు తీసి, వాటిని ఈ బర్డ్స్ వెబ్‌సైట్‌లో పోస్టు చేస్తుంటానని చెప్పారు ఐటీ ఉద్యోగి మహేందర్. తాను ఇప్పటివరకు 360 పక్షుల ఫొటోలు తీసి వాటిని తన ఫేస్ బుక్ పేజీలో, వెబ్‌సైట్‌లో పోస్టు చేశానని చెప్పారు. పక్షుల ఫోటోలు తీయడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చన్నారు. తాను ప్రకృతి ప్రేమికుడినని, అందుకే తాను బర్డ్ వాచింగ్ చేస్తూ వాటి ఫోటోలు తీస్తుంటానని రామయ్య ఐఐటీ కోచింగ్ సంస్థ ఫిజిక్స్ మాజీ అధ్యాపకుడు సురేంద్రనాథ్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘నా పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. నేను పదవీ విరమణ చేశాక భార్య శైలజతో కలిసి బర్డ్ వాక్ కు వచ్చాను, ప్రకృతి ఒడిలో గడపటం నాకెంతో ఇష్టం’’అని సురేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
అమీన్‌పూర్ చెరువు, సంజీవయ్యపార్కు, వికారాబాద్‌లలో కూడా...
తాను బొటానికల్ గార్డెన్ లోనే కాకుండా అమీన్‌పూర్ చెరువు, సంజీవయ్యపార్కు, వికారాబాద్‌లలో కూడా పక్షుల వాచింగ్ కు వెళ్లానని చెప్పారు హైదరాబాద్ నగరానికి చెందిన కిరణ్ కుమార్, శ్రీధర్. తాము 40రకాల పక్షులను చూశామని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పలు ప్రాంతాలు పక్షులకు నెలవుగా మారాయని, వీటిని సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పక్షిప్రేమికుడు వి సత్యనారాయణ సూచించారు. నీటి చెరువులను పరిరక్షిస్తే పక్షులు మనుగడ సాధిస్తాయని ఆయన పేర్కొన్నారు. తాము కొత్తగా బర్డ్ వాచర్స్ గా మారామని సంతోష్, మహేష్, లహరి చెప్పారు.
హైదరాబాద్ లో పక్షిప్రియుల సంఘాలెన్నో...
హైదరాబాద్ నగరంలో పక్షిప్రియులతో పలు సంఘాలు ఏర్పాటయ్యాయి. దక్కన్ బర్డర్స్, బర్డ్ వాచర్స్ సొసైటీ,హైదరాబాద్ బర్డింగ్ పల్స్ పేరిట ఉన్న పలు సంస్థల సభ్యులు, పక్షిప్రియులు వారాంతాల్లో బర్డ్ వాక్స్ నిర్వహిస్తున్నారు. ఈ బర్డ్ వాక్ ఈవెంట్లలో హైదరాబాద్ నగర ప్రజలు ఎక్కువమంది పాల్గొని వాటి ద్వారా ఆనందానుభూతిని పొందుతున్నారు. బర్డ్ పార్కులో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతూ సంతానోత్పత్తి చేస్తున్నాయి.పక్షులకు వాటి సహజ ఆవాసాలు ఉన్నాయి.
పక్షుల గురించి అడిగి తెలుసుకున్నాం...
వివిధ రకాల పక్షులను చూడడమే కాకుండా వాటి పేర్లు, వాటి ఆహారపు అలవాట్లు గురించి బర్డ్ వాచర్స్ ను అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు పక్షిప్రేమికులు. ఎవరు ఏ ఏ పక్షులు వీక్షించారో, వారికి ఈ బర్డ్ వాక్ ఎలా అనిపించిందో పక్షిప్రియులను అడిగి తెలుసుకున్నారు ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మేనేజర్ సుమన్. బర్డ్ వాక్ లో పాల్గొన్న పక్షిప్రియులందరికీ గార్డెన్ లో చెట్ల కింద అల్పాహారం, టీ ఏర్పాటు చేశారు. అల్పాహారం అనంతరం బొటానికల్ గార్డెన్ లో కొత్తగా చేసిన థీమ్ పార్క్స్ వీక్షణకు గోల్ఫ్ కార్ట్ వెహికల్స్ లో తీసుకెళ్లి వివరించారు.
హైదరాబాద్ పక్షుల సంచారానికి నిలయం
అమీన్ పూర్ చెరువు, అనంతగిరి అడవి, ఎదులాబాద్ సరస్సు, ఉస్మాన్ సాగర్ సరస్సు, ఉస్మానియా యూనివర్శిటీ, ఓల్డ్ సిటీ, కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు, ఇందిరాపార్కు, మహావీర్ హరిణ వనస్థలి, మృగవని లేక్, నెహ్రూజూలాజికల్ పార్కు, కుతుబ్ షాహీ టూంబ్స్ పక్షుల సంచారానికి నిలయాలుగా మారాయి.
ఎన్నెన్నో నేచర్ క్యాంపులు
చిల్కూరులోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులకు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేచర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ శ్రీనివాస్ చెప్పారు. గతంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ప్రస్థుత తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారి చొరవతోనే తెలంగాణలో ఎకో టూరిజం విస్తరిస్తోంది. ఈ క్యాంపు లో టీం బిల్డింగ్ కార్యక్రమాలు, టెంట్ పిచింగ్, దీపాలతో నైట్ ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్, క్యాంపు ఫైర్, బర్డ్ వాక్, నేచర్ ట్రయల్, అడ్వెంచర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ వెల్లడించారు. వికారాబాద్, కల్లూరు కనకగిరి హిల్స్, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట, దేవరకొండలోని వైజాగ్ కాలనీ, శామీర్ పేట ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎఫ్ఆర్వో వివరించారు.బొటానికల్ గార్డెన్ లో జరిగిన బర్డ్ వాక్ లో పాల్గొన్న వారందరికీ ఈ సర్టిఫికెట్ లు అందజేస్తామని శ్రీనివాస్ వివరించారు.
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన బర్డ్ వాక్, థీమ్ పార్కును వీక్షించి ప్రకృతి అందించిన ఆనందానుభూతిని మనసు నిండా నింపుకొని ఇంటికి తిరుగుపయనమయ్యాం. ఇదీ బొటానికల్ గార్డెన్ లో జరిగిన బర్డ్ వాక్ ముచ్చట్లు.
Next Story