సీఎంను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు..వరికి బోనస్ చెల్లించాలని వినతి
x
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు, రాకేష్ రెడ్డి

సీఎంను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు..వరికి బోనస్ చెల్లించాలని వినతి

తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డిని సచివాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి వినతిపత్రం సమర్పించారు.వరి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని వారు సీఎంకు విన్నవించారు.


తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం డిమాండ్ చేశారు.

- ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలతో కలిసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. రైతు సమస్యలు, వరి పంట కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రినీ బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు.
- తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 45 రోజులు అయినా ఇంకా ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంకు చెప్పారు.
లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత వల్ల వరి ధాన్యం కాంటా చేయడం లేదని వారు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షాలకు ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు.
- లారీల కొరత వల్ల ధాన్యం తూకాలు వేయక మిల్లులకు తరలించడం లేదని, దీనివల్ల ధాన్యం తడుస్తుందని బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తేమ, తరుగు పేరుతో బస్తాకు నాలుగు కిలోల ధాన్యాన్ని మిల్లర్లు కోత పెడుతూ రైతులను దోచుకుంటున్నారని, దీన్ని నివారించాలని బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు.

తేమ నిబంధన లేకుండా ధాన్యం కొనుగోలు చేయండి
ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు రోడ్లపై రాస్తారోకోలు చేశారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఎవరూ కొనడం లేదని, దీనిపై మంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. లారీలు,హమాలీలు, గన్నీ బ్యాగులు సమకూర్చి ధాన్యాన్ని తేమ నిబంధన లేకుండా కొనుగోలు చేసేలా సీఎం చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

రూ.500 బోనస్ చెల్లించాలని వినతి
బీ గ్రేడ్ విధానాన్ని ఎత్తివేసి ధాన్యాన్ని మద్ధతు ధరకే కొనుగోలు చేయాలని, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామి ప్రకారం వరి ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామి మేర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15వేలు, రూ.12వేలు చెల్లించాలని, ఆగస్టు 15వతేదీలోగా రైతుల రుణమాఫీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు.


Read More
Next Story