పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్‌‌లో నిరసనలకు కారణమేంటి?
x
ఓ దుకాణంలో చెలరేగుతున్న మంటలు..

పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్‌‌లో నిరసనలకు కారణమేంటి?

ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ లో ఎందుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ నివేదిక కోరడానికి కారణమేంటి?


పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ పట్ణణం గురువారం నిరసనలతో అట్టుడికింది. సోనాచురా గ్రామంలో షెడ్యూల్ కులానికి చెందిన బీజేపీ మహిళా కార్యకర్త బుధవారం రాత్రి హత్యకు గురైంది. పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

పుర్బా మేదినీపూర్ జిల్లా తమ్లుక్ లోక్‌సభ స్థానం పరిధిలోని నందిగ్రామ్ పట్ణణం బీజేపీ నేత సువేందు అధికారికి మంచి పట్టున్న ప్రాంతం. పశ్చిమ బెంగాల్‌లో మే 25న ఎన్నికలు జరుగుతున్నాయి.

అసలేం జరిగింది..

ఎన్నికల ప్రచారం బుధవారం (మే 23) ముగిసింది. అదే రోజు రాత్రి సోనాచురా గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద రతీబాలాతో పాటు కొందరు పార్టీ కార్యకర్తలు కాపలాగా ఉన్నారు. ఒక్కసారిగా వారిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. టీఎంసీ మద్దతు ఉన్న నేరగాళ్లు ఈ పని చేసి ఉంటారని స్థానిక బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

ఈ ఘటనలో రతీబాలా మృతిచెందగా ఇతరులు తీవ్రంగా గాయపడ్డారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మేఘనాధ్ పాల్ తెలిపారు. రతీబాలా కొడుకు సంజయ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నగరంలోని ఆసుపత్రికి తరలించామని, ఇతరులకు స్థానిక వైద్యశాలలో చికిత్స జరుగుతోందని పాల్ చెప్పారు.

కాగా తమ పార్టీపై వచ్చిన ఆరోపణలను నందిగ్రామ్ TMC నాయకుడు స్వదేశ్ దాస్ ఖండించారు. కుటుంబ తగదాల వల్ల రతీబాలా హత్యకు గురై ఉంటుందని చెప్పారు.

ఒకరి అరెస్టు..

హత్యకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు నందిగ్రామ్ లో దుకాణాలను మూయించారు. టైర్లు తగలబెట్టి, రోడ్లను దిగ్భందించారు. నందిగ్రామ్‌లో బిజెపి బంద్‌కు పిలుపునిచ్చిందని, అయితే ఆ నిర్ణయాన్ని తర్వాత విరమించుకున్నట్లు స్థానిక నాయకుడు ఒకరు తెలిపారు.

పోలీసు బలగాల మోహరింపు..

అవాంచనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సోనాచురా గ్రామంలో పోలీసు బలగాలను ఉంచారు. నందిగ్రామ్ తో పాటు అల్లర్లు జరిగే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు కేంద్ర బలగాలను ఉంచారు. అయితే హత్యకు సంబంధించి ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

‘అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టడం వల్లే’..

హత్యోదంతం TMC జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టే ప్రసంగం వల్లే జరిగిందని సువేందు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని పరామర్శించిన తర్వాత నందిగ్రామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. అనంతరం ఇలా అన్నారు. “నిన్న నందిగ్రామ్‌లో అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టడం వల్ల రక్తపాతం జరిగింది. తృణమూల్ కు ఓటమి ఖాయమని తెలుసుకున్న తర్వాత దాడికి ఒడిగట్టారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. ఇలాంటి ఘటనలను చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ప్రతీకారం తీర్చుకుంటాం’’.

మమతే కారణం.. ఈవోకు ఫిర్యాదు

పుర్బా మేదినీపూర్ జిల్లా ఎస్పీని తక్షణమే తొలగించాలని పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి సువేందు లేఖ రాశారు. మే 16న హల్దియాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి బెనర్జీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వాటి పర్యవసానమే మహిళ హత్య అని లేఖలో ఆయన పేర్కొన్నారు.

''ప్రజాస్వామ్యంలో హింస ఆమోదయోగ్యం కాదు. రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలి. మృతురాలి కుటుంబానికి, బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం” అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

నివేదిక పంపండి

ఈ ఘటన పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ దృష్టికి వెళ్లింది. హత్యకు గల కారణాలు, హత్య చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుని, పూర్తి నివేదికను తనకు సమర్పించాలని సీఎం మమతాను ఆదేశించారు.

Read More
Next Story