తెలంగాణలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళసై ప్రచారం షురూ
x
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ డాక్టర్ తమిళసైకు స్వాగతం పలుకుతున్న బీజేపీ కార్యకర్తలు

తెలంగాణలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళసై ప్రచారం షురూ

నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా పనిచేసిన తమిళసై బీజేపీ స్టార్ క్యాంపెయినరుగా కొత్త పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తమిళసై ప్రచారం ప్రారంభించారు.


తెలంగాణలో తమిళ ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ ప్రచారానికి తమిళసైను ప్రచార రంగంలో దించింది. గతంలో అప్పటి తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఉప్పునిప్పుగా ఉన్న తమిళసై ఈసారి గవర్నర్ గిరీకి రాజీనామా చేసి బీజేపీ తరపున సౌత్ చెన్నై పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు.

- తమిళనాడులో ఎన్నికలు ముగియడంతో తమిళసైను కేంద్ర బీజేపీ స్టార్ క్యాంపెయినరుగా ఆమెను నియమించింది.చెన్నై ఏడుంబూర్ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ కు చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలులో వచ్చిన తమిళసైకు స్థానిక బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.


తమిళులు నివాసమున్న ప్రాంతాల్లో ప్రచారం
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి మాజీ గవర్నర్ డాక్టర్ తమిళసాయి సౌందరరాజన్ తమిళనాడు రాష్ట్ర బీజేపీ వాలంటీర్లతో కలిసి వచ్చారు. సోమవారం బీజేపీ కార్యకర్తలు, తమిళనాడు వాలంటీర్లతో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రస్థుతం ప్రచారంలో ఈమె ఏం కామెంట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో గవర్నరుగా బయటకు ఏం మాట్లాడటానికి వీలు ఉండేది కాదు. కానీ ప్రస్థుతం బీజేపీ నాయకురాలిగా తమిళసై కేసీఆర్ పై ఎలాంటి విమర్శలు గుప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా...
నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా,రాష్ట్ర ఫస్ట్ సిటిజన్ గా పనిచేసిన తమిళసైను బీజేపీ స్టార్ క్యాంపెయినరుగా బీజేపీ హైకమాండ్ నియమించింది. తమిళనాడు సౌత్ చెన్నై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, అక్కడ పోలింగ్ ముగియడంతో తెలంగాణ ప్రచారానికి వచ్చారు. తెలంగాణ అంటే తనకెంతో ఇష్టమని చెప్పే తమిళసై రాజకీయనాయకురాలిగా కొత్త పాత్రలో కనిపించబోతున్నారు.రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చారని బీజేపీ క్యాంపు కార్యాలయంగా మార్చారని ఆమెపై గతంలో బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు.

పదిరోజుల ప్రచారం
తెలంగాణలో తమిళ ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్వాల్, బోయినపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర పలు ప్రాంతాల్లో తమిళుల ప్రాబల్యం ఎక్కువగానే ఉంది. 10 రోజులకు పైగా తెలంగాణలో ఉంటూ తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థుల పక్షాన తమిళసై ఎన్నికల ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు చెప్పారు. తమిళులు ఎక్కువగా నివసించే తెలంగాణలో బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ప్రచారం చేయనున్నారు. 10 రోజులపాటు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా తమిళ వాలంటీర్లతో కలిసి ఆమె ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా తమిళసై సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.

బీజేపీ కార్యకర్తల అంకితభావం స్ఫూర్తిదాయకం : తమిళసై
తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం సోమవారం హైదరాబాద్ వచ్చిన తమిళసైకు నాంపల్లి రైల్వేస్టేషనులో బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పదిరోజులపాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వచ్చానని తమిళసై ఎక్స్ లో పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల శక్తి, వారి అంకితభావం నిజంగా స్ఫూర్తి దాయకమని ఆమె పేర్కొన్నారు.

డాక్టరు నుంచి రాజకీయాల్లోకి...

తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన తమిళసై వృత్తి రీత్యా గైనకాలజీ డాక్టర్. చెన్నైలోని రామచంద్ర మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేసి, రాజకీయాల్లోకి వచ్చారు. ఈమె తండ్రి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశారు. మరో వైపు భర్త కుటుంబ సభ్యుల్లో ఒకరైన విజయ్ వసంత్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. దీంతో తమిళసై రాజకీయ రంగ ప్రవేశం చేసి బీజేపీలో చేరారు. మద్రాస్ మెడికల్ కళాశాలలో విద్యార్థి నాయకురాలిగా ఉన్న తమిళసై తమిళనాడు రాష్ట్ర బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు.

అంచెలంచెలుగా ఎదిగి...
తమిళసై బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. మొదట 1999లో సౌత్ చెన్నై జిల్లా మెడికల్ విభాగం బీజేపీ కార్యదర్శిగా పనిచేశారు. 2001లో మెడికల్ బీజేపీ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2005లో ఆల్ ఇండియా బీజేపీ కో కన్వీనరుగా, 2007లో తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 2010లో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా, 2013లో ఆల్ ఇండియా బీజేపీ కార్యదర్శిగా పనిచేశారు.

తెలంగాణ మొట్టమొదటి మహిళా గవర్నరుగా...
తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా గవర్నరుగా తమిళసైను 2019 సెప్టెంబరు 1వతేదీన అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు. సెప్టెంబరు 9వతేదీన గవర్నరుగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఈమెకు 2021 ఫిబ్రవరి 16వతేదీన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. కొవిడ్ సమయంలో పుదుచ్చేరిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. తమిళనాడు రాష్ట్రంలో తమిళసై ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. మళ్లీ తాజాగా గవర్నర్ గిరీని వదిలి చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.


Read More
Next Story