బాక్సింగ్‌లో మరోసారి సత్తా చాటిన నిఖత్ జరీన్
x
ప్రపంచ బాక్సింగ్ టోర్నమెంట్ లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్

బాక్సింగ్‌లో మరోసారి సత్తా చాటిన నిఖత్ జరీన్

కజకిస్థాన్‌లో జరిగిన ఎలోర్డాకప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ సత్తా చాటింది.నిఖత్ జరీన్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ సన్మానించారు.


తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 50 కేజీల కేటగిరీలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ ప్రపంచ క్రీడలకు ముందు కజికిస్థాన్ వేదికగా జరిగిన ఎలోర్డా కప్ టోర్నీలో ఛాంపియన్ గా నిలిచారు.

- ఇటీవల జరిగిన ఫైనల్ బౌట్ లో నిఖత్ 5-0 తేడాతో కజకిస్థాన్ దేశానికి చెందిన జాజిరా ఉరక్ బయేవాను ఓడించారు. టోర్నీలో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.


పంచ్‌లతో పరాక్రమం చూపిన నిఖత్
పట్టుదల, నైపుణ్యం, సంకల్పం ఉంటే చాలు ప్రపంచ ఛాంపియన్ గా నిలవవచ్చని నిఖత్ జరీన్ నిరూపించారు. ఉత్కంఠభరితమైన ప్రదర్శనలో భారతదేశానికి చెందిన నిఖత్ జరీన్ ఎలోర్డా కప్ 2024లో అద్భుతమైన ప్రదర్శనను అందించింది. మెరుపు-వేగంతో రిఫ్లెక్స్‌లు, ఖచ్చితమైన పంచ్‌లతో నిఖత్ రింగ్‌లో తన పరాక్రమాన్ని ప్రదర్శించింది. నిఖత్ తన ప్రత్యర్థికి ఎదురుదాడికి అవకాశం లేకుండా చేసింది. ఆమె అద్భుతమైన విజయం బాక్సింగ్ ప్రపంచంలో ఆమె స్థానాన్ని పదిలపర్చింది.

రన్నింగ్ రింగ్ నుంచి బాక్సింగ్ రింగులోకి...
నిజామాబాద్ నగరానికి చెందిన సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన నిఖత్ జరీన్ బాక్సింగ్ రంగంలో రాణించారు. ఆమె తండ్రి మహ్మద్ జమీల్ అహ్మద్ ఇచ్చిన ప్రోత్సాహంతో నిజామాబాద్ స్టేడియంలోనే బాక్సింగ్ నేర్చుకున్నారు. మొదట రన్నింగ్ లో శిక్షణ పొందిన నిఖత్ క్రీడా ప్రయాణం రన్నింగ్ ట్రాక్ నుంచి బాక్సింగ్ రింగ్ కి మారింది. మొదట తన తండ్రి వద్ద శిక్షణ పొందిన నిఖత్ అనంతరం నిజామాబాద్ లో అబ్బాయిలతోనూ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంది.

సాయ్ శిక్షణతో వెలుగుచూసిన ప్రతిభ
విశాఖపట్టణంలోని స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీరావు మార్గదర్శకత్వంలో శిక్షణ పొంది ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగింది. 2009లో సబ్ జూనియర్ జాతీయ టైటిల్, 2011లో జూనియర్, యూత్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించడంతో ఆమె ప్రతిభ వెలుగుచూసింది. మూడేళ్ల తర్వాత యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మరో రజతం సాధించింది.

బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ను సన్మానిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్


నిఖత్ జరీన్‌ను సన్మానించిన కమిషనర్ రోనాల్డ్ రోస్

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్‌ను మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నిఖత్ జరీన్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ సన్మానించారు. ఇటీవల కజకిస్తాన్ లో జరిగిన ఎలోర్డా కప్ పోటీల్లో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్ ను అభినందించారు. మున్ముందు హైదరాబాద్ పేరు ప్రతిష్ఠలు దిశ, దిశలా వ్యాపించేలా, దేశ గౌరవం ఇనుమడించేలా బాక్సింగ్ క్రీడలో మరింతగా రాణించాలని కమిషనర్ అభిలషించారు. బాలబాలికల క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక సమ్మర్ కోచింగ్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టినట్లు కమిషనర్ రోనాల్డ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.ఆర్. ప్రేమ్ రాజ్, మాజీ ట్రెజరర్ కె .మహేశ్వర్, తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబురావు సాగర్ పాల్గొన్నారు.


Read More
Next Story