సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో  కేంద్ర పారామిలటరీ బలగాల పహరా
x
కేంద్ర పారామిలటరీ బలగాల ఫ్లాగ్ మార్చ్

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర పారామిలటరీ బలగాల పహరా

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా సున్నిత ప్రాంతాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలని నిర్ణయించారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను నియమిస్తారు.


హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలోని పాత బస్తీలోని యాకుత్ పురా, బహదూర్ పురా, చార్మినార్, చంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్లలో పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పాత బస్తీలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఇండో టిబెటిన్ బార్డర్ పో్లీసు (ఐటీబీపీ), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్,సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ను మోహరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపించారు.


కేంద్ర పారామిలటరీ బలగాల ఆధీనంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదించడంతో రెండు మూడు రోజుల్లో కేంద్ర బలగాలు హైదరాబాద్ కు రానున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కేంద్ర పారామిలటరీ బలగాలు పోలింగుకు 36 గంటల ముందు తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి. పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా తెలంగాణకు వచ్చిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ నివేదికల మేర పోలింగ్ రోజు కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర బలగాల ఫ్లాగ్ మార్చ్
నల్గొండ జిల్లాలోనూ ఐటీబీపీ కేంద్ర సాయుధ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ జరిపాయి. పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వేచ్ఛగా జరిపేందుకు వీలుగా కేంద్ర బలగాలు కవాతు నిర్వహించడం ద్వారా ఓటర్లలో భరోసా కల్పించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీపీ రవిగుప్తా చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు
తాండూరులోనూ కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ జరిపాయి. తెలంగాణలోని సున్నిత ప్రాంతాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా 24 గంటలపాటు అప్రమత్తంగా ఉంటూ ప్రశాంతంగా పోలింగ్ సాగేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పలు కీలక ప్రాంతాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

కరీంనగర్‌కు కేంద్ర బలగాలు పంపండి : బీజేపీ
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పర్వంలో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలని తెలంగాణ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరింది. లోక్ సభ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కేంద్ర పారామిలటరీ బలగాలను పంపించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి విన్నవించింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనైతిక చర్యలకు పాల్పడుతుందని బీజేపీ ఆరోపించింది. కరీంనగర్ కాంగ్రెస్‌ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని బీజేపీ ఫిర్యాదులో పేర్కొంది.

ఓటర్లకు డబ్బు పంపిణీపై బీజేపీ ఫిర్యాదు
కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటర్లకు పంచేందుకు మంత్రులు రూ.100 కోట్లు సిద్ధం చేసుకున్నారని బీజేపీ ఆరోపించింది. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని బీజేపీ తెలిపింది.ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు నియోజకవర్గంలో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని బీజేపీ పేర్కొంది.


Read More
Next Story