జీహెచ్ఎంసీ ఎన్నికలపై గురి పెట్టిన తెలంగాణ బడ్జెట్
భాగ్యనగరానికి రు.10 వేల కోట్లు కేటాయించారు. 2026 ఫిబ్రవరిలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ కన్నేయటంవలనే హైదరాబాద్‌కు ఈ భారీ వడ్డన అనే వాదన వినబడుతోంది.
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్‌లో జీహెచ్ఎంసీకి రు.182 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్‌లో ఏకంగా రు.3,065 కోట్లు కేటాయించారు. ఇది దాదాపు 16 రెట్లు ఎక్కువ. మొత్తంగా భాగ్యనగరానికి రు.10 వేల కోట్లు కేటాయించారు. 2026 ఫిబ్రవరిలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ కన్నేయటంవలనే హైదరాబాద్‌కు ఈ భారీ వడ్డన అనే వాదన వినబడుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌లో మొత్తం 2 లక్షల 91 వేల కోట్ల రూపాయల పద్దు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న రు.75,577 కోట్ల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి రు.6,751,757 కోట్లకు చేరిందని భట్టి విక్రమార్క తెలిపారు. గత పాలకులు ప్రభుత్వాన్ని సొంత జాగీరులా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపారని అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయంకన్నా ఎక్కువ ఉన్నప్పటికీ జిల్లాలమధ్య తీవ్ర అంతరం ఉందని చెప్పారు.
బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. అత్యధికంగా రు.72,659 కోట్లు కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 31,768 ఉద్యోగాలు ఇచ్చామని భట్టి తెలిపారు. లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేశామని, రెండు లక్షలలోపు రుణాలను త్వరలో మాఫీ చేస్తామని చెప్పారు.
భాగ్యనగరానికి పెద్ద పీట
హైదరాబాద్ నగరానికి గణనీయంగా నిధులు కేటాయించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీహెచ్ఎంసీకి బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. జీహెచ్ఎంసీకి రు.3,065 కోట్లు కేటాయించారు. దీనితో పాటు నగరంలో ప్రత్యేక మౌలిక వసతులను మెరుగుపరచటానికి ఏకంగా రు.10 వేల కోట్లను కేటాయించటం నగర చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. అప్పుల్లో కూరుకుపోయి వడ్డీలమీద వడ్డీలు చెల్లిస్తున్న జీహెచ్ఎంసీకు ఈ బడ్జెట్‌తో ఊరట కలిగింది. దీనిపై మేయర్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు.
జలమండలికి రు.3,385 కోట్లు, హెఎండీఏకు రు.500 కోట్లు, పాతబస్తీ మెట్రో రైలు విస్తరణకు రు.500 కోట్లు, ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలుకు రు.100 కోట్లు, పటాన్ చెరువు మెట్రో విస్తరణకు రు.500 కోట్లు, హైడ్రాకు రు.200 కోట్లు, మూసీ సుందరీకరణకు భారీగా రు.1,500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రు.200 కోట్లు, ఔటర్ వరకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణకోసం కొత్తగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’కు రు.200 కోట్లు, ఎంఎంటీఎస్‌కు రు.50 కోట్లు, ఔటర్ రుణాల చెల్లింపు, పలు ప్రాంతాలలో అభివృద్ధి పనులకోసం హెఎండీఏకు రు.710 కోట్లు కేటాయించారు.
మూసీకి మహర్దశ
మూసీ సుందరీకరణ, అభివృద్ధికి గత ఏడాది రు.200 కోట్లు కేటాయిస్తే ఈసారి రు.1,500 కోట్లకు పెంచారు. ఏళ్ళ తరబడి కాలుష్యానికి మారుపేరుగా నిలిచిన మూసీనదిని ప్రక్షాళన చేయటంతోపాటు, ఎకలాజికల్, హెరిటేజ్, మెట్రో, టూరిజం అనే నాలుగు జోన్లుగా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌లో ఈ నిధులను కేటాయించారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ రు.1,500 కోట్లను స్థల సేకరణ, కాలుష్య నివారణకోసం వినియోగంచనున్నట్లు చెబుతున్నారు.
జలమండలికి నిధుల వరద
గత బడ్జెట్‌లో వాటర్ బోర్డుకు రు.1,960 కోట్లు కేటాయిస్తే, ఈసారి రు.3,385 కోట్లకు పెంచారు. నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తరలించటానికి చేపడుతున్న సుంకిశాల ప్రాజెక్టుకు వెయ్యికోట్లు కేటాయించారు. నగరంలో నిర్మిస్తున్న 30 ఎస్‌టీపీలు, ఔటర్ రింగు రోడ్డు వరకు తాగునీటిని సరఫరా చేసే ఫేజ్-2 ప్రాజెక్టు, కలుషిత జలాల నివారణకు కొత్త లైన్ల నిర్మాణం, పాతబస్తీలోని జోన్ 3 సివరేజ్ పనులకోసం కేటాయింపులు చేశారు. వీటితో పాటు గ్రేటర్‌లో ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్లు అందించే ఉచిత నీటి రాయితీకోసం రు.300 కోట్లు కేటాయించారు.
నగరంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఊపు
నిర్మాణదశలో ఉన్న ఫ్లైఓవర్‌లు, నాలాలు, అండర్‌పాస్‌లు పూర్తి చేసేందుకు ఉద్దేశించిన హెచ్ సిటీ ప్రాజెక్టుకు రు.2,654 కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి ప్రకటించారు. జూపార్క్ నుంచి ఆరామ్ ఘర్ చౌరస్తా వరకు జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం, నల్గొండక్రాస్ రోడ్డునుంచి ఓవైసీ ఆసుపత్రి వరకు జరుగుతున్న స్టీల్ వంతెన నిర్మాణం, ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు జరుగుతున్న వంతెన పనులు ఇక ఊపందుకోనున్నాయి.
2026 ఫిబ్రవరిలో ముగియనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ పదవీకాలం
2020 డిసెంబర్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు చేపట్టింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరితో మేయర్ విజయలక్ష్మి పదవీకాలం, 2026 ఫిబ్రవరిలో కౌన్సిల్ పదవీకాలం ముగియనుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ సారి ఎలాగైనా బల్దియాను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉన్నట్లు ఈ బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతోంది. అందులోనూ కేటీఆర్ తరచూ అర్బన్ ఓటర్లు తమవైపు ఉన్నారని చెబుతూ ఉన్నందున బల్దియా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని రేవంత్ యోచిస్తున్నట్లు కనబడుతోంది. ఇప్పటికే మేయర్ విజయలక్ష్మిని, డిప్యూటీ మేయర్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు. పైగా, ఎమ్ఐఎమ్ ఈసారి బీఆర్ఎస్‌తో పొత్తును పక్కనపెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశం ఉంది. మరోవైపు, నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు జీహెచ్ఎంసీకి ఎక్స్ అఫిషియో సభ్యులు అవుతారు కాబట్టి వారి సాయంతో ఎలాగైనా కార్పొరేషన్‌ను తమ చేతుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ వ్యూహంగా చెబుతున్నారు. బడ్జెట్‌లో హైదరాబాద్‌కు భారీ కేటాయింపులు ఆ దిశగా రేవంత్ వేసిన మొదటి అడుగు కావచ్చు.