రేవంత్ ప్రమాణ స్వీకారం రేపు


రేవంత్ ప్రమాణ స్వీకారం రేపు

(ది ఫెడరల్ ప్రతినిధి, హైదరాబాద్‌)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి ఇది తొలి ఓటమి కాగా.. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి రానుంది. ఆదివారం రాత్రి 7 గంటల వరకు ఎన్నికల సంఘం ప్రకటించిన సమాచారం ప్రకారం.. గత ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలుపొందిన కేసీఆర్‌ పార్టీ భారతీయ రాష్ట్ర సమితీ (బీఆర్‌ఎస్‌) ఈసారి 39 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ పార్టీ 64 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 సీట్లు గెలిచాయి. సీఎం కేసీఆర్‌ సహా పలువురు మంత్రులకు ఈ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. పలువురు మంత్రులు గట్టెక్కినా మునుపటి మెజారిటీ మాత్రం అందుకోలేకపోయారు.
కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమి..
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్‌ ఒకచోట ఓడిపోయారు. గజ్వేల్‌లో మరోసారి విజయం సాధించారు. కామారెడ్డిలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. కేసీఆర్‌ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఈ సారి ఎన్నికల్లో ఆరుగురు మంత్రులకు షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ తరఫున నిర్మల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్‌ రెడ్డి, ధర్మపురి నుంచి పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్, పాలకుర్తి నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వనపర్తి నుంచి పోటీ చేసిన నిరంజన్‌ రెడ్డి, ఖమ్మం నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్‌ కుమార్, మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్‌ గౌడ్‌ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్లతో బయటపడిన కొప్పుల ఈశ్వర్‌ ఈసారి మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 53 వేల ఓట్లతో గెలుపొందిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.. ఈ సారి కాంగ్రెస్‌ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో 51 వేల ఓట్లతో గెలుపొందిన మంత్రి నిరంజన్‌ రెడ్డి ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి టి.మేఘారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. పోయిన ఎన్నికల్లో 57 వేల కోట్లతో గెలుపొందిన శ్రీనివాస్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు.
మంత్రుల అడ్రస్‌ గల్లంతు..
గత సారి మంత్రులుగా పనిచేసిన వారిలో కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, సబిత మరోసారి గెలుపొందారు. గంగుల కమలాకర్‌ బండి సంజయ్‌పై స్వల్పమెజారితో బయటపడ్డారు. తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి మాత్రం గతంలో కంటే ఎక్కువగా మెజారిటీలు సాధించారు. సిద్దిపేట నుంచి పోటీ చేసిన మంత్రి హరీశ్‌ రావు మరోసారి ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో 1.18 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆయన.. ఈసారి 82 వేల మెజారిటీకి పరిమితమయ్యారు. సిరిసిల్ల నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ గతంలో 89వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. ఈ సారి 30వేల ఓట్లకు పరిమితయ్యారు. మేడ్చల్‌ నుంచి పోటీ చేసిన చేమకూర మల్లారెడ్డి గత ఎన్నికల్లో 87 వేల ఓట్లతో గెలుపొందగా.. ఈసారి 33వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గంగుల కమలాకర్‌ 14వేల ఓట్లతో గెలుపొందగా.. ఈసారి కేవలం 300 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌పై విజయం సాధించారు.
బీజేపీ ఓటు బ్యాంక్‌ పెరిగింది..
బీజేపీ ఓటు బ్యాంక్‌ దాదాపు 100 శాతం పెరిగిందంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి సరిపెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 6.9 శాతం ఉన్నఓటు బ్యాంక్‌ ఈసారి 14 శాతానికి పెరిగింది. ఒక సీటు నుంచి 8 స్థానాలకు బలం పెరిగింది. ఈ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసింది. పవన్‌ కల్యాణ్‌ పార్టీ పోటీ చేసిన 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది.
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ఎందుకు ఓడిందీ?
ఇక, కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణలోని మెజారిటీ జిల్లాల్లో హవా కొనసాగించినా హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ జంటనగరాల పరిధిలో డీలా పడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతో ఆ ప్రభావం కాంగ్రెస్‌పై పడింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, సుస్థిరమైన ప్రభుత్వం లేకపోతే నష్టపోతామని వ్యాపారులు, వివిధ రంగాల వృత్తి నిపుణులు భావించటం కూడా కారణమై ఉండవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుతో కొత్తగూడెం నుంచి పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. సీపీఎం మాత్రం ఈ ఎన్నికల్లో ఒక్క సీటునూ గెలవలేదు. ఎంఐఎం మాత్రం తన బలాన్ని నిలబెట్టుకుంది. 7 సీట్లను గెలిచింది. బంజారాహిల్స్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి, ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్‌ ఓటమి అంచున ఉన్నారు. అక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు బాటలో ఉన్నారు.


Next Story