సీఎంతో చర్చలు సఫలం...పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్ధతు
తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్ధతు ఇవ్వాలని నిర్ణయించింది.సీఎంతో భేటీ తర్వాత మద్ధతు నిర్ణయాన్ని ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సీపీఎం, సీపీఐ పార్టీలు మద్ధతు ఇవ్వాలని నిర్ణయించాయి. శనివారం నాడు హైదరాబాద్ నగరంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతల భేటీ సందర్భంగా జరిగిన చర్చలు సఫలీకృతమయ్యాయి.
- ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డితో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి,చెరుపల్లి సీతారాములు వీరయ్యలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మండవ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
- పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకోవాలని సీఎం రేవంత్ కోరారని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఎన్నికల బరి నుంచి తప్పుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తమ్మినేని ప్రకటించారు.
- బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం, సీపీఎం నేతలు చెప్పారు. దీనిపై తమ సీపీఎం నాయకులతో చర్చించామని, భువనగిరి పార్లమెంట్ తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని వారు వివరించారు.
కాంగ్రెస్ ముందు సీపీఎం రాజకీయ ప్రతిపాదనలు
మరి కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందు పెట్టామని సీపీఎం నేతలు చెప్పారు. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు సీపీఎం నేతలు అంగీకరించారు..ఒకట్రెండు విషయాల్లో సందిగ్దత ఉన్న అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామని, సీపీఎం సహకారంతో భవిష్యత్ లో ముందుకెళతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
సీపీఎం సహకారంతో భవిష్యత్ లో ముందుకెళతాం..
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి జహంగీర్ ను బరిలో దించాలని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ పార్టీతో కుదిరిన ఒప్పందం మేర తాము భువనగిరి బరి నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని భావిస్తున్నానని తమ్మినేని వివరించారు.
సీపీఐ మద్ధతు కాంగ్రెస్ పార్టీకే...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న సీపీఐ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సీపీఐ కార్యాలయానికి వెళ్లి సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలతో చర్చించారు. బీజేపీని ఓడించేందుకు తాము కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మద్ధతు ఇస్తామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు.
Next Story