పొలాల్లో నీళ్లు పోవు.. ఎన్యుమరేషన్‌ పూర్తి కాదు.. ఎన్యుమరేషన్‌కు వారం రోజులు ఆగాల్సిందేనట గ్రామ సచివాలయాలు ఏమి చేస్తున్నట్లు?


తుపాన్‌ వచ్చి పోయి ఐదు రోజులైంది. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరి ధాన్యం నానిపోయింది. ఐదు రోజులుగా నీటిలో ఉన్న ధాన్యం పనికొచ్చే అవకావం లేదు. నేతలు వచ్చి చూశారు. ఒకరు ఇదేనా సాయం అంటే, మరొకరు ఇంకా నాలుగు రోజునలు గడిస్తే గాని ఎన్యుమరేషన్‌ చేపట్టేందుకు వీలు కాదని చెబుతున్నారు. ఎప్పుడైనా మూడు రోజులకు మంచి ఎన్యుమరేషన్‌ పూర్తి చేసేందుకు పట్టిందా? ఇదేమి కర్మోకాని నీట మునిగిన పొలాల్లో అధికారులు నష్టాన్ని అంచనా వేసేందుకు చేతకాదంటున్నారంటే ఏమనాలి. అధికారులను కాదు, ముందు ప్రభుత్వాన్ని ఏమనాలి. పైగా మరో నాలుగు రోజుల తరువాత ఎన్యుమరేషన్‌ చేపడతామని చెప్పడం ఏమిటి? ఇక వ్యవసాయ శాఖ అయితే ఏకంగా పది రోజులు గడిస్తే కాని ఎన్యుమరేషన్‌ చేపట్టలేమని ప్రకటించింది. ఎంత వైచిత్యం. మునుపెన్నడూ ఇటువంటి ఎన్యుమరేషన్‌ను చూడలేదు.

పొలాల్లో నీరు బయటకు ఎప్పుడు వెళుతుందో?
పంటపొలాల్లో నీటిని తరలించేందుకు ఆయిల్‌ ఇంజన్లు ఉపయోగిస్తున్నామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 5న మిగ్‌జాం తుపాన్‌ వల్ల కోస్తా జిల్లాల్లో పంట పూర్తి స్థాయిలో నీట మునిగింది. పొలాల్లోని నీటిని బయటకు తీస్తే కాని నష్టం అంచనా వేసేందుకు వీలుకాదని అధికారులు చెబుతున్నారు. నష్టం వివరాలు సేకరించడానికి, పొలాల్లో నీరు బయటకు పోవడానికి సంబంధం ఏమిటనేదే ప్రశ్న?
నష్ట అంచనాకు ఈ క్రాప్‌ వివరాలు చాలవా?
ఇప్పటికే ‘ఈ క్రాప్‌’ దాదాపు 80 శాతం పూర్తయింది. ఈ క్రాప్‌ వివరాలు బయటకు తీస్తే ఏ రైతు పొలంలో ఏ పంట వేశారు. ఎంత వేశారనేది తెలుస్తుంది. దానిని బట్టి నష్ట పరిహారం ఇవ్వొచ్చు. ఎందుకంటే నీటమునిగిన పంట ఐదు రోజుల పాటు నీటిలో ఉంటే పనికొస్తుందా? ఎవరిని అడిగినా చెబుతారు. ఈ విషయం వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు తెలియదా? పాలకులకు ఏవేలో కబుర్లు చెప్పి ఎన్యుమరేషన్‌ను ఆలస్యం చేస్తున్నారని స్పష్టమైంది.
బురదలో కాలు పెట్టలేరా?
ఎన్యుమరేషన్‌ చేయాలంటే పొలాన్ని పూర్తిగా చూడాలని అధికారులు చెబుతున్నారు. రైతుతో పాటు బురదలో ఎన్యుమరేషన్‌ అధికారులు కాస్త దూరం నడవలేరా? బాపట్ల ప్రాంతంలో ఎకరా రూ. 25వేలకు కౌలుకు తీసుకుని రైతులు సాగు చేశారు. కౌలు రైతుల పంటలు పూర్తిగా నీటిపాలయింది. శుక్రవారం బాపట్ల జిల్లా పర్యటనలో పొలాలో పర్యటించిన ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కౌలు రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తుపాన్‌ వల్ల అంధకారమైన సుమారు 100 గ్రామాల్లో ప్రభుత్వం విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించలేదు. మొత్తం 292 గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగినట్లు ఇందన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డికి 7వ తేదీ రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు.
11 నుంచి వ్యవసాయ శాఖ ఎన్యుమరేషన్‌ చేపడుతుందట
ఈనెల 11వ తేదీ నుంచి పంట నష్టం అంచనా ఎన్యుమరేషన్‌ మొదలు పెడతామని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డికి ఈనెల 7వ తేదీ రాత్రి వీడియో కన్ఫరెన్స్‌లో తెలిపారు. సుమారు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతుంటే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు చెబుతున్నది.
తుపాన్‌ వచ్చిన వారం రోజుల తరువాత ఎన్యుమరేషన్‌ చేస్తామని అధికారులు అంటున్నారంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? వారం రోజుల పాటు రైతులు అధికారుల కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలా? గ్రామంలోనే పాలనా యంత్రాంగ నిత్యం అందుబాటులో ఉంటుందని చెబుతున్న అధికారులు తుపాన్‌ నష్టం అంచనాలకు వారం రోజుల సమయం ఎందుకు తీసుకుంటున్నారో వారికే తెలియాలి. పొలాల్లో నీళ్లు బయటకు పోయిన తరువాత అంటే మరో పది రోజుల పాటు పొలాల్లో నీళ్లు అలాగే ఉండే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు పొలాల్లోని నీటిని బయటకు పంపే కార్యక్రమం తూతూ మంత్రంగా చేస్తున్నారని, దీని వల్ల ఒరిగేదేమీ లేదని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌ ఫెడరల్‌తో అన్నారు.


Next Story