హైదరాబాద్‌లో డేంజర్ బెల్ : పొంచి ఉన్న వాయుకాలుష్యం ముప్పు
x
Air Pollution (Photo Credit : Facebook)

హైదరాబాద్‌లో డేంజర్ బెల్ : పొంచి ఉన్న వాయుకాలుష్యం ముప్పు

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దక్షిణాది మెట్రో నగరాల్లోనే అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.


హైదరాబాద్ నగరంలో ఏటేటా వాయు కాలుష్యం పెచ్చు పెరిగిపోతోంది. దక్షిణ భారతదేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ లోనే అత్యధికంగా వాయు కాలుష్యం ఉందని ఇటీవల గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, కొచ్చి నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలోనే 2.5 పీఎం పది కాలుష్య కారకాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాణాల కంటే 14 రెట్లు అధికంగా మన నగరంలో కాలుష్యం విడుదల అవుతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లోనూ కాలుష్య నగరాల జాబితాలో మన నగరం చేరడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగింది. వాయుకాలుష్యం బంజారాహిల్స్ లో 127ఏక్యూఐ, కేపీహెచ్‌బీ లో 124, పాతనగరం జూపార్కు ప్రాంతంలో 144, సైదాబాద్ లో 110ఏక్యూఐకి చేరింది. పారిశ్రామికవాడలున్న మల్లాపూర్, నాచారం, బాలానగర్, పటాన్ చెరు, పాశమైలారం, చర్లపల్లి ప్రాంతాల్లో వాయు కాలుష్యం శనివారం అనూహ్యంగా పెరిగింది.


కాలుష్యానికి కారకాలు...
హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం 8.30 గంటలకు వాయు కాలుష్యం 158 ఏక్యూఐకి చేరిందని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కాలుష్యం పెరగడానికి పలు కారణాలున్నాయి. వాహనాల ఉద్గారాలు, భవన నిర్మాణ కార్యకలాపాలు, కర్మాగారాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు. గాలిలో నైట్రోజన్ డై ఆక్స్‌డ్ ఎక్కువగా ఉంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత కోల్ కతా, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబయి కంటే కూడా హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని తేలింది. ప్రపంచ కలుషిత మెట్రో నగరాల జాబితాలోకి హైదరాబాద్ చేరింది. నగరంలో రోజుకు 7వేల మెట్రిక్ టన్నుల చెత్త విడుదల అవుతోంది. ఈ చెత్త వల్ల కూడా కాలుష్యం పెరిగిపోతోంది. నగర శివార్లలో డంపింగ్ యార్డు నుంచి తీవ్ర దుర్గంధం వెలువడుతోంది. విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో జనాభాతో పాటు వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే 70 లక్షలకు పైగా వాహనాలున్నాయి. వాహనాల కాలుష్యంతోపాటు భవనాలు, రోడ్ల నిర్మానాల వల్ల కూడా వాయు కాలుష్యం ఏర్పడుతోంది. వచ్చే పదేళ్లలో నగరంలో కాలుష్యం పెరిగి ముక్కు మూసుకొని జీవనం గడిపే పరిస్థితులు ఏర్పడనున్నాయి.

పరిశ్రమల నుంచి వెలువడుతున్న కలుషిత వాయువులు
నగర శివార్లలోని పటాన్ చెరు, పాశమైలారం, మియాపూర్, కాజుపల్లి, ఐడీఏ బొల్లారం, బాచుపల్లి, జీడిమెట్ల,బాలానగర్, మల్లాపూర్, నాచారం, మౌలాలీ, చర్లపల్లి ప్రాంతాల్లోని కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డుకు బయటకు తరలిస్తామని ప్రభుత్వం చెప్పినా, ఇంకా అమలు కాలేదు. పరిశ్రమల నుంచి వాయు కాలుష్యం నగరానికి వ్యాపిస్తోంది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కలుషిత వాయువులు వెలువడుతుండటంతో గాలి నాణ్యత తగ్గుతోంది. కెమికల్ పరిశ్రమల వల్ల భూగర్భజలాలు, జలవనరులు కలుషితమవుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థ జలాలు, మురుగునీరు హుసేన్ సాగర్, మూసీ నదుల్లో కలుస్తుండటంతో అవి కూడా కాలుష్య కాసారాలుగా మారాయి. బోరు నీరు రంగు మారడంతోపాటు దుర్వాసన వస్తోంది.

వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
గాలి కాలుష్యంతో సోషల్ మీడియా, ఆన్ లైన్ ద్వారా కూడా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ)ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఈ ఫిర్యాదులను పరిశీలించేందుకు 24 గంటల పాటు మానిటరింగ్ సెల్ ఉంది. ఫిర్యాదులపై మానిటరింగ్ టీం, క్విక్ రియాక్షన్ టీం,రీజనల్ ఆఫీసర్లు, టాస్క్ ఫోర్స్ టీంలు వెళ్లి గాలి నాణ్యతను పర్యవేక్షిస్తుంటాయి. హైదరాబాద్ నగరంలో కాలుష్య ఫిర్యాదులపై 77 పరిశ్రమలను టీఎస్ పీసీబీ అధికారులు ఫిబ్రవరి నెలలో తనిఖీలు చేశారు. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని మల్లాపూర్, జీడిమెట్ల, గడ్డపోతారం, బొంతపల్లి, పటాన్ చెరు, తక్కళపల్లి, వాడపల్లి, పిట్టంపల్లి, గుమ్మడిదల, చౌటుప్పల్, నందనం, కుషాయిగూడ, చెట్లగౌరారం, మణుగూరు, హయత్ నగర్, బీబీనగర్, బొమ్మలరామారం, మేడ్చల్ దేవాపూర్, మారేపల్లి, ఇస్నాపూర్, మహేంద్రనగర్, పాల్వంచ, దుండిగల్, కవాడిపల్లి, నారాయణగిరి, చిలకమర్రి, పెద్దకాపర్తి ప్రాంతాల పరిశ్రమల్లో పీసీబీ అధికారులు తనిఖీలు చేశారు. పలు కంపెనీల్లో నిర్ణీత ప్రమాణాల కంటే అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని పీసీబీ అధికారులు తేల్చారు.

ఆన్ లైన్ ఫిర్యాదులకు జనవాణి కాలుష్య నివారిణి
వాయు కాలుష్యంపై ఆన్ లైన్ ఫిర్యాదుల కోసం కాలుష్య నియంత్రణ మండలి జనవాణి కాలుష్య నివారిణి పేరిట యాప్ ను కూడా ప్రవేశపెట్టింది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యంపై ప్రజలు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. నగరంలోని కాలనీ సంక్షేమ సంఘాలు కాలుష్యంపై ఫిర్యాదులు సమర్పించాయి. మల్లాపూర్, నాచారం కాలుష్య కారక పరిశ్రమలపై తాము పీసీబీకి ఫిర్యాదు చేశామని, దీనిపై కాలుష్య నియంత్రణ అధికారులు దర్యాప్తు చేస్తామని చెప్పారని మల్లాపూర్ లోని వెంకటరమణ కాలనీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మహ్మద్ గౌస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

శ్వాసకోశ వ్యాధులు
కాలుష్యం వల్ల నగర ప్రజలు శ్వాసకోశ వ్యాధుల పాలవుతున్నారు. కలుషిత వాయువుల వల్ల కళ్లు, ముక్కు మండుతూ ప్రజలకు చికాకు కల్పిస్తున్నాయి. దీనివల్ల ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటున్నాయి. కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడటంతోపాటు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.

కాలుష్య కాసారం హుస్సేన్ సాగర్
నగరంలోని హుస్సేన్ సాగర్ సరస్సు నీటి నాణ్యతలో క్షీణించిందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా పరిశీలనలో తేలింది. సరస్సు కాలుష్య కాసారంగా మారడంతో సాగర్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డుపై వాయుకాలుష్యం పెరిగింది. సాగర్ నీటిలో మల కోలిఫారమ్‌తో సహా బ్యాక్టీరియా, హానికరమైన వ్యర్థాలు పెరిగాయని పీసీబీ తేల్చి చెప్పింది. మూసీలో కూడా మురుగునీరు చేరుతుండటంతో దుర్గంధం వ్యాపిస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మూసీ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టారు. నీటి నాణ్యతను మెరుగుపర్చడానికి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పనిచేస్తున్నా కాలుష్యం తగ్గడం లేదు. బంజారా నాలా నుంచి మురుగునీటి వ్యర్థాలు సాగర్ లో కలుస్తున్నాయి.

మాస్కులు ధరించండి
హైదరాబాద్‌ నగరంలో కరోనా లేనప్పటికీ బయటికి వెళ్లినప్పుడు ప్రజలు వాయు కాలుష్యం బారినపడకుండా ఎన్ 95 మాస్క్‌ ధరించాలని హైదరాబాద్ నగరంలోని ఆశ్రిత ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రామ్మోహన్ రావు సూచించారు. కార్యాలయాలకు వెళ్లే వ్యక్తులు వ్యక్తిగత వాహనాలకు దూరంగా ప్రజా రవాణా లేదా కార్‌పూలింగ్‌ను ఉపయోగించాలని పీసీబీ అధికారులు సలహా ఇచ్చారు.వాయు కాలుష్యాన్ని నివారించడానికి కిటికీలను మూసివేయాలని, ఆరుబయట మాస్క్ ధరించాలని, ఎయిర్ ప్యూరిఫైయర్‌ లను వాడాలని పీసీబీ అధికారులు సూచించారు.

ఎలక్ట్రిక్ వాహనాలు వాడండి : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్

హైదరాబాద్ నగరంలో వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతున్నందున దీనికి తెర వేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ ప్రసన్నకుమార్ సూచించారు. నగరంలో జనసాంద్రత పెరగడంతోపాటు కాలుష్యం ఏ రోజు కారోజు పెరుగుతుందని, దీన్ని నివారించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఇటీవల నగరంలో మల్టీస్టోరేజ్ భవనాల నిర్మాణం వల్ల దుమ్మూ, ధూళి పలు ప్రాంతాల్లో పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పొగ అయితే గొట్టం ద్వారా పైకి పోతుందని, కాని నిర్మాణ వ్యర్థాలు గాలిలో వ్యాపించి వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయని ప్రసన్నకుమార్ చెప్పారు.Read More
Next Story