తెలంగాణలో తగ్గిన ఆదాయం,ఆదాయం పెంపునకు భూముల విలువ పెంపు
x
తెలంగాణ సచివాలయం

తెలంగాణలో తగ్గిన ఆదాయం,ఆదాయం పెంపునకు భూముల విలువ పెంపు

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఆరు గ్యారంటీల అమలు, రుణమాఫీ కోసం నిధులు అవసరం కాగా,2023-24 ఆర్థిక సంవత్సరంలో 78 శాతం ఆదాయమే వచ్చింది.


2023-24 వ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.16 లక్షల కోట్ల ఆదాయం అంచనా కాగా కేవలం రూ.1.69 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి అంటే 78.08 శాతం ఆదాయం మాత్రమే వచ్చింది. దీంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ‘ఫెడరల్ తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం...

- ప్రాథమిక అంచనాల ప్రకారం పన్నుల రూపేణా రావాల్సిన ఆదాయం రూ. 1.52కోట్లు కాగా కేవలం రూ.1.35 కోట్ల పన్నులే వసూలు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో రూ.49,440కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది. వచ్చిన ఆదాయంలో రుణాల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రణాళికేతర రుణాల భారం రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది.
- తెలంగాణ రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఆదాయం పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సీఎం సచివాలయంలో సమావేశమయ్యారు.
- వాణిజ్య పన్నులు, స్టాంపులు,రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ శాఖల ద్వారా సాధించిన ఆదాయ వసూళ్లను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు రూ.53,196 కోట్లు
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు రూ.53,196 కోట్లను బడ్జెట్ లో కేటాయించారు. ఈ పథకాలపై మరిన్ని అదనపు నిధులు కేటాయించాల్సి ఉంది. అసలే రాష్ట్ర ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే ఆదాయం పెంచుకోవడం ఒక్కటే మార్గం.టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళలకు నెలకు రూ.2,500 సహాయం, అర్హులకు రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రధానమైనవి. వీటిని అమలు చేయడంతోపాటు రైతులకు ఆగస్టు 15వతేదీ లోగా రుణ మాఫీ చేయాలంటే రాష్ట్ర ఆదాయం పెంచుకోక తప్పని పరిస్థితి నెలకొందని రాష్ట్ర ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఈ పథకాల అమలుకు బడ్జెట్ ఏది?
నిరుపేదలకు ఇంటి స్థలం,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సొంత భూమి ఉన్నవారికి ఇంటి నిర్మాణానానికి రూ.ఐదు లక్షల సహాయం,యువ వికాసం కింద విద్యార్థులకు రూ. ఐదు లక్షల ఇవ్వాలనే చేయూత పథకం, రూ. 4,000 సామాజిక భద్రత నెలవారీ పెన్షన్ పెంపు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేదు. దీంతో ఆదాయం పెంపుపైనే సీఎం దృష్టి సారించారు.

ఆదాయం కోసం ప్రభుత్వ భూముల విక్రయం తప్పదా?
రాష్ట్ర ఆదాయం పెరగకుంటే తెలంగాణలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న విలువైన భూముల విక్రయం ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అంశం. ప్రభుత్వ భూములను విక్రయం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పాలకులు యోచిస్తున్నారు.

పేదలకు అందని సీఎం రిలీఫ్ ఫండ్
తెలంగాణలో గత ఆరు నెలలుగా వేలాదిమంది పేదలు వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత ఆరు నెలలుగా సీఎం రిలీఫ్ ఫండు విడుదల కాలేదు. దీంతో పేదలు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలలో వృధా ఖర్చులను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ పాలకులు నిర్ణయించుకున్నారు. ఎలాగైనా ఆదాయం పెంపు ద్వారానే పథకాలు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.

రాష్ట్రంలో పెరగనున్న భూముల మార్కెట్ విలువ
తెలంగాణలోని హైదరాబాద్ నగరంతోపాటు అన్ని ప్రాంతాల్లోనూ భూముల మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే భూముల వాస్తవ మార్కెట్ విలువలకు ప్రభుత్వ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నిర్దేశించిన భూముల విలువలకు భారీ వ్యత్యాసం ఉంది. దీంతో భూముల విలువలను సవరించడం ద్వారా హేతుబద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో భూముల రిజిస్ట్రేషన్ విలువలు కూడా పెరగనున్నాయి.

ఎనిమిదేళ్ల వరకు భూముల విలువలు పెంచలేదు...
ఇండియన్ స్టాంప్ చట్టం నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం భూముల మార్కెట్ విలువను సవరించాలి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్ల వరకు భూముల విలువలను పెంచలేదు. 2014 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2021 వరకు భూముల మార్కెట్ విలువను రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. అవిభాజ్య ఏపీలో 2013లో సవరించిన భూముల మార్కెట్ విలువలు 2021వ సంవత్సరం వరకు అంటే తెలంగాణలో ఎనిమిదేళ్లపాటు అమలులో ఉన్నాయి.

రెండు సార్లు పెంచిన గత సర్కార్
రాష్ట్ర ప్రభుత్వం 2021 జులై నెలలో తెలంగాణలో మొదటిసారిగా భూముల మార్కెట్ విలువ,రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీని పెంచింది. ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను 2022 ఫిబ్రవరిలో రెండవసారి పెంచింది. అయినప్పటికీ భూముల వాస్తవ మార్కెట్ విలువ, ప్రభుత్వ భూముల విలువల మధ్య భారీ అంతరం ఉంది. దీంతో వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలోని భూముల మార్కెట్ విలువల ఖరారులో శాస్త్రీయ పద్ధతిని అనుసరించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను సీఎం ఆదేశించారు.

మద్యం అమ్మకాలు పెరిగినా, లక్ష్యం చేరని ఆదాయం
గత ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల సీజన్‌లో మద్యం విక్రయాలు అధికంగా జరిగినా, ఎక్సైజ్ ఆదాయం లక్ష్యాలను చేరుకోలేదు. మద్యం స్మగ్లర్లు, పన్ను ఎగవేతదారుల వల్ల ఎక్సైజ్ ఆదాయానికి గండి పడుతోంది. దీంతో మద్యం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

జీఎస్టీ ఎగవేతపై ఆందోళన
తెలంగాణలో జీఎస్టీ ఎగవేతపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని, జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్‌లో ఎలాంటి అవినీతి, అక్రమాలు వెలుగులోకి రాకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు.ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ కలెక్షన్ పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలని సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు.

పన్నుల రాబడి పెంచండి
పన్నుల రాబడిని పెంచి వార్షిక లక్ష్యానికి అనుగుణంగా లక్ష్యాలను చేరుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం కోరారు. పన్నుల వసూళ్లలో సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. రెవెన్యూ శాఖల్లోని లొసుగులను తొలగించాలని అధికారులకు ఆయన సూచించారు.

సామాన్యులకు ఇసుక కొరత రానీయవద్దు
సామాన్యులకు, చిన్న చిన్న భవన నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి మైనింగ్ అధికారులను ఆదేశించారు.ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని సీఎం సూచించారు.

నెలవారీగా అధికారులకు సీఎం లక్ష్యాలు
గత ఏడాది అంటే 2023-24ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. బడ్జెట్ లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెలా మంత్లీ లక్ష్యాలను నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.


Read More
Next Story