యాదాద్రి సన్నిధిలో భట్టీకి అవమానం...నేతలు, నెటిజన్ల ఆగ్రహం
x
Bhatti's humiliation

యాదాద్రి సన్నిధిలో భట్టీకి అవమానం...నేతలు, నెటిజన్ల ఆగ్రహం

లక్ష్మినరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తీవ్ర అవమానం జరిగిందా? అంటే అవునంటున్నారు నెటిజన్లు, నేతలు.సోషల్ మీడియాలో వైరల్ అయిన స్టోరీ.


యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కుకు సోమవారం తీరని అవమానం జరిగింది. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. సీఎం దంపతులతోపాటు మంత్రులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పీటలపపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రొటోకాల్ ప్రకారం సీఎం పక్కన భట్టి విక్రమార్క కూర్చొవాలి. కానీ దళితుడైన డిప్యూటీ సీఎం భట్టి చిన్న పీటపై కూర్చుండి పోయారు. దీంతో దళిత వర్గానికి చెందిన భట్టి చిన్న పీటపై కూర్చున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిప్యూటీ సీఎం భట్టికి యాదాద్రి సాక్షిగా అవమానం జరిగిందని పలువురు నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు, నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. భట్టి చిన్న పీటపై కూర్చున్నారని ఇదీ కదా భక్తి అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదంతా భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా రాద్ధాంతం అని కాంగ్రెస్ కొట్టి పారేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదట దళితులను అవమానించిన పార్టీ బిఆర్ ఎస్ అని, దళితులకు ఇచ్చిన వాగ్దానాలను వమ్ము చేసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అని కాంగ్రెస్ నేత ప్రభుత్వ విఫ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.



డిప్యూటీ సీఎంను వెనుక నిలబెడతారా?
చిన్న పీటపై డిప్యూటీ సీఎంను కూర్చొబెట్టడమే కాకుండా ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించేటపుడు ఇతర మంత్రులు ముందు వరసలో నిలబడగా, డిప్యూటీ సీఎం వెనుక నిలబడ్డారు. ఇలా డిప్యూటీ సీఎంకు అడుగడుగునా అన్యాయం జరిగిందంటూ నెటిజన్లు మండిపడ్డారు. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం భట్టి చిన్న పీటపై కూర్చోవడం చూసి తాను చాలా బాధ పడ్డానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రెడ్డి మంత్రులంతా పెద్ద పీటలపైన కూర్చొని, దళిత బిడ్డ అయిన భట్టిని చిన్న పీటపై కూర్చొని ఉండటం చూడటానికి ఎబ్బెట్టుగా ఉందని కవిత వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసిగించిందెవరు?
ఇది ఇలా ఉంటే దళితనేతను తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కెసిఆర్ చేసిన వాగ్దానం అమలు చేయకపోవడం దళితులను అవమానించడమే కదా అని డాక్టర్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఇంతకంటే పెద్ద అవమానం ఏముంటుందని చెబుతూ భట్టి యాదాద్రి ఆలయంలో సీటు విషయాన్ని రాద్ధాంతంచేయడం వెనక రాజకీయం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దళితుడయిన డిప్యూటి సిఎం రాజయ్యను, మరొక మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కెసిఆర్ ఎలా అవమాన పర్చింది ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారని, అందుకే బిఆర్ ఎస్ ను ఓడించారని కాంగ్రెసక్ నేత పేర్కొన్నారు. ఓడిపోయిన పరాభవం నుంచి కోలుకోలేక బిఆర్ ఎస్ నేతలు చీప్ పబ్లిసిటీకి వెళ్తుతున్నారని, అందుకే ప్రతి విషయంలో వూహించుకున్నవాటిని చూస్తున్నారని లక్ష్మణ్ అన్నారు.
దళిత డిప్యూటీ సీఎంకు అవమానం జరిగింది...
దళితుడైన డిప్యూటీ సీఎ భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందంటూ తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ లో ఆరోపించారు. డిప్యూటీ సీఎం రెడ్డి మంత్రుల్లాగా ముందు వరసలో నిలబడే అర్హత లేదా అంటూ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ పోస్టును యాదాద్రిలో వివక్ష అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు, రాహుల్ గాంధీలకు ట్యాగ్ చేశారు. ‘‘ఈ రోజు యాదాద్రి దేవుడి సాక్షిగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి గారికి జరిగిన అవమానం చిత్రాలు ఒక్కొక్కటే బయటికొస్తున్నయ్. మంత్రి కోమటిరెడ్డి లాగా ముందు వరుసలో నిలబడే అర్హత లేదా దళితుడైన ఉప ముఖ్యమంత్రికి???’’ అంటూ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

సీఎంఓ ఎక్స్ పోస్టు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష‍్మీనరసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారని సీఎంఓ ఎక్స్ పోస్టులో పేర్కొంది.శ్రీ లక్ష‍్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి సతీసమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని పోస్టులో పేర్కొన్నారు.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సతీసమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పోస్టు పెట్టారు.ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఇతరులు పాల్గొన్నారని సీఎం పెట్టిన ఎక్స్ పోస్టులో తెలిపారు.

యావత్ దళిత జాతిని అవమానించారు...
యాదాద్రి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని, ఒక ఎస్సీ బిడ్డను చిన్న పీటపై కూర్చోబెట్టారని, ఈ ఘటన ద్వారా యావత్ దళిత జాతిని అవమానించారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి.. ఎక్కడ చెప్పుకోవాలని బాల్క సుమన్ ప్రశ్నించారు. భట్టి విక్రమార్కకు జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పా సుమన్ డిమాండ్ చేశారు.


Read More
Next Story