పదవికి రాజీనామా చేసి సినిమాకు వెళ్లిన తెలుగు సిఎం ఎవరో తెలుసా?
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి భార్యతో కలిసి సినిమాకు వెళ్ళారు. పదవి పోయినా బాధ పడని ఆ ముఖ్యమంత్రి ఎవరు?
ఈ తరం రాజకీయ నాయకులకు పదవే పంచప్రాణాలు. ఏం పోయినా పర్వాలేదు. పదవి లేకపోతే బతకలేమనుకుంటారు. ఆ మధ్య 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, ముఖ్యమంత్రి పదవి పోతూనే భారత రాష్ట్ర సమితి నాయకుడు కె చంద్రశేఖర్ ఎంతో డీలాపడిపోయాడు. ఇప్పటి వరకు ఆయన పత్తా లేకుండా పోయాడు. గజ్వేల్ లోని ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడు బయట తిరగడం మానేశాడు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఉన్నా అసెంబ్లీకి కూడా రావడం లేదు.
ఆంధ్రాలో జగన్ ను పరిస్థితి అంతే. అయిదేళ్లు అనుభవించి ముఖ్యమంత్రి పోతూనే తలకిందులయిపోయాడు. బయట తిరగడం లేదు. అసెంబ్లీకి రావడం లేదు. కెసిఆర్, జగన్ ముఖాల్లో చిరునవ్వు మాయమయింది.
ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఒకపుడు ఒకపుడు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు.ఆయన కూడా పదవి వదలుకోవలసి వచ్చింది ఆయన రాజీనామా చేశాడు. తర్వాత క్రుంగిపోలా. కనిపించడం మానేయలేదు. సంతోషంగా భార్యతో కలసి సినిమా చూడ్డానికి వెళ్లాడు.
ఆ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా. దామోదరం సంజీవయ్య.
ఆయన 1960 జనవరి 11 ఉమ్మడి ఆయన ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అపుడున్న ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పదవికి రాజీనామా చేశాడు. ఎందుకో తెలుసా? ప్రవేటు బస్సులు తిరుగుతున్న కొన్నిరూట్లను ఆయన జాతీయం చేశాడు. దాన్ని ప్రయివేటు బస్ ఆఫరేటర్లు సవాల్ చేశారు. కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. సుప్రీంకోర్టు ఆయనకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీనికి బాధపడ్డాడు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామ చేశాడు. అయితే, నెహ్రూ ఆయన్ని ఎఐసిసి అధ్యక్షుడిగా నియమించాడు. ఇక, ఆంధ్రాలో ముఖ్యమంత్రి పదవికోసం కీచులాటలు మొదలయ్యాయి. ఈ గొడవల్లో నెహ్రూ ఏ ముఠాకు చెందని దామోదరం సంజీవయ్యని ముఖ్యమంత్రి చేశారు. ఆయన 1962 దాకా రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1962 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించాడు కూడా. ముఖ్యమంత్రిగా తననే కొనసాగిస్తారనుకున్నారు. అది జరగలేదు.కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామాచేయాలని చెప్పింది. ఆయన వెంటనే రాజ్ భవన్ కు వెళ్లి, గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించి ఏం చేశాడో తెలుసా?ఎలాంటి ఎస్కార్టు, కాన్వాయ్ లేకుండా భార్య కృష్ణ వేణిని తీసుకుని సికిందరాబాద్ లో ఉన్న అజంతా టాకీసులో సినిమా చూసేందుకు బయలుదేరాడు. సినిమా చూసి ఎలాంటి ఆందోళన లేకుండా ఇంటికి వెళ్లిపోయారు.
ఇలాంటి ముఖ్యమంత్రులు ఉన్నారా ఈ రోజుల్లో.
(ఈ విషయాన్ని ప్రముఖ రచయిత నరిశెట్టి ఇన్నయ్య తన Humanists Chief Minister I Met అనే పుస్తకంలో రాశారు.)
Next Story