కాంగ్రెస్ సర్కార్ ను బీఆర్ఎస్ పడగొట్టాలనుకుంటోందా?
x
సీపీఎం కార్యదర్శి తమ్మినేని, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని (ఫైల్ పోటో)

కాంగ్రెస్ సర్కార్ ను బీఆర్ఎస్ పడగొట్టాలనుకుంటోందా?

''మీరు 65-మేము 54'' అనడం దేనికి సంకేతం? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటారా?


“ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో చూస్తాం.. ఏడాది సైతం ఉండదు.. అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారా..? బేరసారాలు మొదలు పెడతారా? అంటే ప్రభుత్వాన్ని పడగొడతారా” అని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు సాక్షాత్తు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీని నిలదీయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. రేవంత్ ప్రభుత్వం మూడు నెలలే ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు నిండు సభలో అన్నారు. దాంతో నిన్నంతా రాష్ట్రమంతటా ఇదే చర్చనీయాంశమైంది. కేటీఆర్ ఆ మాట ఎందుకు అన్నారో అర్థం కావడం లేదని, ఒకసారి ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్ల వరకు కొనసాగాలని, అదే ప్రజాస్వామ్యం అన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ. తమకు నచ్చని ప్రభుత్వాలను పడగొడతామనే అర్థం మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని కేటీఆర్ లాంటి ఉద్యమకారుడుకి తెలియదునుకోలేం. కానీ బాహాటంగానే మూడు నెలల్లో రేవంత్ ప్రభుత్వం కూలుతుందన్న కేటీఆర్ వివాదంలో చిక్కారు. ఈ అంశంపై సీపీఐ, సీపీఎం, మరికొన్ని ప్రజా సంఘాలు కేటీఆర్ తీరును విమర్శించాయి.

''మీరు 65, మేము 54'' అంటే ఏమిటీ?

అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికీ శాసనసభలో మా బలం ఉంది. ''మీరు 65-మేము 54'' అని అన్నారు. ఇది దేనికి సంకేతం? 8మంది బీజేపీ సభ్యులతో పాటు, 7గురు ఎంఐఎం సభ్యులను కలుపుకుని తామంతా ఒక్కటే అని చెప్పదలచుకున్నారా? అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధినాయకుడు కేసీఆర్‌ చెప్పిన “బీఆర్‌ఎస్‌ లౌకిక పార్టీ” ఇదేనా అని నిలదీయడంతో పాటు “దేశ వ్యాపితంగా కులాలు, మతాలు, తెగల మధ్య అస్థిత్వ భావజాలాన్ని ఉపయోగించి పబ్బం గడుపుకుంటున్న బీజేపీతో బీఆర్‌ఎస్‌ భవిష్యత్‌లో అంటకాగ దలచుకున్నారా? ” స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తే సీపీఐ మరో అడుగు ముందుకు వేసి.. కాంగ్రెస్ శాసనసభ్యుల్ని కొనాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా అనే అనుమానాన్ని వ్యక్తం చేసింది.

అత్యుత్సాహం వద్దు..

ఈ పాయింట్ ను సరిగానే పట్టుకున్న కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. “కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అది మంచిది కాదు. గెలుపోటములు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవడానికి బదులు ఈ ప్రభుత్వం పడిపోతుందీ, పడగొట్టేస్తాం అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటారా.. అది మంచిది కాదు, కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలి. తెలంగాణ ప్రజల నీతి నిజాయతీని పక్కదారి పట్టించొద్దు. గత పదేళ్ల కాలంలో కొనుగోలు, అమ్మకాలు, విపరీత స్థాయిలో జరిగాయి, రాజకీయ నాయకులను ఎంత మందిని కొనుగోలు చేశారు, ఎంత మంది అమ్ముడుపోయారు అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అనే భావన కలిగేలా కేటీఆర్‌ మాట్లాడారు. ఇది మంచిది కాదు” అని కూనంనేని హితవు పలికారు. అసెంబ్లీని ఎక్కువరోజులు నడిపేలా చూడాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో సభ మొక్కుబడిగా జరిగిందని, సభలో అర్థవంతమైన చర్చ జరగాలని సూచించారు. స్వేచ్ఛలేని జీవితాన్ని తెలంగాణ ప్రజలు అంగీరించబోరన్నారు కూనంనేని.

వెళ్లిపొమ్మంటే వెళ్తాను...

“తెలంగాణ సౌభాగ్య, సంపన్న రాష్ట్రమని చెప్పిన గత ప్రభుత్వ హాయాంలో ఒకటో తేదీన జీతాలు ఎందుకు పడలేదు” అని కూనంనేని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్ధులకు ఇస్తామన్న రూ.7,500కోట్ల స్కాలర్షిప్ లనూ విడుదల చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం అలాంటి తప్పులను చేయవద్దని కూనంనేని చెప్పబోతుండగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుతగిలినప్పుడు కూనంనేని చాలా తీవ్రంగా స్పందించారు. ‘‘నేను ఏం మాట్లాడుతున్నానో అర్ధం చేసుకోకుండానే అడ్డుతగులుతున్నారు. అదే మీతో వచ్చిన సమస్య. సభ నుంచి వెళ్లి పొమ్మంటే వెళ్తాను’’ అని ఘాటుగా స్పందించడంతో బీఆర్ఎస్ సభ్యులు వెనక్కితగ్గారు. ‘‘ఇదేం సభ.. ఒక్కడిని మాట్లాడుతుంటే ఇంతమంది ఇబ్బంది పెడతారా. నన్ను బెదిరించలేరు’’ అని సమాధానం ఇవ్వడంతో స్పీకర్ జోక్యం చేసుకోవడంలో సభ సజావుగా సాగింది.

Read More
Next Story