తెలంగాణలో పొంచివున్న మంచి నీళ్ల సంక్షోభం...
x
Water Crisis (Photo Credit : Facebook)

తెలంగాణలో పొంచివున్న మంచి నీళ్ల సంక్షోభం...

తెలంగాణలో ఈ ఏడాది వేసవికి ముందే మంచినీటికి కటకట ఏర్పడింది.హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోని ప్రాజెక్టుల్లో నీటినిల్వలు తగ్గడం, భూగర్భజలాలు అనూహ్యంగా పడిపోవడంతో మునుపెన్నడూ లేని విధంగా మంచినీటి సంక్షోభం ఏర్పడనుంది.


తెలంగాణలోని పలు నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే మంచినీటి కొరత ప్రారంభమైంది. తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామాలు,ఆవాసాలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కేవలం 11 టీఎంసీలు మిగిలి ఉండడంతో పాటు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి లీకేజీల కారణంగా నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తెలంగాణలో ప్రాజెక్టు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం, అడుగంటిన భూగర్భ జలాలతో వేసవికాలంలో తీవ్ర మంచినీటి సంక్షోభం ఏర్పడనుంది. తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 1.5 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గిపోవడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. నిర్మాణ లోపాలతో పలు మిషన్ భగీరథ పథకాలు పనిచేయక పోవడంతో ప్రజలు మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య వేసవికాలంలో మరింత జఠిలం కానుందని గ్రామీణ నీటి సరఫరా విభాగం మాజీ ఇంజినీర్లే చెబుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు తాగు నీటి కోసం మినరల్ వాటర్ క్యాన్లను కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

అడుగంటిన భూగర్భజలాలు

ఈ ఏడాది జనవరిలో సగటు భూగర్భ జలాలు భూగర్భజలాలు ఎంబీజీఎల్ 7.72 మీటర్ల దిగువకు తగ్గిపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో నీటి సంక్షోభం ఏర్పడింది. తెలంగాణలోని మూడు జిల్లాల్లో భూగర్భ జలమట్టం 3ఎంబీజీఎల్ కు పడిపోయింది. వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భూగర్భజలమట్టాలు మరీ తగ్గిపోయాయి. నల్గొండలో బోర్లు ఎండిపోవడంతో పంటలను కాపాడుకునేందుకు కొత్త బోర్లు వేసుకునేందుకు రైతులు యత్నిస్తున్నారు. వేసవికాలానికి ముందే భూగర్భజల మట్టాలు తగ్గిపోవడంతోపాటు బోర్లకు డిమాండ్ ఏర్పడటంతో బోరువెల్ డ్రిల్లర్లు రేట్లను పెంచారు. గతంలో అడుగుకు 60రూపాయలు వసూలు చేసే బోరువెల్ డ్రిల్లర్లు ఈ ఏడాది అడుగుకు 70 రూపాయలకు పెంచారు. గడచిన అయిదేళ్లలో భూగర్భజలమట్టాలను పరిశీలిస్తే ఈ ఏడాది గణనీయంగా తగ్గాయి.కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడం వల్ల కూడా భూగర్భజలాల నీటిమట్టాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు.నాగర్‌కర్నూల్ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు 3.57 మీటర్ల లోతు పడిపోయాయి.

హైదరాబాద్ జలాశయాల్లోనూ తగ్గిన నీటిమట్టం

హైదరాబాద్ నగరానికి మంచినీటిని సరఫరా చేసే ప్రాజెక్టు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, సింగూర్, మంజీరా, అక్కంపల్లి, నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయాల్లో నీటి మట్టం గత ఏడాది కంటే తగ్గింది. ఉస్మాన్ సాగర్ జలాశయ నీటి మట్టం బుధవారం నాడు 1785.700 అడుగులకు తగ్గింది. గత ఏడాది ఇదేరోజు ఉస్మాన్ సాగర్ లో 1788.650 అడుగుల నీరుంది. కానీ సజావుగా వర్షాలు కురవక పోవడంతో గత ఏడాది కంటే ఈ ఏడాది జలాశయంలో 3.590 టీఎంసీల నీటి నిల్వ తగ్గింది. అలాగే హిమాయత్ సాగర్ జలాశయంలో 2.735 టీఎంసీల నీరు తగ్గింది. బుధవారం హిమాయత్ సాగర్ జలాశయ నీటిమట్టం 1760.450 అడుగులకు దిగిపోయింది. సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వల్లో 23.085 టీఎంసీల మేర తగ్గింది. కృష్ణా నదిపై ఉన్న అక్కంపల్లి రిజర్వాయర్ నీటిమట్టం గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడంతో ప్రభుత్వం క్రాప్ హాలిడేని ప్రకటించింది.

డెడ్ స్టోరేజీకి చేరుకోనున్న ప్రాజెక్టులు

తెలంగాణలోని అన్ని ప్రాజెక్టు జలాశయాల్లో 517.81 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం కాగా ప్రస్థుతం బుధవారం నాడు 319.22 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. మంచినీటి కోసం వీటిని వాడితే పలు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకోనున్నాయి. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 517.100 అడుగులుంది. గత ఏడాది ఇదే రోజు అంటే ఫిబ్రవరి 21వతేదీన నాగార్జున సాగర్ జలాశయంలో 553.600 అడుగుల నీరు నిల్వ ఉండగా ఈ ఏడాది 217.750 టీఎంసీల మేర తగ్గింది. గత ఏడాది కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఆశించినమేర వర్షాలు కురవక పోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గాయి. దీంతో ఈ ఏడాది వేసవికాలంలో మంచినీటికి కూడా అవస్థలు తప్పని పరిస్థితి నెలకొందని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు.

జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు

శ్రీశైలం ప్రాజెక్టులో బుధవారం నీటిమట్టం 817.000అడుగులుండగా గత ఏడాది ఇదే రోజు దీని నీటిమట్టం 828.300 అడుగులు. గత ఏడాదితో పోలిస్తే శ్రీశైలంలోనూ 47.840 అడుగుల మేర నీరు తగ్గింది. గోదావరి నదిపై ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయంలో బుధవారం 473.185 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే రోజు 484.275 అడుగుల మేర నీరు ఉంది. గత ఏడాది కంటే 19.064 టీఎంసీల నీటి నిల్వలు తగ్గాయని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో బుధవారం నాటి నీటిమట్టం 1072.90 అడుగులు కాగా జలాశయంలో 35.04 టీఎంసీలు మాత్రమే నీరుంది. జూరాల ప్రాజెక్టులోనూ కేవలం 4.52 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రాజెక్టు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా మంచినీటి అవస్థలు ఏర్పడవచ్చని ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు.

తాగునీరందించని మిషన్ భగీరథ స్కీం...

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు అమలు చేసిన మిషన్ భగీరథ పథకం కింద చేపట్టిన పథకాలు సరిగా పనిచేయడం లేదని తెలంగాణ రూరల్ వాటర్ సప్లయి విభాగం మాజీ చీఫ్ ఇంజినీరు ఎం హరిఉమాకాంతరావు చెప్పారు. పథకం నిర్మాణాల్లో లోపాలు, పైపులైన్ల ఏర్పాటులో జరిగిన అక్రమాల వల్ల మిషన్ భగీరథ ప్రజల దాహార్తి తీర్చడం లేదని పేర్కొన్నారు. డిజైన్ లోపాలు, నిర్మాణ లోపాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయలేదు. పలు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకోవడం, భూగర్భజలాలు తగ్గడంతో ఈ ఏడాది తీవ్ర మంచినీటి ఎద్దడి తప్పదని ఆయన చెప్పారు. ప్రస్థుతం ఉన్న నీటిని ప్రజల అవసరాల మేర జులై నెల వరకు పొదుపుగా వాడాలని మాజీ చీఫ్ ఇంజినీరు సూచించారు. మిషన్ భగీరథ కింద వేసిన పైపులైన్లు ప్రస్థుతం నీటి సరఫరాకు అనువుగా లేవని, దీంతో తాగునీరు అందించలేదని పరిస్థితి నెలకొందని హరిఉమాకాంతరావు చెప్పారు.

తెలంగాణలో వేసవిలో మంచినీటి సరఫరాకు కార్యాచరణ ప్రణాళిక

మంచినీటి సమస్య ఉన్న పట్టణాలు, గ్రామాలను పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లయి అధికారులు గుర్తించారు.రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేసవికాలంలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కోటి రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తన ప్రత్యేక నిధుల నుంచి కేటాయించారు. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు తాము కంటింజెన్సీ ప్లాన్ ను రూపొందించారని రూరల్ వాటర్ సప్లయి విభాగానికి చెందిన ఓ ఇంజినీరు చెప్పారు. మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా కోసం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో అవసరమైన నీటి మట్టాన్ని కొనసాగించడానికి కడెం ప్రాజెక్టు నుంచి నీటిని అత్యవసరంగా విడుదల చేయాలని నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదించారు.




హైదరాబాద్ నగరానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక : వాటర్‌బోర్డు ఎండీ

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రాబోయే వేసవి కాలంలో హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాలు, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేస్తామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సి సుదర్శన్ చెప్పారు. అదనపు డిమాండ్ ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. బోర్ వెల్ మరమ్మతులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపడతామని చెప్పారు.వేసవి సీజన్‌లో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 22వతేదీన హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుందని హైదరాబాద్ జలమండలి అధికారులు చెప్పారు. షేక్‌పేట, బోరబండ, లింగంపల్లి రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో సరఫరాతో పాటు నీటి సరఫరాలో పూర్తి అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు భోజగుట్ట, బంజారాహిల్స్‌, రిజర్వాయర్‌ ప్రాంతాల్లో నీటి సరఫరాలో పాక్షికంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి.

Read More
Next Story