కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై ఈసీ యాక్షన్ షురూ..కేటీఆర్‌కు షాక్
x
ఓటేసిన తర్వాత కోడ్ ఉల్లంఘిస్తూే వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై ఈసీ యాక్షన్ షురూ..కేటీఆర్‌కు షాక్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో జరిగిన కోడ్ ఉల్లంఘనలపై సీఈసీ చర్యలు ప్రారంభించింది. కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ చర్యలకు ఉపక్రమించింది.


తెలంగాణలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. మే 13వతేదీన హైదరాబాద్ నగరంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటేసిన తర్వాత కేటీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేశారు.

- ‘‘నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశా...మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నందినగర్ పోలింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియో టీవీల్లో టెలీకాస్ట్ అయింది.
- ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ జి నిరంజన్ ఎన్నికల కమిషన్ కు మే 13వతేదీన ఫిర్యాదు చేశారు. దీనికి ఆధారంగా కేటీఆర్ వ్యాఖ్యల వీడియోను జత చేశారు.

కేటీఆర్ చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం
కోడ్ ఉల్లంఘిస్తూ మాట్లాడిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఎన్నికల కమిషన్ అదనపు సీఈఓ లోకేష్ కుమార్ డీఎస్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి అయిన జీహెచ్ఎంసీ కమిషనరుకు లేఖ రాశారు. ఈసీ నుంచి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి మెమోనంబరు 5290/ఎలక్షన్ ఏ/ఏ1/2024తో ఆదేశాలు పంపారు. పోలింగ్ రోజు కేటీఆర్ మాట్లాడుతూ.. తాను తెలంగాణ తెచ్చిన వ్యక్తికి ఓటేశానని చెప్పాడని, ఇది ఎన్నికల ఉల్లంఘన అని ఈసీ సీరియస్‌ అయింది. కోడ్ ఉల్లంఘించిన కేటీఆర్ కు 10 ఏళ్లపాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సూచించారు.

ప్రధాని మోదీ కోడ్ ఉల్లంఘనపై కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణాలోని నారాయణపేట, హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఎన్నికల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ జి నిరంజన్... భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చిన్న పిల్లలు పాల్గొన్నారని, అంటే కోడ్ ఉల్లంఘనే అని నిరంజన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కోడ్ ఉల్లంఘించిన మోదీపై చర్యలేవి?
ఎన్నికల కమిషన్ కోడ్ ఆదేశాలను ఉల్లంఘించడం ప్రధాని మోదీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ ఆరోపించారు. కోడ్ ఉల్లంఘన విషయంలో ఎన్నికల కమిషన్‌కు తాము ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని మరో ఫిర్యాదు పంపించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు మోదీపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఈసీ ఆదేశాలు, ఎన్నికల ప్రచారంలో మోదీతో పాల్గొన్న పిల్లల ఫొటోలను నిరంజన్ ఈసీకి పంపించారు.

వరంగల్ లో ఓటర్లను మోదీ ప్రభావితం చేశారు...
ప్రధాని మోదీ వరంగల్‌లో ఎన్నికల ప్రచారసభకు వెళుతుండగా లక్ష్మీపురం వద్ద తన కారును ఆపి, కారు వద్దకు ఓ తల్లిని పిలిచి ఆమె బిడ్డను ఎత్తుకున్నారని నిరంజన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం కోసం, ఓటర్లను ప్రభావితం చేయడానికి బిడ్డను తన చేతుల్లోకి తీసుకోవడం ద్వారా ప్రధాని మోదీ ఈసీ కోడ్ ఆదేశాలను ఉల్లంఘించారని నిరంజన్ ఈసీకి పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము మోదీ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించలేదని, దీంతో తెలంగాణలోని నారాయణపేటలో జరిగిన ఎన్నికల సభలో మోదీ మళ్లీ అదే ఉల్లంఘనను పునరావృతం చేశారని నిరంజన్ ఫిర్యాదు చేశారు.

నారాయణపేట ఎన్నికల ప్రచార సభలో...
నారాయణ పేట మీటింగ్‌లో పిల్లలు తమ ఉనికిని చూపుతూ, ఒక అబ్బాయి, అమ్మాయి చేతులు ఊపుతుండగా, ప్రధాని మోదీ ‘కిత్నే ప్యారే బచ్చే హై’’ అంటూ వ్యాఖ్యానించారని నిరంజన్ ఫిర్యాదులో తెలిపారు. ఒక బాలిక తనకు ఫొటో ఇవ్వాలనుకుంటుందని, ఆమెను తన వద్దకు తీసుకురావాలని సమీపంలోని వ్యక్తులను మోదీ కోరారు.బాలికకు లేఖ రాస్తానని మోదీ పేర్కొన్నారు. ఇలా ఎన్నికల ప్రచారంలో పిల్లలను వాడుకోవడం కోడ్ ఉల్లంఘన అని, మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలని నిరంజన్ సూచించారు.

మోదీ కోడ్ ఉల్లంఘన వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచారపర్వంలో ప్రధాని నరేంద్రమోదీ తరచూ కోడ్ ఉల్లంఘన వ్యాఖ్యలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. తనపై ఈ చిన్నారుల ప్రేమ ప్రతిపక్షాలకు నచ్చడం లేదని మోదీ పేర్కొన్నారు.హిందూమతం పట్ల కాంగ్రెస్‌కు ఎప్పుడూ ద్వేషం ఉందని, కాంగ్రెస్‌ పార్టీ హిందూత్వ వ్యతిరేక పార్టీ అని మోదీ మతాన్ని ప్రస్థావిస్తూ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించడం కోడ్ ఉల్లంఘన అని, దీనిపై మోదీపై చర్యలు తీసుకోవాలని నిరంజన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ కోడ్ ఆదేశాలను పాటించేలా చూడాల్సిన బాధ్యత ఈసీపై ఉందని, లేకుంటే ఈసీ తన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని నిరంజన్ సూచించారు.

ఆంక్షలతో కేబినెట్ భేటీకి ఈసీ షరతులతో అనుమతి
తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్‌ సమావేశానికి సీఈసీ షరతులు విధించింది. కేబినెట్‌లో అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని సీఈసీ సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని ఈసీ ఆదేశించింది.

ఆ రెండు అంశాలపై చర్చించ వద్దు : సీఈసీ
ఎన్నికల కోడ్ జూన్ 4వతేదీ వరకు అమలులో ఉన్నందున కేబినెట్ సమావేశంలో కామన్ క్యాపిటల్ హైదరాబాద్ గురించి, రైతుల రుణమాఫీ గురించి చర్చించవద్దని ఈసీ ఆదేశించింది. ఈ మేర కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవనీష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. ఈసీ కేబినెట్ భేటీకి అనుమతించిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతి కుమారి తెలిపారు.


Read More
Next Story