‘కోడ్’ దాటిన అధికారులపై ఈసీ సీరియస్ యాక్షన్
x
Election Commission

‘కోడ్’ దాటిన అధికారులపై ఈసీ సీరియస్ యాక్షన్

పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వంలో నియమావళిని ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులపై ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. ఈసీ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంది.


పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రచార పర్వంపై ప్రత్యేక నిఘా పెట్టింది. పోలీసులు, సర్వేలైన్స్ బృందాలతో ఈసీ నిఘా పెట్టి నియమావళి ఉల్లంఘించిన, కోడ్ గీత దాటిన ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

- మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి సిద్దిపేటలో ఇటీవల 106 మంది ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఈసీ ఆదేశంతో 106 మంది ఉద్యోగులను సిద్ధిపేట కలెక్టరు సస్పెండ్ చేశారు.
- ప్రభుత్వ ఉద్యోగులు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాం, ఎక్స్‌ల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇటీవల ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో వేల్పూర్ ట్రాన్స్ కో ఏఈ యశ్వంత్ రావు పోస్టు పెట్టడంపై సీరియస్ అయిన ఈసీ అతన్ని సస్పెండ్ చేసింది.
- హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసు డిప్యూటీ కమిషనర్ సాయి చైతన్యపై ఈసీ బదిలీ వేటు వేసింది. సాయి చైతన్యను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు డీసీపీ సాయి చైతన్యకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పనులు అప్పగించరాదని ఈసీ ఆదేశించింది.
- సైదాబాద్ ఏఎస్సై బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవి లతను విధుల్లో ఉండగా కౌగిలించుకుని సస్పెండ్ అయ్యారు. మాధవీలత ప్రచారం చేస్తున్నప్పుడు యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారి విధుల్లో ఉండి కరచాలనం చేశారు. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పోలీసు అధికారిని పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు.సైదాబాద్ వద్ద హైదరాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి మాధవి లతకు కరచాలనం చేసి కౌగిలించుకున్నందుకు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కె. శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేశారు.

రాజకీయ పార్టీలకు మద్ధతు ఇస్తే సస్పెన్షనే...
ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు మద్ధతు ప్రకటించరాదు, ప్రచారం చేయరాదని ప్రభుత్వ నిబంధనలను 1949 సెప్టెంబరు 17వతేదీన కేంద్ర ఎన్నికల సంఘం అమలులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ డేగకళ్లతో నిఘా వేసింది. అధికారులతోపాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా సెక్షన్ 23(ఐ) ప్రకారం ఎన్నికల నిబంధనల కిందకు వస్తారు. ఉద్యోగులు ఎన్నికల నిర్వహణ పనులను బాధ్యతగా చేయాలి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఒక అభ్యర్థికి సహకరిస్తారని ఆధారం ఉంటే వారిని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేస్తోంది.

ఎన్నికల విధులకు హాజరుకాకుంటే కేసులు
ఎన్నికల సమయంలో రిసార్ట్స్‌, ఫంక్షన్‌ హాళ్లలో ప్రభుత్వ ఉద్యోగులతో రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో విందు సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుంటారు. వీటిలో పాల్గొన్నా ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ వేటు వేస్తోంది. ఎన్నికల విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించిన 40 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులపై ఈసీ ఫిర్యాదు మేర కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. కోడ్ అమలులో ఉండగా 23 మంది ఎక్సైజ్ అధికారులను బదిలీ చేసిన ఎక్సైజ్ కమిషనరుపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ డెమోక్రటిక్ తెలంగాణ ఈసీకి ఫిర్యాదు చేసింది.

ఈసీ సస్పెండ్ చేస్తే అంతే సంగతులు...
తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా ఉద్యోగులు సస్పెన్షన్‌ వేటుకు గురైతే తిరిగి ఉద్యోగంలో చేరడం ఈసీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సస్పెన్షన్‌కు గురయ్యే ప్రభుత్వ ఉద్యోగులను ఆరు నెలలలోపు ఉద్యోగంలో తిరిగి చేర్చుకుంటారు. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో అభియోగాలతో ఈసీ ఆదేశాలతో సస్పెన్షన్‌ వేటుకు గురైతే ఉద్యోగంలో ఎప్పుడు చేరతారనేది ఎన్నికల సంఘం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

కేసీఆర్‌కు ఈసీ నోటీసు
అధికారులపైనే కాదు నియమావళి ఉల్లంఘించి ప్రచారంలో పరుషపదజాలం ఉపయోగించే రాజకీయ పార్టీల నాయకులపై కూడా ఈసీ చర్యలు తీసుకుంటోంది. సిరిసిల్లలో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ ప్రచార సభలో గులాబీ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ నేతలను పరుష పదజాలంతో తిట్టారు. ఏప్రిల్ 16వతేదీన జరిగిన సభలో కేసీఆర్ కాంగ్రస్ నేతలు కుక్కు కొడుకులు, లత్కోరులు అంటూ తిట్ల దండకం అందుకున్నారు. కేసీఆర్ వాడిన భాషపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించి, కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. పారదర్శక ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు సృష్టించే చర్యలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయని ఎన్నికల సంఘం మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ ఇటీవల వ్యాఖ్యానించారు.



Read More
Next Story