పోలిపల్లి నుంచి తెలుగుదేశం పొలికేక...యుద్ధానికి సై అన్న చంద్రబాబు
x
పోలిపల్లిలో జరిగిన యువగళం-నవశకం సభకు హాజరైన జనం

పోలిపల్లి నుంచి తెలుగుదేశం పొలికేక...యుద్ధానికి సై అన్న చంద్రబాబు

జగన్ పై అస్త్రశస్త్రాలు సిద్ధం చేశారు. ఇక వదలాల్సింది బాణాలే. యుద్ధావేశంతో, రెచ్చిపోయిన ప్రసంగాలతో జనశ్రేణుల్ని కేరింతలు కొట్టించారు.


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి తెర లేచింది. ‘యువగళం-నవశకం’ సభ ద్వారా టీడీపీ-జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన సభ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. వైసీపీ ఓటమే లక్ష్యంగా ఇరు పార్టీలు ఎన్నికల హామీలు ఇచ్చారు. పొత్తుపై ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు.





వైసీపీ విముక్త ఏపీ సాధ్యమా

‘‘ఒక్క ఛాన్స్‌ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లింది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారాలి. అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కలాట ఆడారు. రుషికొండను బోడిగుండుగా మార్చారు. సీఎం విల్లా కోసం రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తాం. అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహిస్తాం. అమరావతి లేదా తిరుపతి సభలో మేనిఫెస్టో ప్రకటిస్తాం.ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చేపట్టాం. 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటాం. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తాం. అన్నదాత కార్యక్రమం ద్వారా రైతులకు ఆర్థికసాయం. బీసీల కోసం రక్షణ చట్టం తీసుకువస్తాం. అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటాం. కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయం’’.. అంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం టీడీపీ క్యాడర్లో జోష్ నింపడానికి కావొచ్చు గాని అది సాధ్యమా అనే దానిపై ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి.





నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురానికి సమీపంలోని పోలిపల్లి వద్ద జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీగానే తరలి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభ ఉభయ పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన ఎన్నికల సభనే చెప్పవచ్చు.

పాదయాత్రలపైనా దండయాత్రలా...


చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘భారత దేశంలో పాదయాత్రలు చేయడం కొత్తకాదు. నేను కూడా పాదయాత్ర, బస్సు యాత్ర చేశా. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మొదటిసారి ఎన్టీఆర్‌ చైతన్య యాత్ర చేశారు. అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పాదయాత్రలు చూశా. కానీ, ఎప్పుడూ పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవు. మొదటి సారిగా సైకో జగన్‌ పాలనలోనే ఇలాంటి ఘటనలు చూశాం. ఒక పవిత్రమైన భావనతో పాదయాత్ర చేస్తున్నప్పుడు చేతనైతే సహకరించాలి.. లేదంటే ఇంట్లో కూర్చోవాలి” అని మండిపడ్డారు.

మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్నే...

చంద్రబాబు మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇదే స్థాయిలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో అయిదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు బలంగా నిర్మించాలని మాత్రమే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాను. అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనుకున్నాను. వ్యక్తి ప్రయోజనాలు, వర్గ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు అన్నీ దాటి వచ్చాను. 2024లో జగన్‌ను ఇంటికి పంపేస్తున్నాం. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జగన్ ను ఇంటికి పంపితేనే ఈ రాష్ట్రానికి విముక్తి ’ అన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఇంకో అడుగు ముందుకేసిన పవన్ కల్యాణ్ ఇంకా చాలా అంశాలను ప్రస్తావించారు. ‘తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు ఉమ్మడిగా కలిసిన ఈ క్షణాలు.. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును నిర్దేశించేవి.. ఏపీ భవిష్యత్తును బలంగా నిర్మించే క్షణాలివి’ అని అన్నారు. ‘జగన్‌ ఇప్పటికే 25 మంది ఎమ్మెల్యేలను మార్చుతున్నారని విన్నాను. ఆయన 80 మంది వరకు ఎమ్మెల్యేలను మార్చబోతున్నారని అంటున్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు- జగన్‌నే’ అని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఇలా పోటాపోటీగా ఉపన్యాసాలు సాగాయి. రాష్ట్రం ఎదుర్కొంటున్నట్టుగా భావిస్తున్న సవాలక్ష సమస్యల్ని ఈ రెండు పార్టీల నేతలు ఈ సభలో ఏకరవుపెట్టారు.

కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది..

“వైసీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది. మెడపై కత్తి బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు. ఒకప్పుడు విశాఖ ఆర్థిక రాజధాని.. ఇప్పుడు గంజాయి రాజధానిగా మారింది. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగింది.. కబ్జాలు పెరిగాయి. మంచి చేస్తే ఆ ఫలితాలు అందరికీ వస్తాయి. చెడు చేస్తే దాని వల్ల అందరికీ నష్టం వస్తుంది. అదే ఈరోజు జగన్‌రెడ్డి చేసే పని. ఒక్కఛాన్స్‌ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. విధ్వంస పాలనకు జగన్‌ నాంది పలికారు. జగన్ పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయి. రుషికొండను బోడిగుండు చేసి.. సీఎం నివాసం కోసం రూ.500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారు? అమరావతిని సర్వనాశనం చేసి మూడుముక్కలాట ఆడారు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తి చేసేవాళ్లం. అబద్ధాల పునాదులపై నిర్మించిన పార్టీ వైసీపీ” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఇదే సభలో రెండు పార్టీల నాయకులు దాదాపు ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల మాదిరే టీడీపీ ఐదు భరోసాలు ఇచ్చింది. వాటిల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహిస్తారు. టీడీపీ, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాయి. “ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించాం. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటా. అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేస్తాం. అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటాం. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తాం. భవిష్యత్‌లో ఏయే కార్యక్రమాలు చేయాలనేదానిపై అధ్యయనం చేస్తాం. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైకాపా ఓడిపోవడం ఖాయం. టీడీపీ-జనసేన పొత్తు ప్రకటించినప్పుడే జగన్ పని అయిపోయింది. టీడీపీ-జనసేన పొత్తు చారిత్రక అవసరం” అని చంద్రబాబు, పవన్ ముక్తకంఠంతో చెప్పారు.

జగన్ రాజకీయాలకు పనికి రాడా..

మహిళలకు రక్షణ ఉండాలంటే ఏపీలో వైసీపీ పోవాలి, టీడీపీ జనసేన రావాలన్నారు చంద్రబాబు. వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదన్నారు. “జగన్‌ రాజకీయాలకు అనర్హుడు. ఒక్క ఓటు ఆ పార్టీకి వేసినా..అది శాపంగా మారుతుంది. జగన్‌ చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. టీడీపీ, జనసేనకు ఓటు వేస్తారనుకుంటే వారి పేర్లు జాబితా నుంచి తొలగిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని సంఘటలు ఏపీలో జరగుతున్నాయి. ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మీరు ఒక త్యాగం చేస్తే.. మేం వంద త్యాగాలు చేసి రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తాం. అభివృద్ధి చేయడానికి ముందుకొస్తాం. ఉద్యోగులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

సభ సక్సెత్ క్యాడర్లో జోష్...


సుదీర్ఘకాలం తర్వాత టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద సభే జరిగింది. మీటింగ్ కి జనం భారీగా తరలిరావడంతో నాయకులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో తన మీటింగ్ కి ఇంతమంది రావడం చూడలేదని చంద్రబాబు సంతోషపడగా బాలకృష్ణ, నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్లు ఇక జగన్ పై యుద్ధమేనని పరోక్షంగా హర్షం వ్యక్తం చేశారు. ఏమైనా, ఈ సభ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందనడంలో సందేహం లేదు.

Read More
Next Story