మలేషియాలో మగ్గుతున్న తెలుగు కార్మికులకు విముక్తి లభించేనా?
x
Migrant Workers

మలేషియాలో మగ్గుతున్న తెలుగు కార్మికులకు విముక్తి లభించేనా?

మలేషియా దేశంలో వేలాదిమంది తెలుగు అక్రమ వలస కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారు.వెట్టి చాకిరీ చేస్తున్న వలస కార్మికులకు క్షమాభిక్షతోనైనా విముక్తి లభిస్తుందా?


ఉపాధి ఆశతో అప్పులు చేసి, ఏజెంట్లకు లక్షలాది రూపాయలు చెల్లించి విజిట్ వీసాలపై మలేషియా దేశానికి వచ్చిన వేలాదిమంది తెలుగు వలస కార్మికులు అక్రమంగా నివాసముంటూ దుర్భర జీవితం గడుపుతున్నారు. ఏజెంట్ల మోసాల వల్ల మలేషియా మారుమూల ప్రాంతాల్లోని పరిశ్రమలు,రెస్టారెంట్లు, రబ్బరు, ఆయిల్ ఫాం తోటల్లో, భవననిర్మాణ కార్మికులుగా వెట్టిచాకిరీ చేస్తూ అక్కడ ఉండలేక, తిరిగి స్వదేశానికి రాలేక ఏళ్ల తరబడిగా నానా అవస్థలు పడుతున్న తెలుగు కార్మికులకు మలేషియా ప్రభుత్వం తాజాగా శుభవార్త వెల్లడించింది. మలేషియాలో వివిధ దేశాలకు చెందిన 4 నుంచి 5 లక్షలమంది అక్రమంగా నివాసముంటున్నారని మలేషియా ప్రభుత్వమే ప్రకటించింది. అక్రమంగా నివాసముంటున్న వారిని వారి వారి దేశాలకు పంపించేందుకు వీలుగా క్షమాభిక్ష కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇందులో మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 60వేలమందికి పైగా ఉంటారని అనధికార అంచనా.


వెట్టిచాకిరీ చేస్తున్న తెలుగు కార్మికులు
ఏజెంట్ల మోసాల బారిన పడిన కార్మికులు వర్క్ పర్మిట్ లేక తక్కువ జీతాలకు రెస్టారెంట్లు, పరిశ్రమలు, రబ్బరు తోటలు, పామాయిల్ తోటల్లో పనిచేస్తున్నారు. కార్మికుల పాస్‌పోర్టులను యజమానులు లాక్కొని కార్మికులకు తక్కువ జీతాలు ఇవ్వడంతోపాటు వారికి సరిగా భోజనం పెట్టడం లేదు. కొందరు తెలుగు కార్మికులు మారుమూల తోటల్లో రబ్బరు కార్మికులుగా, భవన నిర్మాణ కార్మికులుగా వెట్టిచాకిరీ చేస్తూ నానా పాట్లు పడుతున్నారు. గతంలో 2019వ సంవత్సరంలో మలేషియా ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించినా ఎక్కువ మంది స్వదేశాలకు రాలేదు. కరోనా తర్వాత మరికొందరు అక్రమంగా మలేషియాలోకి వచ్చారు. దీంతో అక్రమ వలసకార్మికులను వదిలించుకునేందుకు మలేషియా సర్కారు ఈ క్షమాభిక్ష ప్రకటించిందని మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు.

క్షమాభిక్ష ప్రకటించినా...
మలేషియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అక్రమ వలసదారులు 60వేలమందికి పైగా ఉంటారని అనధికార అంచనా. ప్రస్థుతం మలేషియా సర్కారు విడుదల చేసిన క్షమాభిక్ష ప్రకటన మారుమూల ప్రాంతాల్లో రబ్బరు, పామాయిల్ తోటల్లో పనిచేస్తున్న కార్మికులకు చేరదు. ఈ వార్త వారికి తెలియక, వారి వద్ద జరిమానా చెల్లించడానికి డబ్బు లేక వారికి విముక్తి లభించే అవకాశం లేదు. వారి పాస్ పోర్టు వారి యజమానుల వద్ద ఉండటం వల్ల యజమానులు వెట్టిచాకిరీ చేయించుకుంటూ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా, భోజనం సరిగా పెట్టకుండా అవస్థలకు గురిచేస్తున్నారు. మారుమూల ప్రాంతాల తోటల్లో ఉన్న తెలుగు కార్మికులను గుర్తించడం కష్టమని వారికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని వారి జరిమానాలు చెల్లించి విమాన టికెట్ చార్జీలు ఇచ్చి మలేషియాలో చిక్కుకుపోయిన తెలుగు కార్మికులను స్వదేశానికి రప్పించాలని మలేషియాలో తెలుగు సంఘాల ప్రతినిధులు బూరెడ్డి మోహన్ రెడ్డి, కంచర్ల ఆనంద్ కోరారు.

జరిమానా చెల్లించి స్వదేశాలకు వెళ్లవచ్చు...
మలేషియాలో వర్క్ పర్మిట్ లేకుండా అక్రమంగా నివాసముంటున్న వారిని తిరిగి వారి స్వదేశాలకు పంపించేందుకు వీలుగా వారికి క్షమాభిక్ష కల్పిస్తూ మలేషియా ప్రభుత్వం మార్చి 1వతేదీన ప్రకటన జారీ చేసింది. ఈ పథకం కింద మలేషియాలో అక్రమ నివాసులు ఈ ఏడాది డిసెంబరు 31వతేదీలోపు నామమాత్రపు జరిమానా చెల్లించి విమాన టికెట్ తీసుకొని వారి వారి దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వర్క్ పర్మిట్ లేకుండా మలేషియా దేశంలోకి ప్రవేశించడం,మలేషియాలో ఓవర్‌టైమ్ చేయడం, పాస్‌పోర్ట్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి నేరాలకి పాల్పడిన వలసదారులకు క్షమాభిక్ష అవకాశం కల్పించి, వారిని వారి స్వదేశానికి పంపిస్తారు.

ఎవరినీ సంప్రదించాలి?
చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రంతోపాటు స్వదేశానికి విమాన టికెట్ ఉండాలి. క్షమాభిక్ష కోసం అక్రమ నివాసులు మలేషియా ఇమ్మిగ్రేషన్ కార్యాలయం లేదా కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకొని జరిమానా చెల్లించి, స్వదేశానికి వచ్చేందుకు అనుమతి తీసుకోవచ్చు. వలసదారుల స్వదేశానికి వెళ్లే కార్యక్రమ వ్యవహారాల కోసం మధ్యవర్తులు లేదా ఏజెంట్లను సంప్రదించవద్దని తెలుగు మలేషియన్ సంఘాల ప్రతినిధులు కోరారు. మలేషియా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ 12 కార్యాలయాలు,కౌలాలంపూర్ విమానాశ్రయంలోనూ దీనికోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. జరిమానాలు చెల్లించి 14 రోజులలోపు రిటర్న్ టిక్కెట్‌తో చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రం సమర్పించాలి.

అక్రమ నివాసులు సద్వినియోగం చేసుకోవాలి
మలేషియాలో ఎలాంటి పత్రాలు లేని విదేశీయులను ప్రాసిక్యూట్ చేయకుండా వారి స్వదేశాలకు తిరిగి పంపించేందుకు మైగ్రెంట్ రీపాట్రియేషన్ ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుందని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ దాతుక్ రస్లిన్ జుసోహ్ ప్రకటించారు. మైగ్రెంట్ రీపాట్రియేషన్ ప్రోగ్రామ్ ని అక్రమంగా నివాసముంటున్న వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

జైళ్లలో ఉన్నవారికి క్షమాభిక్ష వర్తించదు...
మలేషియాలో ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ 4,026 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుంది. ఇమ్మిగ్రేషన్, మాదకద్రవ్యాల నేరాలకు సంబంధించి 111 మంది వలసదారులను జైళ్లలో నిర్బంధించారు. అయితే జైళ్లలో ఉన్న వారికి ఈ క్షమాభిక్ష పథకం వర్తించదని మలేషియా సర్కారు ప్రకటించింది. అక్రమంగా నివాసముంటున్న వారిని మలేషియా పోలీసులు అరెస్ట్ చేస్తే వారికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు.

జరిమానా ఎంత చెల్లించాలంటే...
మలేషియా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ మైగ్రెంట్ రీపాట్రియేషన్ ప్రోగ్రామ్ అందిస్తోంది. చెల్లుబాటు అయ్యే అనుమతులు లేకుండా నివసించే వ్యక్తులకు సహాయపడే ప్రోగ్రామ్. చెల్లుబాటు అయ్యే పాస్ పోర్టు ఉండి లేదా అనుమతి లేకుండా జీవించడం (ఇమ్మిగ్రేషన్ చట్టంలోని సెక్షన్ 6(3) ప్రకారం 500 రింగెట్స్ అంటే మన దేశ కరెన్సీలో 9 వేలరూపాయల జరిమానా చెల్లించాలి. అయితే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి జరిమానా నుంచి మినహాయించారు. వారు కేవలం 100 రింగెట్స్ చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు ఇలా...
మలేషియాలో క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేయడానికి చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఐడీ నంబర్ ఉండాలి. పాస్‌పోర్టు లేకుంటే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తాత్కాలికంగా వైట్ పాస్ పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ పొందవచ్చునని తెలుగు ఎక్స్ పాట్స్ అసోసియేషన్ డిప్యూటీ ప్రెసిడెంట్, ఏపీ నాన్ రెసిడెంట్స్ తెలుగు సొసైటీ డివిజనల్ కోఆర్డినేటర్ కంచర్ల ఆనంద్ ‘తెలంగాణ ఫెడరల్’కు చెప్పారు.స్వదేశానికి వెళ్లేందుకు వన్ వే టికెట్ సహా అవసరమైన పత్రాలను పొంది, ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన తర్వాత, వలసదారులు 14 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని మలేషియన్ సర్కారు సూచించిందని ఆనంద్ పేర్కొన్నారు. జరిమానా చెల్లించాక ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ వారికి చెక్‌అవుట్ మెమోను జారీ చేస్తుందని, దీంతో వారు దేశం విడిచి వెళ్లడానికి వీలు కల్పిస్తుందని ఆయన వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసహాయం అందించాలి
మలేషియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కార్మికులను తిరిగి స్వదేశానికి పంపించేందుకు గతంలో మాదిరిగా వారికి జరిమానాలు, విమానచార్జీలు ఇవ్వాలని తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విన్నవించామని తెలుగు ఎక్స్ పాట్స్ అసోసియేషన్ డిప్యూటీ ప్రెసిడెంట్, ఏపీ నాన్ రెసిడెంట్స్ తెలుగు సొసైటీ డివిజనల్ కోఆర్డినేటర్ కంచర్ల ఆనంద్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే మలేషియాలో చిక్కుకున్న వలసకార్మికులు క్షేమంగా స్వదేశానికి పంపించవచ్చని ఆనంద్ వివరించారు.Read More
Next Story