విచ్చలవిడిగా ఎన్నికల వ్యయం...చేసిన ఖర్చుకు ఏజీ ఆడిట్ ఏది?
x
Election Expenditure

విచ్చలవిడిగా ఎన్నికల వ్యయం...చేసిన ఖర్చుకు ఏజీ ఆడిట్ ఏది?

తెలంగాణలో 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వ్యయంలో గోల్ మాల్ జరిగింది. నిర్వహణ వ్యయానికి ఏజీ ఆడిట్ లేకపోవడంతో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు.


ఎన్నికల ప్రచార వ్యయమే కాదు నిర్వహణ వ్యయం కూడా ఏ యేటి కాఏడు పెరుగుతూనే ఉంది. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికారులు విచ్చలవిడిగా వ్యయం చేశారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ. 701.11కోట్లు విడుదల చేసినట్లు తెలంగాణ ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి ఆర్టీఐ యాక్ట్ కింద అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.

- ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.5.9 కోట్లను ఎన్నికల నిర్వహణకు ఖర్చు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఖర్చుల వివరాలను హైదరాబాద్ నగరానికి చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే ఆ వివరాలు మాత్రం ఇవ్వకుండా అధికారులు గుంభనంగా ఉండిపోయారు.

ఎన్నికల నిర్వహణ వ్యయంలో అక్రమాలు?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వ్యయంలో అధికారులు పలు అక్రమాలకు పాల్పడినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కు పలు ఫిర్యాదులు వచ్చాయి. పోలింగ్ కోసం జిల్లా రిటర్నింగ్ అధికారులు వేలిపై పెట్టే నీలిరంగు సిరా నుంచి పెన్నులు, వేలిముద్రలు వేసే ఇంకు ప్యాడ్లు, దారాలు, ఈవీఎంలకు సీలు వేసేందుకు లక్క, క్లాత్, పోలింగ్ కేంద్రంలో అడ్డుగా పెట్టే అట్టలు, మైనపు వత్తులు, పోలింగ్ వివరాలు రాసేందుకు పుస్తకాలు, ఈవీఎంలు, వీవీప్యాట్లు ఇలా ఒకటేమిటి సర్వం పోలింగ్ సామాగ్రిని కొనుగోలు చేశారు.

అడ్డగోలు వ్యయంపై ఫిర్యాదులు
ఎన్నికల్లో ఓటర్ల జాబితాల ముద్రణ నుంచి పోలింగ్ సిబ్బంది శిక్షణ, ఈవీఎంల భద్రత, రక్షణ, తరలింపు, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించారు. జిల్లాల వారీగా జరిగిన ఈ పోలింగ్ సామాగ్రి కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి. పోలింగ్ కేంద్రాల్లో అద్దె టెంట్లు, కుర్చీలు, వాహనాల అద్దెతో పాటు పోలింగ్ సిబ్బందికి భోజనాలు, టిఫిన్లు, టీల కోసం అడ్డగోలుగా అధిక నిధులు వెచ్చించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

అధికారులివ్వని వ్యయ సమాచారం
ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఖర్చు వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద అన్ని జిల్లాల రిటర్నింగ్ అధికారులైన కలెక్టర్లను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అడిగింది. కలెక్టర్లను సమాచారం అడిగితే వారు దాన్ని పంపించకుండా ఆర్టీఐ దరఖాస్తులను ఆర్డీఓలకు పంపించారు. ఆర్డీఓలు ఎమ్మార్వోలకు పంపించి సమాచారం పంపించాలని కోరారు. ఇలా కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వో ఒకరిపై ఒకరు వేసుకొని అసలు ఎన్నికల నిర్వహణ ఖర్చు వివరాలు మాత్రం ఇవ్వకుండా గుట్టుగా దాచారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగిన ఎన్నికల నిర్వహణ ఖర్చుల వివరాలు ఇవ్వక పోవడం అంటే అందులో ఎన్ని అక్రమాలు జరిగాయో విదితమవుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

అనూహ్యంగా పెరిగిన ఎన్నికల నిర్వహణ వ్యయం
తెలంగాణలో ఎన్నికల నిర్వహణ వ్యయం పెరుగుతూనే ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.1.5కోట్లను ఎన్నికల నిర్వహణకు కేటాయించారు. 2023 నవంబరు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటుకు రూ.2కోట్లు కేటాయించారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటుకు ఎన్నికల నిర్వహణకు రూ.2కోట్లు కేటాయించినా అసలు వ్యయం మాత్రం రెండింతల కంటే ఎక్కువగా అంటే రూ.5.9కోట్ల ఖర్చు అయింది. దీన్ని బట్టి చూస్తే అంచనా వ్యయ ప్రతిపాదనల కంటే ఎన్నికల నిర్వహణ వ్యయం అనూహ్యంగా పెరిగింది. దీంతో ఎన్నికల నిర్వహణ వ్యయంలో పలు అక్రమాలు జరిగాయని విదితమవుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి చెప్పారు.

ఎన్నికల నిర్వహణ వ్యయానికి ఏజీ ఆడిట్ ఏది?
2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని ఆడిట్ చేయడం లేదు. దీన్ని ఆసరాగా తీసుకొని ఎన్నికల అధికారులు విచ్చలవిడిగా మార్కెట్ రేట్ల కంటే అధిక రేట్లకు పోలింగ్ సామాగ్రిని కొనుగోలు చేశారని సమాచారం. అధిక బిల్లులు పెట్టి సర్కారు ధనాన్ని కొందరు అధికారులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయని దీనిపై ఏజీతో ఆడిట్ చేయించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వ్యయ నివేదికలను వెబ్ సైట్ లో ఉంచినట్లు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు చేసిన వ్యయాన్ని కూడా ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో ఉంచాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కోరింది.

అభ్యర్థులలు చేసిన ప్రచార వ్యయం...వ్యయ నివేదికల్లో మాయం
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి చేసే వ్యయంపై రూ.40లక్షల వ్యయ నియంత్రణ ఉంది. అభ్యర్థులు కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా ఎన్నికల ప్రచారంతోపాటు ఓటర్లకు తాయిలాలు అందించేందుకు వెచ్చించినా వ్యయ నివేదికల్లో మాత్రం రూ.40 లక్షల లోపే ఖర్చు చూపించారు. ఒక్కో అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి కోట్లాది రూపాయలు వెచ్చించారు. కానీ ఆ వ్యయాన్ని వ్యయనివేదికల్లో మాత్రం చూపించలేదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు అభ్యర్థి టీ, టిఫిన్, బిర్యానీలు సప్లయి చేస్తే ఆ ఖర్చుకూడా వ్యయనివేదికల్లో చూపించాలి. చాలామంది అభ్యర్థులు చేసిన ఖర్చు వ్యయనివేదికల్లో మాత్రం చూపించలేదు.

వ్యయ నియంత్రణ అధికారుల నిఘా ఏది?
అభ్యర్థులు చేసే వ్యయంపై నియంత్రణకు వ్యయ పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించినా వారు కూడా ఆశించిన మేర నిఘా పెట్టలేదు. ప్రజాప్రాతినిథ్య చట్టం సెక్షన్ 78 ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నెలలోపు చేసిన వ్యయాన్ని నివేదికల రూపంలో జిల్లా ఎన్నికల అధికారులకు అంద జేశారు. వాటిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఈసీ వెబ్ సైట్ లో ఉంచింది. ఎక్కువ మంది అభ్యర్థులు తాము రూ.20 నుంచి 35 లక్షల వ్యయం చేసినట్లు వారు నివేదికల్లో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఆ పార్టీ ఒక్కొక్కరికి అధికారికంగా రూ.40లక్షలను ప్రచారానికి చెక్కుల రూపంలో అందించింది. కానీ వారు చేసిన వ్యయం మాత్రం తక్కువగానే ఉంది.


Read More
Next Story