ఐదుగురు కాలేజీ విద్యార్థులే తెలంగాణ యువ ఇన్నోవేటర్లు
x
న్యూయార్క్ గ్లోబల్ సదస్సులో పాల్గొననున్న తెలంగాణ నూతన ఆవిష్కర్తలు

ఐదుగురు కాలేజీ విద్యార్థులే తెలంగాణ యువ ఇన్నోవేటర్లు

తెలంగాణలోని ఐదుగురు విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలతో యువ ఇన్నోవేటర్లుగా నిలిచారు.వీరు న్యూయార్క్‌లో జరగనున్న యాక్టివేట్ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొననున్నారు.


న్యూయార్క్ నగరంలో డిసెంబరు నెలలో జరగనున్న 8వ వార్షిక వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ (1ఎం1బి) యాక్టివేట్ ఇంపాక్ట్ గ్లోబల్ సదస్సులో పాల్గొనడానికి ఐదుగురు తెలంగాణ ఆవిష్కర్తలు ఎంపికయ్యారు.

- తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కాలేజీలకు చెందిన మీత్ కుమార్ షా (విజ్ఞాన భారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్), మనల్ మునీర్ (దీక్ష డిగ్రీ కళాశాల, నిర్మల్), నారాయణం భవ్య, పెమ్మసాని లిఖిత చౌదరి సత్యవతి కోలపల్లి (మల్లా రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్,హైదరాబాద్)లు యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఎంపికయ్యారని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం తెలిపింది.

ఐదుగురు యువ ఆవిష్కర్తల ఎంపిక
ఈ ఏడాది డిసెంబర్‌లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రతిష్ఠాత్మక 8వ వార్షిక 1ఎం1బీ యాక్టివేట్ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ 1ఎం1బీ హ్యాష్‌ట్యాగ్,గ్రీన్‌స్కిల్స్ అకాడమీల నుంచి ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఎంపికయ్యారని వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ వ్యవస్థాపకుడు, చీఫ్ మెంటార్ మానవ్ సుబోధ్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో జరిగిన గ్రీన్ స్కిల్స్ అకాడమీ -లెవరేజింగ్ ఏఐ గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఈ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఐదు నెలల కఠోరమైన శిక్షణ తర్వాత ఎంపిక చేశారు.

200 మంది విద్యార్థుల మధ్య పోటీ
మేడ్చల్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన 200 మంది ఫైనలిస్టులతో జరిగిన పోటీలో ఎంపికైన ఈ ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొననున్నారు. స్థిరమైన నగరాలు, గ్రామాలను నిర్మించడం, ఓపెన్ మ్యాన్‌హోల్స్,యువత నిరుద్యోగం,స్థిరమైన వ్యవసాయ పద్ధతులు,నీటి సమస్యలు,నాణ్యమైన విద్య,భారతదేశం యొక్క గొప్ప సంస్కృతిని రక్షించడానికి యువ ఆవిష్కర్తలు వినూత్న పరిష్కారాలను కనుగొన్నారు.

కళాశాల యువతకు శిక్షణ
ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగం, వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ సహకారంతో 2030వ సంవత్సరం నాటికి తెలంగాణాలోని ఒక మిలియన్ యువతకు శిక్షణ ఇవ్వడానికి భారతదేశపు మొట్టమొదటి వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ గ్రీన్ స్కిల్స్ అకాడమీని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద 18-22 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతకు సుస్థిరత, ఏఐలో సైద్ధాంతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వనున్నారు.

కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ
మీత్ కుమార్ షా తన ప్రాజెక్ట్ 'అప్నాఇంటర్వ్యూ క్రాకర్',మనల్ మునీర్ 'ఇంటెల్నెక్సా', నారాయణం భవ్య 'మానిఫెస్టింగ్ మ్యాన్‌హోల్స్',పెమ్మసాని లిఖిత చౌదరి 'టెక్ వాసాలి',సత్యవతి కోలపల్లి 'నారు పోషణ' అంశాలపై కొత్త ఆవిష్కరణలను న్యూయార్క్ సదస్సులో ప్రదర్శించనున్నారని తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ప్రస్తుతం తాము టాప్ 5 విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేశామని, రాబోయే కొద్ది నెలల్లో మరో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు.వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ గ్రీన్ స్కిల్స్ అకాడమీ తెలంగాణ యువత నైపుణ్యం సాధించి, భారతదేశపు గ్రీన్ వర్క్‌ఫోర్స్‌లో చేరడానికి మంచి అవకాశం అని ఆయన వివరించారు.

గ్రీన్ స్కిల్స్ అకాడమీ
తెలంగాణ ఐటీ విభాగం వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ సహకారంతో గ్రీన్ స్కిల్స్ అకాడమీని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చెప్పారు.వినూత్న శిక్షణ కార్యక్రమాల ద్వారా సుస్థిర అభివృద్ధిని పెంపొందించడానికి తాము కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అకాడమీ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా యువతను సాంకేతిక రంగంలో సమాయత్తం చేయడంలో విజయం సాధించామని మంత్రి వివరించారు. దీంతో పాటు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ యూనివర్శిటీని నెలకొల్పనున్నట్లు మంత్రి వెల్లడించారు.


Read More
Next Story