ఒకనాటి కాంగ్రెస్ ‘గెలుపు గుర్రం’  డి శ్రీనివాస్  కన్నుమూత
x
సీనియర్ కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్(ఫైల్ ఫొటో)

ఒకనాటి కాంగ్రెస్ ‘గెలుపు గుర్రం’ డి శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ లో పార్టీలో ఉన్నపుడు ఆయనకు గెలుపు గుర్రం అని పేరుంది. వైఎస్ ఆర్ తో పిసిసి అధ్యక్షుడిగా ఆయన కాంబినేషన్ బాగా చేయడంతో ఆయనకు ఈ పేరు వచ్చింది.


తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ,మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీ శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు.

- డీఎస్ గా పేరొందిన డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా,ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.

అంచెలంచెలుగా ఎదిగి...
డి శ్రీనివాస్ చదువు పూర్తయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ 1948 సెప్టెంబరు 27వతేదీన జన్మించారు.హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో డిగ్రీ చదివిన తర్వాత 1989వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డీఎస్ 2009లో సీఎం రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర ఉన్నతవిద్య,ఇంటరు విద్యా శాఖల మంత్రిగా పనిచేశారు.1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అప్పటి టీఆర్‌ఎస్‌తో పోత్తుకుదుర్చుకోవడంలో డీఎస్ కీలకపాత్ర వహించారు.

పీసీసీ అధ్యక్షుడిగా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ పనిచేశారు. 2016 జూన్ 22 నుంచి 2022 జులై 4వతేదీ వరకు ఈయన బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 2014 జూన్ 3 నుంచి 2015 జులై 2వతేదీ వరకు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.. బీఆర్ఎస్ పార్టీలో చేరాక డీఎస్ రాష్ట్ర ప్రభుత్వ అంతర్‌ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు.తెలంగాణ ఆవిర్భావం తర్వాత మండలి విపక్ష నేతగా కూడా పనిచేశారు.2004,2009 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో రాజశేఖర్ రెడ్డితో కలిసి డీఎస్ కీలక పాత్ర పోషించారు. డీఎస్ 2009, 2010 ఉప ఎన్నిక, 2012, 2014లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

బీఆర్ఎస్ చేరిన డీఎస్
కాంగ్రెస్ పార్టీలో ఉండగా తెలంగాణ కోసం ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 2015వ సంవత్సరం జులై 2వతేదీన డీఎస్ 2015వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా డీఎష్ ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన డీఎస్ కు కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. తెలంగాణలో మళ్లీ 2023 మార్చి 26వతేదీన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

చివరి దశలో సొంత గూటికి వచ్చిన డీఎస్
కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ 2023 మార్చి 26వతేదీనతిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ తో కలిసి వీల్‌చైర్‌లో గాంధీభవన్‌ కు వచ్చిన డీఎస్ కాంగ్రెస్ తీర్థం స్వీకరించారు. కాంగ్రెస్‌ లో తిరిగి చేరడం ఎంతో ఆనందంగా ఉందని, సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని డీఎస్ గతంలో వ్యాఖ్యానించారు. తన పెద్దకొడుకు ధర్మపురి సంజయ్‌ తో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.


ఎంపీ అర్వింద్‌ ట్వీట్

తండ్రి మృతిపై నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అర్వింద్ ట్వీట్‌ చేశారు. ‘‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. ఐ విల్‌ మిస్‌ యూ డాడీ!.. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. ఎప్పటికీ నా లోనే ఉంటావు’ అంటూ ఎక్స్‌లో ఎంపీ అర్వింద్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం డీఎస్ మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లోనే ఉంచారు.శనివారం సాయంత్రం నిజామాబాద్ ప్రగతినగర్‌లోని ఆయన నివాసానికి పార్థీవదేహాన్ని తరలించనున్నారు.


Read More
Next Story