తెలంగాణ ప్రముఖులకు ఇంగ్లండ్ అవార్డులు..ఎందుకు వచ్చాయంటే...
x
UK awards

తెలంగాణ ప్రముఖులకు ఇంగ్లండ్ అవార్డులు..ఎందుకు వచ్చాయంటే...

యూకేలో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన తెలంగాణ ప్రముఖులకు బ్రిటీష్ పార్లమెంట్ అవార్డులను ప్రదానం చేసింది. వారి విజయ ప్రస్థానంపై స్టోరీ


యునైటెడ్ కింగ్‌డమ్‌ యూనివర్శిటీల్లో చదువుకొని భారతదేశంలో వివిధ రంగాల్లో ఉన్నత స్థానానికి చేరుకున్న 75 మంది ప్రముఖులకు బ్రిటీష్ ప్రభుత్వం నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్,అలూమ్ని యూనియన్ అవార్డులను ప్రదానం చేసింది. బ్రిటీష్ కౌన్సిల్ సహకారంతో యూకే యూనివర్శిటీల్లో చదువుకొని భారతదేశంలో స్థిరపడి వారి వారి రంగాల్లో విజయం సాధించిన వారికి ఈ అవార్డులు దక్కాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లండన్‌లోని యూకే పార్లమెంట్‌లో ఫిబ్రవరి 28వతేదీన జరిగిన కార్యక్రమంలో 75 మంది భారతీయులకు ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు లభించాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బ్రిటీష్ పార్లమెంటు అవార్డు గ్రహీతల్లో మన తెలంగాణకు చెందిన నలుగురు ప్రముఖులు ఉండటం విశేషం. కేన్సర్ డాక్టర్ అయిన పి. రఘురామ్,సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్, తెలంగాణ హైకోర్టు న్యాయవాది అఖిల్ ఎన్నంశెట్టి, ద మద్రాస్ కొరియర్ ఎడిటర్ శ్రేనిక్ రావులకు ఈ అవార్డులను యూకే పార్లమెంట్ ప్రదానం చేసింది.


డాక్టర్ రఘురామ్ విజయ ప్రస్థానం
యూకేలో చదువుకోవడం వల్లనే తన జీవితాన్ని మలుపు తిప్పిందని కేన్సర్ డాక్టర్ అయిన పి. రఘురామ్ చెబుతుంటారు. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఎంబీబీఎస్ చదివిన రఘురామ్ మంగళూరు కస్తూర్బా మెడికల్ కళాశాలలో ఎంఎస్ చదివారు. 2010వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో ఎఫ్ఆర్‌ సీఎస్ చేశారు. 2022వ సంవత్సరంలో ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లండ్ గౌరవ ఫెలోషిప్ ను డాక్టర్ రఘురామ్ కు అందించింది. రొమ్ము కేన్సర్ పై మహిళల్లో అవగాహన కల్పించడానికి ఉషా లక్ష్మీ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ ను ఏర్పాటు చేశారు.ప్రపంచంలోని మొట్టమొదటి బ్రెస్ట్ హెల్త్ మొబైల్ ఫోన్ యాప్‌ను 11 భాషల్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని తన దాతృత్వం ద్వారా వైద్య సౌకర్యాలు కల్పించారు.ప్రతిష్టాత్మక పద్మశ్రీ, బీసీ రాయ్ అవార్డులను పొందిన డాక్టర్ రఘురామ్ కు ఫిబ్రవరి 28వతేదీన యూకే అవార్డు లభించింది.

ఈ అవార్డు స్ఫూర్తితో నా మాతృభూమికి సేవలందిస్తాను : డాక్టర్ పి రఘురామ్
నాకు యూకే అవార్డు లభించడం నాకెంతో సంతోషాన్నిచ్చిందని కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ పి రఘురామ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘ఈ అవార్డు స్ఫూర్తితో నా సామర్థ్యాల మేరకు మరింత ఉత్సాహంతో నా మాతృభూమికి వైద్య సేవలు అందిస్తాను’’ అని డాక్టర్ రఘురామ్ పేర్కొన్నారు. అత్యున్నత గౌరవ పురస్కారాన్ని తనకు ఇచ్చినందుకు కృతజ్ఞుడనని డాక్టర్ చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తాను భారత్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ కేర్‌ను మార్చే దిశగా అత్యుత్తమ బ్రిటిష్ పద్ధతులను పునరావృతం చేయడానికి ప్రయత్నించానని డాక్టర్ రఘురామ్ వివరించారు. యూకే, భారతదేశం మధ్య రోల్ మోడల్ లివింగ్ బ్రిడ్జ్ గా తాను నిలిచినందుకు చాలా గర్వపడుతున్నానని చెప్పారు. తన రోగులకు, తనకు అండగా నిలిచిన తన కుటుంబానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నానని డాక్టర్ రఘురామ్ చెప్పారు.

ఐఎఎస్ ఆల్ ఇండియా టాపర్ జయేశ్ రంజన్
1992 బ్యాచ్‌కు చెందిన జయేశ్ రంజన్ ఐఏఎస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సమాచార,సాంకేతిక శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి పబ్లిక్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. యూకే బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, టోక్యోలోని జేఐసిఏ శిక్షణా సంస్థ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, స్టాక్‌హోమ్ స్వీడిష్ ఇన్‌స్టిట్యూట్‌ లలో కోర్సులు చేసి పరిపాలనలో సమర్ధుడైన అధికారిగా పేరొందారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జయేశ్‌ రంజన్‌ ఎన్నికయ్యారు. ఈయన టి-హబ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతోపాటు వివిధ స్టార్టప్ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారు.

బ్రిటీష్ విద్యావిధానం నన్నెంతో ఆకట్టుకుంది : సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్
​యూకే అవార్డు అందుకోవడం నాకెంతో సంతోషాన్నిచ్చిందని తెలంగాణకు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాను 1997వ సంవత్సరంలో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌లో, 2005లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నానని జయేష్ రంజన్ పేర్కొన్నారు. బ్రిటీష్ విద్యా విధానం మన భారతదేశంలో ఉన్నదానికి చాలా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులు నేరుగా సమాధానాలు చెప్పరని, వారు విద్యార్థులను స్వయంగా ఆలోచించి సమాధానాలు వచ్చేలా ప్రోత్సహిస్తారని ఆయన చెప్పారు. ఈ విధానం విద్యార్థుల్లో అసలు ఆలోచనను,సృజనాత్మకతను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. యూకే ప్రొఫెసర్లు కూడా వినయంతో ఉంటారని, తమకు అన్నీ తెలుసని ఎప్పుడూ వారు చూపించరని ఆయన తెలిపారు. చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని యూకే విద్యావిధానాన్ని ఆయన మెచ్చుకున్నారు. తాను యూకేలో చదువుకున్న రోజులను మరవలేనని చెప్పారు. యూకే విద్యావిధానం నన్నెంతో ఆకట్టుకుందని, తన జీవితాన్ని యూకేలో చదువుకోవడం వల్ల మలుపు తిరిగిందని ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్ చెప్పారు.

మానహక్కుల చట్టంపై ఎల్ఎల్ఎం పట్టా
తెలంగాణకు చెందిన అఖిల్ ఎన్నంశెట్టి యూకేలోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి మానవ హక్కుల చట్టంలో ఎల్ఎల్ఎం పట్టా పొందారు. తెలంగాణ హైకోర్టు, ఢిల్లీలోని సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న అఖిల్ క్రిమినల్ డిఫెన్స్ లా ప్రసిద్ధి చెందారు. అఖిల్ క్లింటన్ ఫౌండేషన్ ఆధీనంలోని సీజీఐ యూ ప్రోగ్రామ్‌తో కలిసి క్రిమినల్ జస్టిస్, సివిక్ ఎంగేజ్‌మెంట్‌లో ఫెలోగా పనిచేస్తున్నారు. ఈయన ఉత్తర తెలంగాణలో మానవ హక్కుల పరిరక్షణకు క్రియాశీలక కేంద్రాన్ని స్థాపించారు.తెలంగాణలో మొదటి ప్లాస్మా దాత అయిన అఖిల్ ఎన్నంశెట్టి కొవిడ్-19 మహమ్మారి మొదటి వేవ్ సమయంలో సి 19 టాస్క్ ఫోర్స్ ను ప్రారంభించారు.

మా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి : అఖిల్
యుకే విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న భారతీయ పూర్వ విద్యార్థుల సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ అవార్డు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అఖిల్ ఎన్నంశెట్టి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ అవార్డు భారత్, యూకే దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

శ్రేనిక్ రావుకు ఎన్నెన్నో పురస్కారాలు
తెలంగాణకు చెందిన శ్రేనిక్ రావు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రస్థుతం యూకే ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. 2016వ సంవత్సరంలో మద్రాస్ కొరియర్ అనే 233 ఏళ్ల వార్తాపత్రిక డిజిటర్ అవతార్ ను పునరుద్ధరించారు. గతంలో 7 మీడియా బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టరుగా కూడా పనిచేస్తున్నారు. డినైడ్, దిస్ బిట్ ఆఫ్ ట్రూత్, ముగాబే జింబాబ్వే, 7 నోట్స్ టు ఇన్ఫినిటీ, ట్రీ సైకిల్, ది మాన్ సూన్ ఒరాకిల్ వంటి చిత్రాలను రచించి, దర్శకత్వం వహించి, నిర్మించారు. బహుళ భాషల్లో డబ్ చేసిన ఈ చిత్రాలు హిస్టరీ ఛానల్, టీవీ1, 24 డీఓకే, సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, గయామ్ టీవీ, సీఫీ, ఎన్డీటీవీల్లో 54 దేశాల్లో ప్రసారం చేశారు. పర్యావరణంపై ఉన్న ఆసక్తిగాను శ్రేనిక్ రావుకు కర్మవీర్ పురస్కారం లభించింది. హైదరాబాద్ యూనివర్శిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి అయిన శ్రేనిక్ రావు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4,500 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర చేశారు. 18,380 అడుగుల ఎత్తులో ఉన్న ఖర్జుంగ్ -లా వరకు ఇతను సైకిల్ తొక్కి సైక్లిస్టుగా ప్రశంసలందుకున్నారు.
యూకే అవార్డులు పొందిన నలుగురు తెలంగాణ ముద్దుబిడ్డలకు ‘ఫెడరల్ తెలంగాణ’ హాట్సాప్ చెబుతోంది.




Read More
Next Story