మిడ్జల్ నుంచి ముఖ్యమంత్రి వరకు..
x
REVANT WITH SONIA GANDHI AT HYDERABAD (FILE SHOT)

మిడ్జల్ నుంచి ముఖ్యమంత్రి వరకు..

31 మే 2015.. హైదరాబాద్ జూబ్లీ హిల్స్.. ఆయన ఇంటిని ఏసీబీ పోలీసులు చుట్టుముట్టారు. చేతికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆయనెవరో మీకీ పాటికే తెలిసిపోయి ఉంటుంది.



2015 జూలై 1.. హైదరాబాద్‌ చర్లపల్లి జైలు.. ఉదయం 11 గంటలు దాటింది. అప్పటికే జైలు బయట జనం తండోపతండలు.. గుమికూడి ఉన్నారు. నిమిషాల చొప్పున జనం టైంని లెక్కగడుతున్నారు.. సరిగ్గా ఆ టైంలో జైలు నుంచి అడుగుపెట్టారు. అంతే జైలు బయట నినాదాలు మిన్నంటాయి. పూల వర్షం కురిసింది. జైజై నినాదాలు హోరెత్తాయి. పచ్చజెండాల రెపరెపలు.. ఆ తర్వాత సాగిన యాత్ర ఐదారు గంటల పాటు హైదరాబాద్ ని ఓ ఊపు ఊపింది.

31 మే 2015.. హైదరాబాద్ జూబ్లీ హిల్స్.. ఆయన ఇంటిని ఏసీబీ పోలీసులు చుట్టుముట్టారు. చేతికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. స్టింగ్ ఆపరేషన్ లో మీరు దొరికారు, మిమ్మల్ని అరెస్ట్ చేయకతప్పదన్నారు. అప్పుడాయన చేసేదేమీ లేక సరే పదండన్నారు. పోలీసు కారెక్కాడు.

ఆయనెవరో మీకీపాటికి తెలిసే ఉంటుంది. పేరు ఎనుముల రేవంత్ రెడ్డి. ఆవేళ శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ నిలబెట్టిన ఓ అభ్యర్థికి ఓటేయమని.. నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు లంచం ఇచ్చారన్న ఆరోపణలో జైలు కెళ్లారు. అట్టహాసంగా బయటకు వచ్చారు. కాలక్రమంలో టీడీపీ బదాబదలైంది. తలో దిక్కయ్యారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రం అధికార పార్టీ వైపు కాకుండా తునాతునకలైన కాంగ్రెస్ వైపు చేరారు. ఆ తర్వాత హస్తం పార్టీలో చక్రం తిప్పారు. పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఇప్పుడు ఏకంగా నవ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు.

అదురూ బొదురు ఉండదు...

యువతను ఆకట్టుకోవడంలో దిట్ట. ఆయన వయసు 54. కానీ 24 ఏళ్ల వాళ్లని సైతం ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. మాటకు మాట, వేటుకు వేటు. జనం మూడ్ పసిగడతారు. అందరూ పోయే దానికి అడ్డంగా వెళ్లి అనుకున్నది సాధిస్తాడు. అదే ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేకత. ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నా కొంచెం తక్కువగా 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాడు. నిరుత్సాహపడకుండా అటు ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజా సమస్యలే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేశారు. ఆయన ఈ స్థాయికి ఎదగడమనేది ఏ ఒక్క రోజులోనో మరొక్క ఏడాదిలో జరిగింది కాదు. ఆకలి రుచితో పాటు మట్టి వాసనలు తెలియబట్టే ఆయన పేరు ఇప్పుడు మార్మోగింది. పెయింటర్ నుంచి యువ నాయకుడిగా ఎదిగారు. గాలి వాటానికి కొట్టుకుపోకుండా గాలి వానకు ఎదురు నిలిచాడు. కే చంద్రశేఖరరావు లాంటి వాగ్ధాటి, అభినవ చాణిక్యుడు, అద్భుత కమ్యూనికేటర్ ను ఢీ కొట్టి పడగొట్టాడు. కేసీఆర్ నోట తన పేరొస్తే చాలనుకున్న రేవంత్... రేపట్నుంచి కేసీఆర్ నోటితో కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనిపించుకోబోతున్నారు.

ఆవేళ కాంగ్రెస్ కు నో చెప్పింది ఈయనే...

రేవంత్ రెడ్డికి అస్సలు రాజకీయ నేపథ్యం కాదంటే నమ్మగలమా.. కానీ నమ్మాలి. అట్లని వామపక్ష నేపథ్యమా అంటే అదీ కాదు. 1969 నవంబర్ 8న నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్ రెడ్డిది చాలా సాదాసీదా జమాన. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువు. గ్యాడ్యుయేషన్ పట్టా. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతారెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీళ్లకో కూతురు. ఆమధ్య పెళ్లి కూడా అట్టహాసంగా చేశారు.

ఆ సంగతి అలా ఉంచితే..ఆయన ముందు వెనుకలవారెవ్వరూ రాజకీయాల్లో లేరు. కానీ ఆశ లావు పీక సన్నం అన్నట్టుగా.. డిగ్రీ చదివిన కుర్రాళ్లందరికీ ఉన్నట్టే ఎదగాలన్న కోరిక తప్ప ఏమి చేయాలో తెలియదు. కానీ ఏదో విధంగా రాజకీయ నేతగా ఎదగాలి. సంకల్పం పెద్దది. చేతిలో సొమ్ములు చిన్నవి. 2007లో పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. ఏదైతే అదైందని జడ్పీటీసీకి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్, టీడీపీ, ఆనాటి టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలను ఢీ కొట్టారు. విజయబావుటా ఎగరేశారు.

మిడ్జల్ నుంచే రాజకీయ సోపానం...

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ నుంచి 2007లో జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ గెలుపుతో పార్టీలన్నీ ఒక్కసారిగా రేవంత్ వైపు చూసేలా చేశాయి. అక్కడే ఆయన నాయకత్వం బయటపడింది. తర్వాత ఎమ్మెల్సీగా గెలిచారు. అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్.. పార్టీలో జాయిన్ కావాలని ఆహ్వానించినా.. దివంగత సీఎం ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అభిమానంతో సైకిల్ ఎక్కారు. తెలుగుదేశం పార్టీ నుంచి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అభ్యర్థి రావులపల్లి గుర్నాథ్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ విజయం ఆయన చరిష్మాను మరింతగా పెంచింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మరోసారి బరిలోకి దిగి ఆయన ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేపట్టింది.

టీడీపీ ఫ్లోర్ లీడర్ గా...

2014 – 2017 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. 2017 అక్టోబర్‌లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. 3 ఏళ్ల స్వల్ఫకాలంలోనే ఎవ్వరికీ దక్కని హోదాతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 మే లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా (టీపీసీసీ) 2021 జూన్ 26న నియమించింది. 2021 జులై 7న అప్పటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కేసీఆర్ పాలనపై వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఆయన్ని ఓడించడం కోసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు.

కాంగ్రెస్ టూన్ కి తగ్గట్టుగా...

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు, పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు ఆ పార్టీలో ఈ మిడాయలపు మనిషి అసలు ఇముడుతాడా అని చాలా మంది అనుకున్నారు. కాంగ్రెస్ పెద్దలు మామూలుగా ఎవర్నీ కుదురుకోనివ్వరు. అలాంటి వాళ్ల మధ్య ఈ మనిషి ఏమై పోతాడో అన్న సందేహాలకు రేవంత్ పుల్ స్టాప్ పెట్టారు. సమయానికి తగ్గట్టుగా, అధిష్టానానికి అనువుగా సోనియమ్మకు, వాళ్ల పిల్లలు రాహుల్, ప్రియాంకకు దగ్గరయ్యారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి అనుంగు శిష్యుడయ్యారు. అందర్నీ కూడగట్టారు. ఏఐసీసీ సెషనే హైదరాబాద్ లో పెట్టించాడు. రాజకీయాన్ని రసవత్తరం చేశారు. అధికార బీఆర్ఎస్ పై అసంతృప్తిని పసిగట్టి కేసీఆర్ కుంభస్థలాన్ని కొల్లగొట్టారు. అధికారానికి చేరువయ్యాడు. నవ తెలంగాణకు మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.

రేవంత్ పై ఓటుకు నోటు మచ్చ..

ఇంత చరిత్ర ఉన్నా రేవంత్ పై క్రిమినల్ కేసుల మచ్చలూ లేకపోలేదు. శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో మే 31 2015న కేసు బుక్ అయిం.ది. రేవంత్ రెడ్డిపై స్టింగ్ ఆపరేషన్ చేసి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. అవినీతి నిరోధక చట్టం, సెక్షన్లు 120-B (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు – ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 34 కింద రేవంత్‌తో పాటు మరో ఇద్దరు - బిషప్ సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాను అరెస్ట్ చేసింది. వీరిని చర్లపల్లి సెంట్రల్ జైలుకి తరలించింది. జూన్ 30న వీరికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2015 జులై 1న రేవంత్ రెడ్డి విడుదలయ్యారు. ఈ కేసు తాలూకు చేదు అనుభవాలు ఇప్పటికీ రేవంత్‌ని వెంటాడుతున్నాయి.

తెలంగాణాను ఏమి చేస్తావో, మరి..

ఇవన్నీ ఉన్నా రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఆరు గ్యారంటీ స్కీమ్‌లు ఉన్నాయి. అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవల్సి ఉంటుంది. ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలి.

Read More
Next Story