గేటెడ్ కమ్యూనిటీ వర్సెస్ స్టాండ్ ఎలోన్ అపార్ట్‌మెంట్: ఏది బెటర్?

ఎవరైనా ఒక ఇల్లు కొనేటప్పడు పరిగణించే ప్రాథమిక అంశాలు - బడ్జెట్, లొకేషన్. ఇవి కాకుండా మన మైండ్‌సెట్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే దీనికి సమాధానం వస్తుంది.


ఈ మధ్య బాగా హిట్ అయిన “సేవ్ ది టైగర్స్” అనే తెలుగు కామెడీ ఓటీటీ సిరీస్‌లో ఒక గృహిణి పాత్ర తన భర్తను - గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొను, కొను అంటూ సతాయిస్తూ ఉంటుంది. “ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్” అన్నట్లు, నిజంగానే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అంటే బాగా క్రేజ్ ఉంది. అయితే అందరూ అంతగా ఆకర్షితులవుతున్న గేటెడ్ కమ్యూనిటీలో నెగెటివ్ పాయింట్స్ లేవా, సాధారణ స్టాండ్ ఎలోన్ అపార్ట్‌మెంట్‌లో మంచి పాయింట్స్ లేవా అనేది పరిశీలిద్దాం.

రియల్ ఎస్టేట్ పదజాలం-నిర్వచనాలు

స్టాండ్ ఎలోన్ అపార్ట్‌మెంట్: కనీసం 300 - 500 గజాలలో నాలుగో, ఐదో అంతస్తులు, ఫ్లోర్‌కు నాలుగో, ఐదో ఫ్లాట్‌లతో 20-30 ఫ్లాట్‌లు ఉండే భవనాలు. ఒక వాచ్ మ్యాన్ ఉంటాడు, జనరేటర్, లిఫ్ట్ వంటి కనీస సౌకర్యాలు ఉంటాయి. సెక్యూరిటీ పటిష్ఠంగా ఉండదు.

హై రైజ్ అపార్ట్‌మెంట్‌లు: కనీసం పది అంతస్తులు, ఆ పైన ఉండే ఆకాశ హర్మ్యాలు. హైదరాబాద్‌లో ఇప్పుడు గరిష్ఠంగా 50 ఫ్లోర్‌ల వరకు కడుతున్నారు.

గేటెడ్ కమ్యూనిటీ: చుట్టూ ప్రహరీగోడతో 2 ఎకరాలు, ఆ పైన స్థలంలో నిర్మించబడిన భవన సముదాయం. వీటిలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి… విల్లాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ, హై రైజ్ అపార్ట్‌మెంట్‌లతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ. విల్లాల కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్‌లాగా రెండు అంతస్తులో, మూడు అంతస్తులతోనో విల్లాలు ఉంటాయి.

హై రైజ్ అపార్ట్‌మెంట్‌ల గేటెడ్ కమ్యూనిటీలో ఐదో ఆరో హై రైజ్ టవర్‌లు ఉంటాయి. వీటిలో 10 నుంచి 40 దాకా అంతస్తులు ఉంటాయి. ఒక్కో అంతస్తులో నాలుగో, ఐదో ఫ్లాట్‌లు ఉంటాయి. అంటే దాదాపు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఒక చిన్న ఊరు ఉన్నట్లే. ఈ గేటెడ్ కమ్యూనిటీలో, 35% భవనాలు, 65% ఖాళీ స్థలం ఉంటేటట్లు నిర్మాణం జరుగుతుంది. అది బిల్డర్ పాటించవలసిన మౌలిక నిబంధన.

సెట్ బ్యాక్‌లు: భవనానికి నాలుగువైపులా ఖాళీగా వదిలే ప్రదేశాన్ని సెట్ బ్యాక్ అంటారు.

యూడీఎస్: అన్ డివైడెడ్ షేర్ అంటే భవనం ఉన్న స్థలంలో ఫ్లాట్‌ యజమానులకు ఒక్కొక్కరికీ వచ్చే స్థలం వాటా.

స్టాండ్ ఎలోన్ అపార్ట్‌మెంట్‌లో ప్లస్‌లు

ఎఫర్డబులిటీ: మధ్యతరగతివారికి ఈ అపార్ట్‌మెంట్‌లు ధరలపరంగా అందుబాటులో ఉంటాయి.

లొకేషన్: మీరు ఉద్యోగం చేసే ప్రదేశం ఎక్కడ ఉన్నా, అక్కడకు దగ్గరలో మీకు ఒక అపార్ట్‌మెంట్ తప్పకుండా దొరుకుతుంది. గేటెడ్ కమ్యూనిటీలు అలా కాదు. ఎక్కువగా నగర శివార్లలో ఉంటాయి. స్టాండ్ ఎలోన్ ఫ్లాట్ ప్రైమ్ లొకేషన్‌లో ఉంటే, గేటెడ్ కమ్యూనిటీలో ఉండే సదుపాయాలన్నీ అక్కడే చుట్టుపక్కలే దొరుకుతాయి.

ట్రాన్స్‌పోర్ట్: మీరు ఆఫీసులకు వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్స్, కాలేజిలకు వెళ్ళాలన్నా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గానీ, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ గానీ అందుబాటులో ఉంటుంది.

మెయింటెనెన్స్ తక్కువ: వీటిలో 20-40 కుటుంబాలే ఉంటాయి కనుక మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలతో పోల్చితే. లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు అయితే తప్ప మ్యాగ్జిమమ్ రు.2,000 లోపే ఛార్జి చేస్తారు.

మైండ్‌సెట్: మీరు ఇంట్రావర్ట్‌లు అయిఉండి, ఇంటి నుంచి బయటకు రాగానే ఒక మాల్‌లోనో, ఎగ్జిబిషన్‌లోనో ఉన్నట్లు అనిపించటం, ఎప్పుడూ ఏదో ఒక రొద, సందడిగా ఉండటం మీకు ఇష్టంలేకపోతే స్టాండ్ ఎలోన్ బెటర్. అలాంటప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు మీకు కోళ్ళ ఫారంలాగానో, ఫ్యాక్టరీలాగానో అనిపిస్తాయి. అలా కాకుండా మీకు ఎప్పుడూ చుట్టూ పదిమంది మనుషులు కనబడుతూ ఉండాలనుకుంటే గేటెడ్ కమ్యూనిటీలు బెటర్.

అన్‌ డివైడెడ్ షేర్: దీనినే రియల్ వ్యాపారులు యూడీఎస్ అంటారు. పది ఫ్లాట్‌లున్న ఒక 500 గజాల స్టాండ్ ఎలోన్‌ను కొంత కాలం పోయిన తర్వాత కూలగొట్టేశారనుకుందాం. అప్పుడు దానిలోని పది ఫ్లాట్ యజమానులకూ తలా ఒక 50 గజాల స్థలం వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఈ యూడీఎస్‌పై ఒక స్పష్టత ఉండదు.

స్టాండ్ ఎలోన్‌తో మైనస్ పాయింట్‌లు

సెక్యూరిటీ: ఈ భవనం మొత్తానికి ఒక వాచ్ మ్యాన్ ఉంటాడు. అతను వాచ్ మ్యాన్ పని కాకుండా ఇంకా నాలుగైదు బాధ్యతలు ఉంటాయి. దీనితో అపార్ట్‌మెంట్‌లోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళుతున్నారో స్పష్టంగా తెలియదు.

రాజకీయాలు: ఉండేది 20 - 30 ఫ్లాట్‌లు అయినా రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. లైక్ మైండెడ్ మనుషులు ఉంటే ఫరవాలేదుగానీ, లేదంటే ప్రతిరోజూ సమస్యలే. ముఖ్యంగా పార్కింగ్ విషయంలో ఎక్కువగా గొడవలు వస్తుంటాయి. ఎవరో ఒక్క వ్యక్తి లేదా గ్రూప్ ఆధ్వర్యంలో(డామినేషన్) నడుస్తుంటుంది. వాళ్ళతో మనకు మంచి సంబంధాలు ఉంటే ఫరవాలేదు, లేకపోతే నరకమే. గేటెడ్ కమ్యూనిటీలలో ఒక్క వ్యక్తి లేదా ఒక గ్రూప్ డామినేషన్ ఉండదు.

వెంటిలేషన్: పట్టణాలు, నగరాలలో స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోవటంతో స్టాండ్ ఎలోన్ అపార్ట్‌మెంట్‌లలో సెట్‌బ్యాక్‌లు చాలా తక్కువగా వదులుతున్నారు. మరోవైపు మన భవనానికి మూడు పక్కలా అపార్ట్‌మెంట్‌లు ఉంటున్నాయి. దీనితో గాలి, వెలుతురు రాకపోగా, వేసవికాలంలో వేడి మరింత పెరిగిపోతుంది. మన కిటికీ తెరిస్తే ఎదుటివారి బెడ్ రూమో, కిచెనో కనబడుతుంటుంది.

గేటెడ్ కమ్యూనిటీలో ప్లస్‌లు

సెక్యూరిటీ: మొట్టమొదటి ప్లస్ పాయింట్ భద్రత. 24/7 హై లెవెల్ సెక్యూరిటీ, సీసీ టీవీ కెమేరా వ్యవస్థ ఉంటాయి. లోపలకు ఎవరు రావాలన్నా పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతే రానిస్తారు. దొంగతనాలు, ఆగంతకుల దాడులు వంటివి జరగటానికి నూటికి 90 పాళ్ళు అవకాశం ఉండదు.

సెల్ఫ్ సఫిషియెంట్: గేటెడ్ కమ్యూనిటీలో దేనికీ బయటకు వెళ్ళనవసరంలేదు. సూపర్ మార్కెట్ నుంచి మొదలుపెడితే పార్కులు, ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, క్రెష్, ప్లే స్కూల్, డే కేర్ సెంటర్, ట్యూషన్, మినీ ధియేటర్, ఫంక్షన్ హాల్ తదితర సదుపాయాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. మల్టీ లెవల్ పార్కింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల గ్యాస్ కూడా కమ్యూనిటీవాళ్ళే సరఫరా చేస్తారు. సోలార్ వాటర్ హీటర్‌లు కూడా పెడుతున్నారు. చాలా గేటెడ్ కమ్యూనిటీలు సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉంటున్నాయి.

సర్కిల్ పెరుగుతుంది: దీనిలో ఫ్లాట్ కొనగానే, మీరు ఒక కమ్యూనిటీలో భాగమవుతారు, మీకు ఒక మంచి సర్కిల్ ఏర్పడుతుంది. ఇక్కడ భిన్న రాష్ట్రాలు, భిన్న సంస్కృతుల కుటుంబాలు ఉంటాయి, వాళ్ళతో మంచి బంధాలు, బాంధవ్యాలు ఏర్పడతాయి. వాళ్ళ సంస్కృతులు, అలవాట్లు తెలుస్తాయి.

ఎదిగే పిల్లలకు మంచి అడ్వాంటేజ్: చిన్నపిల్లలు ఉన్న యువ కుటుంబాలకు ఇది మంచి ఎంపిక అవుతుంది. అనేక సంస్కృతుల మనుషుల మధ్య పెరగటంతో పిల్లల ఆలోచనా పరిధి విస్తరిస్తుంది. ప్లే ఏరియాతో పాటు షటిల్, బాడ్మింటన్, టెన్నిస్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మన పిల్లలకు ఏదైనా ఒక నిర్దిష్టమైన క్రీడలో ఆసక్తి ఉంటే దానిలో రాణించేలా చేయటానికి అవకాశాలు ఉంటాయి.

సీనియర్ సిటిజన్‌లకు మంచి కాలక్షేపం: సీనియర్ సిటిజన్లకు ఇది మంచి ఎంపిక అవుతుంది. వీరికి భద్రతపరంగా పూర్తిగా సేఫ్‌గా పరిగణించవచ్చు. ముఖ్యంగా వారికి ఇన్‌స్టంట్‌గా ఒక కమ్యూనిటీ ఏర్పడుతుంది. దీనికితోడు మెడికల్ ఎమర్జెన్సీ, క్లినిక్, మెడికల్ స్టోర్స్ ఉంటాయి. యోగా, ధ్యానం, సత్సంగ్ చేసుకోవటానికి వేర్వేరు గ్రూపులు ఉంటాయి. పెద్దవారికి ఇంతకంటే ఏమి కావాలి!

గేటెడ్ కమ్యూనిటీ మైనస్‌లు

ఖర్చు: ఇనీషియల్ పేమెంట్‌లోగానీ, మెయింటెనెన్స్‌లోగానీ స్టాండ్ ఎలోన్ కంటే ఇక్కడ కనీసం పదిశాతం ఎక్కువ ఖర్చు ఉంటుంది. మెయింటెనెన్స్ అయితే కనీసం మూడు రెట్లు ఎక్కువ అవుతుంది. ఇది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మన ఆదాయం కూడా పెరుగుతూనే ఉండాలి. గేటెడ్ కమ్యూనిటీలో టూ బెడ్ రూమ్ ఫ్లాట్‌కు పెట్టే డబ్బుతో స్టాండ్ ఎలోన్‌లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కోవచ్చు.

లొకేషన్: గేటెడ్ కమ్యూనిటీలు కనీసం రెండు ఎకరాలు ఉండే స్థలంలో కడతారు కాబట్టి, ఊరి మధ్యలో కాకుండా, దూరంగా ఉంటాయి. ఆఫీసులు, విద్యాసంస్థలు దూరంగా ఉంటాయి. ఇంట్లో రెండు మూడు వాహనాలు ఉంటే ఫరవాలేదుగానీ, లేకపోతే ట్రాన్స్‌పోర్టేషన్ కష్టమవుతుంది. ఇంటికి చుట్టాలు, మిత్రులు రావాలన్నా కష్టమే.

ఎమెనిటీస్: బిల్డర్ సదుపాయాలను అరచేతిలో వైకుంఠంలాగా బ్రోచర్‌లో ఆకర్షణీయంగా చూపిస్తాడు, అవి అన్నీ అక్కడ ఉంటాయిగానీ మనం ఉపయోగించుకోవటానికి అంత ఖాళీగా ఏమీ ఉండవు. నాలుగొందలు, ఐదొందలు ఫ్యామిలీలు ఉంటే ఒక స్విమ్మింగ్ పూల్, ఒక జిమ్ సరిపోవటం కష్టం.

పెట్‌లతో సమస్యలు: గేటెడ్ కమ్యూనిటీలలో ఇది ఒక పెద్ద సమస్య. పెట్‌లను పెంచుకునేవాళ్ళు వాటిని చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ మిగిలినవాళ్ళకు అవి కేవలం కుక్కలు. పెంచుకునేవాళ్ళు కొందరు, ఆ పెట్‌ల వలన మిగిలినవాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుండటంతో సమస్యలు వస్తుంటాయి. పెట్‌లను సర్వీస్ లిఫ్ట్‌లలో తీసుకెళ్ళాలని నిబంధన ఉంటుంది. అయితే కొందరు పెట్ పేరెంట్స్(పెట్‌లను పెంచుకునేవారిని ఇప్పుడు అలా పిలుస్తున్నారు) వాటిని మామూలు లిఫ్ట్‌లలో తీసుకొస్తుంటారు. అవి పక్కవాళ్ళపైకి దూకుతుంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఒకటికి, రెండుకు వెళుతుంటాయి. పెట్ పార్కులు విడిగా ఉన్నా, వాటిని అక్కడకు తీసుకెళ్ళకుండా సాధారణ పార్కులకు తీసుకొస్తారు.

రాజకీయాలు: పెద్ద కమ్యూనిటీ లలో నెలకు రు.2-3 కోట్ల వరకూ మెయింటెనెన్స్ వసూలు అవుతుంది. ఆ అమౌంట్‌లో ఎంతో కొంత వెనకేసుకుందాం అనే ఆశతో రెసిడెంట్స్ అసోసియేషన్ లో గొడవలు. రాజకీయాలు జరుగుతాయి. ఒకరి మీద ఒకరు కేసులు కూడా పెట్టుకుంటారు. గేటెడ్ కమ్యూనిటీ అంటే పైకి కనిపించేటంత మెరుగులే కాదని హైదరాబాద్‌లోని హిల్ కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే రచయత్రి వేల్పూరి సుజాత అన్నారు.

ఏది బెటర్?

ఎవరైనా ఒక ఇల్లు కొనేటప్పడు పరిగణించే ప్రాథమిక అంశాలు - బడ్జెట్, లొకేషన్. ఇవి కాకుండా మన మైండ్‌సెట్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే దీనికి సమాధానం వస్తుంది. డబ్బు ఎక్కువైనా ఫరవాలేదు సకల సదుపాయాలూ ఒక్కచోటే అందుబాటులో ఉండాలి అనుకుంటే గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీలలోని డాబు, దర్పం, హంగూ, ఆర్భాటం అవసరంలేదు, మధ్యతరగతిలాగే ఉంటాను, అందరితో తేలిగ్గా adjust అవగలను అనుకుంటే స్టాండ్ ఎలోన్.

ఇప్పుడు ఆదాయాలు పెరిగాయి, ఖర్చు చేసే సామర్థ్యం కూడా పెరిగిందని, భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తుంటే - లైఫ్‌స్టైల్‌పై రాజీపడటంలేదని, హైఫైగా ఉండాలనుకుంటున్నారని హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వై.రాఘవేంద్ర అన్నారు. అలాంటివారు గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవచ్చని చెప్పారు.

గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలంటే, ఆ స్థాయిని మెయింటెయిన్ చేయాలంటే మీకు ఆ స్థాయిలోనే ఆదాయం వస్తూ ఉండాలి. ఎప్పుడైనా మీ ఆదాయం తగ్గిందంటే కష్టమైపోతుంది. పీర్ ప్రెషర్ ఉంటుంది. మీ కారు మారుతి స్విఫ్టో, డిజైరో అయ్యి, పక్క ఫ్లాట్ వాళ్ళు బెంజ్‌ కొన్నారనుకోండి, మీకు లోలోపల అసంతృప్తి పెరిగిపోతుంటుంది.

మన ఆలోచనలతో కలిసేవారు పొరుగుగా దొరికి, కనస్ట్రక్షన్ క్వాలిటీ బాగుండి, భవనం చుట్టూ సెట్ బ్యాక్‌లు బాగానే ఉండి, సెక్యూరిటీ ఉండేటట్లయితే స్టాండ్ ఎలోన్ అపార్ట్‌మెంట్ కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ మన పొరుగు ఫ్లాట్‌లోనివారు వేరేవాళ్ళు ఉన్నా, వారిని కూడా మన బంధువులుగానో, స్నేహితులుగానో పరిగణించుకుంటేనే సంబంధాలు బాగుంటాయి. అప్పుడు మన అపార్ట్‌మెంట్ ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉంటుంది. మన రక్తసంబంధీకులు, కుటుంబసభ్యులు ఎంతో దూరంగా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో వారితో ఉపయోగం ఉండదు కాబట్టి, చుట్టుపక్కల ఉండేవారినే చుట్టాలులాగా అనుకుంటూ అందరితో మంచిగా ఉండగలగితే స్టాండ్ ఎలోన్ కూడా బాగానే ఉంటుంది.

అన్నదమ్ములో, అక్కచెల్లెళ్ళో, బంధువులో అందరూ కలిసి ఒక స్థలం కొనుక్కుని అపార్ట్‌మెంట్ కట్టించుకుంటే దానికి మించినది మరొకటి ఉండదు. అయితే అలా కట్టించుకునే తీరిక, సమర్థత అందరికీ ఉండవు.

స్టాండ్ ఎలోన్ అపార్ట్‌మెంట్‌లో సదుపాయాలు పెంచుకుంటే అది కూడా గేటెడ్ కమ్యూనిటీతో సమానంగా అవుతుందని ఒక ప్రముఖ కనస్ట్రక్షన్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న యాదవరెడ్డి అన్నారు. మెయింటెనెన్స్ పెంచుకుంటే సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకోవచ్చని, సీసీ టీవీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.

కొసమెరుపు: గేటెడ్ కమ్యూనిటీపై మంచి జోకులు కూడా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్కడ ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత ఉద్యోగం పోతే, ఆ కమ్యూనిటీలోనే వాచ్‌మ్యాన్‌గానో, చాకలిగానో, క్లీనర్‌గానో వేర్వేరు ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా బతికేయొచ్చు అంటూ.

Read More
Next Story