బాలానగర్ సీతాఫలం స్పెషాలిటీ గుర్తింపు కోసం దరఖాస్తు
తెలంగాణ ఉద్యాన పంటలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇప్పించేందుకు కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది.జీఐ ట్యాగ్ కథా కమామీషు..
తెలంగాణ రాష్ట్రంలో తీయని బాలానగర్ సీతాఫలాలు,ఔషధ గుణాలున్న మేలైన పొడుగు నిజామాబాద్ పసుపుకొమ్ములు,ఫైబరుతో పాటు రుచిగా ఉండే నల్గొండ దోసకాయలు,సిద్ధిపేట అల్లం,తియ్యని అరుదైన అనాత్ ఈ షాహీ ద్రాక్ష,వరంగల్ చపాటా మిర్చి, కాల్షియంతో పాటు తియ్యదనం ఇచ్చే కొల్లాపూర్ మామిడి కాయలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్ ఇప్పించేందుకు హైదరాబాద్ నగరంలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కసరత్తు చేస్తోంది.
- తెలంగాణ రాష్ట్రంలో 16 ఉత్పత్తులకు ఇప్పటికే జీఐ ట్యాగ్ లభించింది. తెలంగాణలోని కొన్ని నిర్ణీత ప్రాంతాల్లోనే లభ్యమయ్యే అరుదైన పండ్ల రకాలకు జీఐ ట్యాగ్ ఇప్పించేందుకు తమ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి నీరజా ప్రభాకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
నిజామాబాద్ పసుపునకు డిమాండ్
నిజామాబాద్ జిల్లా రైతులు అనాదిగా పండిస్తున్న పసుపు పంటకు దేశ, విదేశాల్లోనే మంచి పేరుంది.పొడుగ్గా ఉన్న పసుపు కొమ్ములతో పసుపు రంగు షైనింగ్ తో నిగనిగలాడే నిజామాబాద్ పసుపునకు స్థానికంగానే కాకుండా దేశంలోనే మంచి డిమాండ్ ఉంది.నిజామాబాద్‌లో తయారయ్యే పసుపు నాణ్యతకు ప్రసిద్ధి.ప్రపంచంలోని మొత్తం పసుపు ఉత్పత్తిలో ఈ ప్రాంతం నుంచి పసుపు 8 నుంచి 10 శాతం వరకు ఉంటుంది.ఈ పసుపునకు జీఐ ట్యాగ్ ఇప్పించడం ద్వారా పసుపు రైతులకు మేలు చేసేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ముందుకు వచ్చారు.
పసుపు సిటీగా నిజామాబాద్
నిజామాబాద్ పసుపుకు జీఐ ట్యాగ్ తీసుకురావడం ద్వారా ప్రపంచ వ్యాప్త గుర్తింపు కల్పిస్తామని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.నిజామాబాద్ నగరంలో జాతీయ పసుపుబోర్డును ఏర్పాటు చేయడంతోపాటు నిజామాబాద్ నగరాన్ని పసుపు సిటీగా మారుస్తామని ఇటీవల ప్రధాని మోదీ చెప్పారు.దీంతో పసుపు బోర్డు ఏర్పాటు పనులు సాగుతున్నాయి.
తియ్యదనం ఇచ్చే బాలానగర్ సీతాఫలాలు
పెద్ద పెద్ద కళ్లతో తియ్యదనంతోపాటు అత్యంత రుచిగా ఉన్న బాలానగర్ సీతాఫలాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇష్టపడని వారుండరు. మహబూబ్ నగర్ జిల్లాలోని బాలానగర్ గ్రామం కేంద్రంగా గిరిజన రైతులు పండిస్తున్న సీతాఫలాలకు ఎంతో గిరాకీ ఉంది. కొన్ని వందల ఏళ్ల నాటి నుంచి పండిస్తున్న ఈ సీతాఫలాలకు బాలానగర్ సీతాఫలాలని పేరు పెట్టారు.ఈ పండ్లకు జీఐ ట్యాగ్ ఇప్పించడం ద్వారా అవి పండిస్తున్న గిరిజన రైతులకు సహకారం అందించాలని యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
వరంగల్ చపాటా మిరపకాయలు
చపాటా మిరపకాయలు వరంగల్ జిల్లా ప్రత్యేకత. ఈ మిరపకాయలు ఆకుపచ్చ క్యాప్సికం లాగా ఉంటాయి. ఈ కాయలు ఎండిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతాయి. చపాటా మిరపకాయలు ప్రత్యేకమైన తీపి, సువాసనతో ఎరుపు రంగులో ఉంటాయి.తియ్యటి మిరపకాయల్లో చపాటా ఒక రకం. ఊరగాయ తయారీదారులు చపాటా మిరపకాయలను కొనుగోలు చేస్తున్నారు. జపాన్, కొరియాకు కూడా ఈ మిరపకాయలు ఎగుమతి చేస్తున్నారు.వరంగల్ జిల్లాలో దాదాపు 15 వేల టన్నుల చపాటా మిర్చీని రైతులు పండిస్తున్నారు.
జియోగ్రాఫికల్ ఇండికేషన్
అరుదైన నాణ్యమైన పండ్లను పండిస్తున్న రైతులు, రైతులతో కూడిన సంఘాలకు మేలు చేసేలా ఉద్యాన వర్శిటీ అధికారులు వివిధ పండ్లకు జీఐ ట్యాగ్ ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు.జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోసం రిజిస్టర్డ్ ప్రొప్రైటర్‌గా రైతులు,వారి సొసైటీల పేర్లను రిజిస్టర్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్‌లో నమోదు చేస్తారు.దీన్నే జీఐ ట్యాగ్ అంటారు.భౌగోళిక సూచిక (జీఐ)అనేది నిర్దిష్ట భౌగోళిక మూలం ఉన్న ఉత్పత్తులపై ఉపయోగించే సంకేతం.దీని మూలం కారణంగా వివిధ పండ్ల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో ఖ్యాతి వచ్చింది.
దరఖాస్తు చేయాలి...
వస్తువులు లేదా పండ్ల ఉత్పత్తులకు సంబంధించి భౌగోళిక సూచనను నమోదు చేయాలనుకునే సంబంధిత వస్తువుల నిర్మాతలు లేదా ఉత్పత్తిదారుల సంఘం రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి.భారతదేశంలో జీఐ ట్యాగ్‌లను వస్తువులు,పంటల భౌగోళిక సూచనల రిజిస్ట్రేషన్, రక్షణ చట్టం 1999 ప్రకారం జారీ చేస్తారు.ఈ ట్యాగ్ ను పరిశ్రమ ప్రమోషన్, అంతర్గత వాణిజ్య శాఖ,వాణిజ్యం,పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ద్వారా జారీ చేస్తారు.
జీఐ ట్యాగ్ తో లాభాలెన్నో...
జీఐ ట్యాగ్ వల్ల నకిలీ ఉత్పత్తులను అరికట్టడంతోపాటు తయారీదారులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడం జీఐ ట్యాగ్ ఉద్ధేశం. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం దీన్ని అందిస్తోంది.ఏళ్లతరబడిగా పండిస్తున్న ఉద్యాన పంటల చరిత్రపై యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సర్వే చేసి,దీని డీఎన్ఏ టెస్టు చేస్తారు. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసిన జీఐ వల్ల లాభాలపై వారిలో చైతన్యం తీసుకువస్తారు. తెలంగాణ ఉద్యాన పంటలపై తాము మూడు నెలల్లో డాక్యుమెంట్ తయారు చేసి జీఐ ట్యాగ్ కోసం ప్రతిపాదనలను పంపిస్తామని వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి నీరజా ప్రభాకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.తాము సమర్పించే డాక్యుమెంట్లను పరిశీలించాక జీఐ టెక్నికల్ టీం వచ్చి పరిశీలన చేసి సదరు ప్రతిపాదించిన పండ్లకు జీఐ ట్యాగ్ ఇస్తుందని నీరజా వివరించారు.
తెలంగాణలో జీఐ ట్యాగ్ వచ్చిన వస్తువులివే...
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జీఐ ట్యాగ్‌లు సొంతం చేసుకున్న ఉత్పత్తుల సంఖ్య 16కి చేరుకున్నది.పోచంపల్లి ఇక్కత్ చీరలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, చేర్యాల్ స్రోల్ పెయింటింగ్, నిర్మల్ కొయ్య బొమ్మలు, చిత్రాలు, నిర్మల్ ఫర్నిచర్, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్. గద్వాల చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణ్ పేట్ చేనేత చీరలు,పుట్టపాక తెలియా రుమాల్, ఆదిలాబాద్ డోక్రా,వరంగల్ డర్రీస్,నిర్మల్ పెయింటింగ్స్, లాడ్ బజార్ లక్క గాజులు,తాండూర్ కందిపప్పు వంటి ఉత్పత్తులు ప్రస్తుతం జీఐ ట్యాగ్ సొంతం చేసుకున్నాయి.
పండ్ల రకాల డీఎన్ఏ నమూనాలు
బాలానగర్ సీతాఫలాలు,నిజామాబాద్ పసుపు, కొల్లాపూర్ మామిడి, నల్గొండ దోసకాయలకు జీఐ ట్యాగ్ నమోదుకు ఉద్యాన విశ్వవిద్యాలయ నాబార్డు సహకారంతో కసరత్తు చేస్తోంది. నిజామాబాద్ పసుపు, బాలానగర్ సీతాఫలం, కొల్లాపూర్ మామిడి పండ్ల యొక్క విశిష్టతను గుర్తించడానికి వాటి డీఎన్ఏ నమూనాను రూపొందిస్తామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.జీఐ రిజిస్ట్రేషన్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం జీఐ బ్రాండింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వనుంది.
జీఐ ట్యాగ్ తో ప్రత్యేక గుర్తింపు
ప్రతీ ప్రాంతంలో ప్రత్యేకంగా తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే వస్తువులు, పంటలు,ఆహార పదార్థాలు ఉంటాయి.వీటిని ఆ ప్రదేశంలోనే తయారు చేస్తే సహజమైన నాణ్యత వస్తుంది.అందుకే ప్రత్యేకంగా ఒక భౌగోళిక ప్రాంతం నుంచి వచ్చే ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ)ని వర్తింపచేస్తున్నారు.హైదరాబాద్ హలీం,తాండూరు కందిపప్పు సహా ఇప్పటికే 16 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ రాగా, త్వరలోనే మరికొన్ని ఉత్పత్తులకు ఆ గుర్తింపు రానుంది.
దావోస్ లో పారిశ్రామికవేత్తలకు సీఎం జీఐ ట్యాగ్ ఉత్పత్తుల బహుమతి
ఏదైనా ఉత్పత్తిపై జీఐ ట్యాగ్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ప్రత్యేకమైన ఉత్పత్తులు,వాటి వారసత్వానికి గుర్తింపు జీఐ ట్యాగ్ ద్వారా లభిస్తోంది.ఈ సంవత్సరం దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి వివిధ జీఐ ఉత్పత్తులను పలువురు పారిశ్రామికవేత్తలకు బహుమతిగా అందించారు.
Next Story