శుభవార్త...వచ్చే ఐదేళ్లలో 5 కోట్ల హోటల్ ఇండస్ట్రీ ఉద్యోగాలు
x
Resort

శుభవార్త...వచ్చే ఐదేళ్లలో 5 కోట్ల హోటల్ ఇండస్ట్రీ ఉద్యోగాలు

దేశంలోని నిరుద్యోగులకు హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఏఐ) శుభవార్త వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో దేశంలో ఆతిథ్య, పర్యాటక రంగాల్లో కొత్తగా 5కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని ఆ సంఘం తాజాగా ప్రకటించింది.హోటల్,పర్యాటక రంగం పురోగతి, ఉపాధి అవకాశాలపై ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రత్యేక కథనం...


వచ్చే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో దేశంలో 5 కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలను సృష్టించేందుకు ఆతిథ్య, పర్యాటక రంగం సమాయత్తం అవుతోంది. దేశంలోని హోటల్స్, పర్యాటక రంగం నిరుద్యోగులకు ఉపాధి కల్పన పరంగా పురోగమిస్తుందని న్యూఢిల్లీలోని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పునీత్ ఛత్వాల్ వెల్లడించారు. హోటల్స్,పర్యాటక రంగానికి ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించి వసతులను సృష్టించాలని హోటల్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఎంపీ బెజ్ బారుహ్ కోరారు. దేశంలోని ఆతిథ్య, పర్యాటక రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ మద్ధతు అవసరమని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి, లెమన్ ట్రీ హోటల్స్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పాటు కేశ్వానీ చెప్పారు. భారతదేశ పర్యాటక రంగం గత ఏడాది 78 లక్షల ఉద్యోగాలు స్పష్టించింది. ఆతిథ్య రంగంలో ఎంఐసీఎస్ అంటే మీటింగ్, ఇన్సెంటివ్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంది. యశోభూమి, భారత్ మండపం ఆవిష్కరణలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ కన్వెన్షన్, ఎక్స్ పో సెంటర్లకు నిలయంగా మారింది. మీటింగ్, ఇన్సెంటివ్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ విభాగాల్లో ప్రపంచ మార్కెట్ 500 బిలియన్ డాలర్లు కాగా దీనిలో భారత్ వాటా ఒక శాతం కంటే తక్కువగా ఉంది.

ఆల్ టైమ్ హైలో దేశీయ పర్యాటకం

దేశంలో భవిష్యత్‌లో ఆతిధ్య, పర్యాటక రంగం భారీ ఉపాధి అవకాశాలు అందించనుందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ, జీ20 కొత్తీ షెర్పా అమితాబ్ కాంత్ చెప్పారు. దేశంలో వచ్చే ఐదేళ్లలో ఎన్నో ఉద్యోగాలు సృష్టించనుందని ఆయన పేర్కొన్నారు. ఆతిథ్య, పర్యాటక రంగానికి ప్రభుత్వం నుంచి భరోసా లభిస్తే వారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. దీని కోసం ఆతిథ్య, పర్యాటక రంగాల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాల్సిన అవసరముందని అమితాబ్ కాంత్ చెప్పారు. పర్యాటక రంగం సృష్టించనున్న ఉద్యోగాలకు దేశంలో భారీ సానుకూల స్పందన ఉందన్నారు. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 6వ హోటల్స్ కాంక్లేవ్‌లో ‘‘ఆతిథ్యం- జీడీపీ వృద్ధి, ఉపాధి’’పై దృష్టి సారించారు. హోటల్, పర్యాటక రంగం ఇప్పటికే మహమ్మారి పూర్వ స్థాయిలను అధిగమించి, దేశీయ పర్యాటకం ఆల్ టైమ్ హైలో ఉందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ ఎంపీ బెజ్‌బరువా వ్యాఖ్యానించారు.

తెలంగాణలో అనంతగిరి చెంత కొత్తగా లెమన్ ట్రీ హోటల్

తెలంగాణ రాష్ట్రంలోని అనంతగిరి కొండల చెంత మార్పల్లెలో కొత్తగా లెమన్ ట్రీ హోటల్ నిర్మించనున్నారు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో ప్రకృతి సోయగాల మధ్య దక్కన్ పీఠభూమిలోని వికారాబాద్ జిల్లా మార్పల్లెలో లెమన్ ట్రీ హోటల్స్ రిసార్ట్ నిర్మాణానికి తాజాగా ఆ సంస్థ సంతకం చేసింది. లెమన్ ట్రీ రిసార్టులో 14 విల్లాలు, 50 గదులు, 5 వాటర్ విల్లాలు, రెస్టారెంట్, బార్, బాంకెట్ హాలు, మీటింగ్ రూంలు, స్విమ్మిల్ పూల్, ఫిట్ నెస్ సెంటర్, డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం లాన్ లను నిర్మించనున్నారు. భవిష్యత్ లో హోటల్ రంగం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ హోటళ్ల సంఘం మాజీ అధ్యక్షుడు, అనమోల్ హోటల్ యజమాని మహ్మద్ సలీం చెప్పారు.

ఆధ్యాత్మిక పర్యాటక రంగం అభివృద్ధి

రామజన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం నిర్మాణంతో దేశంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగం విశేషంగా అభివృద్ధి చెందింది. రామాలయం ప్రారంభం తర్వాత దేశంలో అయోధ్య ప్రాంతంలో పర్యాటకులు విశేషంగా పెరిగారని మేక్ మై ట్రిప్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయోధ్యతోపాటు దేశంలోని ఉజ్జయిని, బద్రీనాథ్, అమరనాథ్, మధుర, ద్వారకాదిష్, షిర్డీ, హరిద్వార్, బుద్ధగయ పట్టణాల్లో ఆథ్యాత్మిక పర్యాటక రంగం వడివడిగా పురోగమిస్తోంది. అయోధ్యను వాటికన్ ఆఫ్ ఇండియాగా భావిస్తుంటారు. రాబోయే మూడు ఏళ్లలో 50 నుంచి 100 హోటళ్లు అయోధ్యలో నిర్మించనున్నట్లు హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ ఛత్వాల్ వివరించారు.

కర్ణాటకలో రాయల్ ఆర్చిడ్ హోటల్స్

సముద్ర మట్టానికి 3,058 అడుగుల ఎత్తులో ఉన్న సుందరమైన మల్నాడు ప్రాంతంలోని సకలేష్‌పురా అనే పర్యాటక ప్రాంతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. రెజెంటా, రాయల్ ఆర్చిడ్, రెజంటా రిసార్ట్ లు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు నుంచి నాలుగు గంటలు, మైసూర్ నుంచి రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న సకలేష్ పురా చుట్టూ సుందరమైన కాఫీ, సుగంధ ద్రవ్యాల తోటలు, చారిత్రక ప్రదేశాలున్నాయి. ఈ ప్రకృతి సోయగాల ఒడిలో తాము విలాసవంతమైన హోటల్ ను నిర్మించాలని నిర్ణయించినట్లు రాయల్ ఆర్చిడ్ అండ్ రెజెంటా హోటల్స్ ఛైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ చందర్ కె బాల్జీ చెప్పారు. దీనివల్ల స్థానికంగా యువతకు ఉపాధి లభించనుందని చందర్ పేర్కొన్నారు.

మాల్దీవుల నుంచి లక్షద్వీప్‌కు మారిన పర్యాటక రంగం

తాజాగా రాజుకున్న వివాదంతో పర్యాటక రంగం మాల్దీవుల నుంచి లక్షద్వీప్ కు మారింది. లక్షద్వీప్‌లోని సుహేలి, కద్మత్ దీవులలో రెండు తాజ్-బ్రాండెడ్ రిసార్ట్‌లపై సంతకం చేస్తున్నట్లు ఆ గ్రూపు ప్రకటించింది. లక్షద్వీప్ లో సహజమైన బీచ్ లు, పగడపు దిబ్బలతో అరేబియా సముద్రం మధ్య తాజ్ గ్రూపు అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు ప్రపంచస్థాయి రిసార్ట్ లను నిర్మిస్తోంది. సుహేలి వద్ద ఉన్న తాజ్‌ రిసార్టు బీచ్‌లో 60 విల్లాలు, 50 వాటర్ విల్లాలతో సహా 110 గదులు ఉంటాయి. ఒక పెద్ద మడుగుతో కూడిన పగడపు ద్వీపం కడ్మత్ ద్వీపం. ఏలకుల ద్వీపం అని పిలిచే దీనిలో సముద్రపు తాబేళ్లకు గూడు కట్టే సీగ్రాస్ పడకలతో కూడిన సముద్ర రక్షిత ప్రాంతం. 110 గదులతో, కద్మత్‌లోని తాజ్ హోటల్‌లో 75 బీచ్ విల్లాలు,35 వాటర్ విల్లాలు ఉంటాయి.

విదేశాల్లో సైతం ఉద్యోగావకాశాలు

ఆతిథ్య, పర్యాటక రంగంలో దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఉద్యోగావకాశాలున్నాయి. హోటల్ మేనేజ్ మెంట్, హాస్పిటాలిటీ,అడ్మినిష్ట్రేషన్, టూరిజం రంగాల్లో పలు దేశాల్లో ఏటా కోట్లాది మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. పర్యాటకానికి పేరున్న థాయ్‌లాండ్ దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. మలేషియా దేశంలో ఈ రంగంలో 1.5 ఉద్యోగాలు ఏర్పడుతున్నాయి. ఇలా పర్యాటక రంగం అభివృద్ధి చెందిన సింగపూర్, మాల్దీవులు, అమెరికా, యూకే దేశాల్లోనూ ఆతిథ్య, పర్యాటక రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులపై విద్యార్థుల ఆసక్తి

హోటల్, పర్యాటక రంగాల్లో వచ్చే ఐదేళ్లలో 5 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్న నేపథ్యంలో దేశంలో విద్యార్థులు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులపై ఆసక్తి చూపిస్తన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ హైదరాబాద్ నగరంతో పాటు కోల్ కతా, ఢిల్లీ, పూణే, బెంగళూరు, గోవా, జైపూర్, అహ్మదాబాద్ నగరాల్లో ప్రత్యేక క్యాంపస్ లలో లక్షలాది మంది విద్యార్థులు హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులు చదువుతున్నారు. దీంతోపాటు దేశంలోని పలు నగరాల్లో ప్రైవేటు రంగంలోనూ పలు హోటల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇచ్చే విద్యాసంస్థలు పెరిగాయి. హోటల్ మేనేజ్ మెంట్ కోర్టు చదివితే ఉద్యోగం గ్యారంటీ అని తాను ఈ కోర్సులో చేరామని రాయగిరి శ్రీ లక్ష్మి అనే హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థిని చెప్పారు. గతంలో కంటే హోటల్ మేనేజ్ మెంట్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని హైదరాబాద్ నగర ఐఈహెచ్ఎం అధ్యాపకుడు శ్రీనివాస్ చెప్పారు.

Read More
Next Story