బీఆర్ఎస్ రాజకీయ పర్యటనలకు సర్కారు టీఏ, డీఏ
x
Kalvakuntla Kavitha

బీఆర్ఎస్ రాజకీయ పర్యటనలకు సర్కారు టీఏ, డీఏ

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైంది. నాటి ప్రభుత్వంలో మంత్రులు తమ రాజకీయ పర్యటనలకు ప్రజాధనాన్ని వెచ్చించారని ఆర్టీఐ సమాచారంతో వెలుగుచూసింది.


మంత్రులు అధికారిక పనులపై ఢిల్లీకి వెళితే వారు విమాన చార్జీలతోపాటు టీఏ, డీఏ, వసతి సౌకర్యాలకు ప్రభుత్వం నుంచి డబ్బు పొందవచ్చు. కానీ గత బీఆర్ఎస్ పాలనలో చాలామంది మంత్రులు తమ వ్యక్తిగత, రాజకీయ పర్యటనలకు కూడా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారని సమాచార హక్కు చట్టం కింద అందిన సమాచారంతో తేటతెల్లమైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేసీఆర్ ముద్దుబిడ్డ, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత ఏడాది మార్చి నెలలో ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు ప్రశ్నించినపుడు, ఆమెకు సంఘీభావంగా తెలంగాణకు చెందిన అప్పటి మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హస్తిన బాట పట్టారు. సీఎం కుమార్తెకు సంఘీభావం ప్రకటించడం ద్వారా గులాబీ బాస్ మెప్పు పొందేందుకు పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లారు. ఆ సందర్భంగా ఢిల్లీ పర్యటనలకు అయిన ఖర్చును మంత్రులు ప్రభుత్వ ఖజానా నుంచి పొందారని వెల్లడైంది.


మొదటిసారి ఈడీ విచారణకు మంత్రుల సంఘీభావం
2023వ సంవత్సరం మార్చి 10వతేదీ : ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ అధికారులు వారి కార్యాలయంలో 8గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా అప్పటి తెలంగాణ బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్ఎస్ కీలక నేతలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి కవితకు సంఘీభావం ప్రకటించారు.

హస్తినలో రెండోసారి ఈడీ విచారణకు...
2023వ సంవత్సరం మార్చి 21వతేదీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదికారులు ఢిల్లీ కార్యాలయంలో తెలంగాణ ఎమ్మెల్సీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను రెండోసారి విచారించారు. మొదటిరోజు ఈడీ అధికారులు 10గంటలపాటు కవితను ప్రశ్నించాక విజయచిహ్నం చూపిస్తూ కవిత బయటకు వచ్చి తన తండ్రి ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయం,కేసీఆర్ నివాసమున్న తుగ్లక్ రోడ్డు, ఢిల్లీలోని తెలంగాణ భవన్, బీఆర్ఎస్ కార్యాలయాలు బీఆర్ఎస్ నేతలతో కిక్కిరిసి పోయింది.

ఢిల్లీలో కవిత దీక్ష
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల మహిళా సంఘాలతో కలిసి కల్వకుంట్ల కవిత భారత్ జాగృతి ఆధ్వర్యంలో గత ఏడాది మార్చి-10వతేదీన జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవితే దగ్గరుండి నిర్వహించారు. దీక్ష చేసిన కల్వకుంట్ల కవితకు సంఘీభావంగా తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గోన్నారు.కవితకు మద్దతుగా తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి,పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిలిచారు.

రాజకీయ పర్యటనలకు ప్రజాధనం వెచ్చిస్తారా? : డాక్టర్ పెంటపాటి పుల్లారావు
కొందరు బీఆర్ఎస్ నాయకగణం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలోనూ ఢిల్లీకి వెళ్లింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. నాటి పత్రికల్లో దీనిపై వార్తలు కూడా వచ్చాయి. మంత్రులైనా, ప్రజాప్రతినిధులైనా రాజకీయ పర్యటనలు చేయవచ్చు...తమ అధినేత కుమార్తెకు సంఘీభావం తెలుపవచ్చు. కానీ వారి సొంత డబ్బుతో ఢిల్లీ వెళ్లి మద్ధతు తెలపాలి. కానీ ఈ రాజకీయ పర్యటనల ఖర్చును చాలామంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు ప్రజాధనం నుంచి పొందారని సమాచార హక్కు చట్టం సమాచారంతో తేలడంతో సామాన్యులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రజా ధనాన్ని ఇలా మంత్రులే వృథా చేస్తారా అని సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి విమాన చార్జీలు, టీఏ,డీఏలు అధికారిక పనులకే చెల్లిస్తుందని, ఇలా రాజకీయ పర్యటనలకు ప్రభుత్వ సొమ్ము వినియోగించకూడదని పుల్లారావు చెప్పారు.

రెండు సార్లు ఈడీ విచారణ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్ర పోషించిందని ఈడీ తాజాగా కీలక ప్రకటన చేసింది. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే రెండు సార్లు విచారించింది. దీంతోపాటు పలు సార్లు విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు పంపించింది. మార్చి 10వతేదీన కవితను ఈడీ విచారణకు పిలిచినపుడు ఆమె సోదరుడైన అప్పటి మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు ఢిల్లీకి వచ్చారు.కవితకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ మంత్రులతోపాటు నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన కవితకు మద్దతుగా తాను ఢిల్లీకి వచ్చానని అప్పట్లో పర్యాటక శాఖ మంత్రి అయిన శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు.

ఢిల్లీ వీధుల్లో కవిత ప్లెక్సీలు
కవిత పిడికిలి బిగించి ఈడీ విచారణకు వెళ్లారు. ఈ సందర్భంగా ఢిల్లీ వచ్చిన బీఆర్ఎస్ దళం ‘‘కవితక్కా సంఘర్ష్‌ కరో.. హమ్‌ తుమారా సాత్‌ హై’’ పేరుతో ఢిల్లీలో ఫ్లెక్సీలు వేసి బలప్రదర్శన చేశారు. బీఆర్ఎస్ నేతలు‘‘ట్రూకలర్స్‌ నెవర్‌ ఫేడ్‌.. బైబై మోదీ’’ అన్న పోస్టర్లతో ఢిల్లీ వీధులను నింపారు.కవిత విచారణ సందర్భంగా తెలంగాణ పోలీసులు, బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో తెలంగాణ భవన్ కిటకిటలాడింది.

ఢిల్లీకి వచ్చిన తెలంగాణ పోలీసులు
తెలంగాణ రాష్ట్ర అధికారిక పనులపై ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు ఢిల్లీ వచ్చినపుడు అక్కడి మన అధికారిక అతిథిగృహమైన తెలంగాణ భవన్ లో బస చేస్తుంటారు. కానీ కవితను ఈడీ ప్రశ్నించిన సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశంతో తెలంగాణకు చెందిన డీఎస్పీ, సీఐ,ఆర్ఐ, ఎస్సై, కానిస్టేబుళ్లు కొందరు ఢిల్లీకి వచ్చి అధికారిక అతిథి గృహంలో బస చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆర్టీఐ కింద అందించిన సమాచారంలోనే తెలిపారు. కవిత ఈడీ విచారణ సందర్భంగా తెలంగాణ పోలీసులు తెలంగాణ భవన్ లో బస చేసిన రికార్డులు కూడా ఆర్టీఐ కింద ఆధారాలు దొరికాయి. ఢిల్లీలో తెలంగాణ పోలీసులకు పని ఏముంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్టీఐ యాక్టివిస్టు ప్రశ్నించారు.

ఢిల్లీ వచ్చిన మంత్రుల గణం
కవిత ఈడీ విచారణ సందర్భంగా అప్పట్లో హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో మంత్రుల గణం ఢిల్లీకి తరలివచ్చింది. ఇలా ఢిల్లీకి వచ్చిన వారిలో మంత్రులు మంత్రులు శ్రీనివాసగౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వరరావు, బీబీపాటిల్, వెంకటేశ్ నేత, బీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేశ్‌. వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గువ్వల బాలరాజు, గణేశ్ గుప్తా, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. మంత్రి శ్రీనివాసగౌడ్ కవిత వెంట ఈడీ కార్యాలయం గేటు వరకు వచ్చారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ సమావేశాలకు సైతం...
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మూడు భారీ బహిరంగసభలకు కూడా అప్పటి మంత్రులు తరలివెళ్లారు. గత ఏడాది ఫిబ్రవరి 5వతేదీన నాందేడ్‌లో భారీ బహిరంగ సభ జరిపారు. మార్చి 6వతేదీ కాంధార్ లోహాయలో, ఔరంగాబాద్‌లో 2023 ఏప్రిల్ 24వతేదీన బీఆర్ఎస్ బహిరంగసభలు నిర్వహించారు. ఈ సభలకు వెళ్లిన మంత్రులు కూడా ప్రజాధనాన్ని క్లెయిమ్ చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభలకు హెలికాప్టర్లతోపాటు మంత్రులు కార్లలో రయ్ మంటూ వెళ్లి ప్రభుత్వ టీఏ,డీఏలు పొందారని ఆర్టీఐ యాక్టు సమాచారంలో వెల్లడైంది.

తిరుపతి పర్యటనకు కూడా ప్రజాధనమేనా?
తెలంగాణకు చెందిన అప్పటి మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబసభ్యులతో కలిసి విమానంలో తిరుపతి వెళ్లి దేవుడిని దర్శించుకొని వచ్చారు. మంత్రివెంట ఆమె కుటుంబసభ్యులు సోనం రాథోడ్, ఆద్య రాథోడ్, భూక్యా సునయన రాథోడ్, భూక్యా కైరా రాథోడ్ లు కూడా తిరుపతి పర్యటనలో పాల్గొన్నారు. ఏంఏ టూర్స్ ట్రావెల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నుంచి మంత్రి టికెట్లు కొనుగోలు చేశారని ఆర్టీఐ సమాచారంతో తేటతెల్లమైంది. తిరుపతి పర్యటనే కాదు ఢిల్లీ పర్యటనలు, మహారాష్ట్ర పర్యటనలు కూడా అధికారికమేనని ఆర్టీఐ సమాచారం వెల్లడించింది.

మంత్రుల వ్యక్తిగత, రాజకీయ పర్యటనలకు ప్రజాధనం వృథా : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి
‘‘తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు మంత్రులు వారి వ్యక్తిగత, రాజకీయ పరమైన పర్యటనలకు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించడం మంచిది కాదు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ప్రశ్నించినపుడు ఆమెకు సంఘీభావంగా చాలామంది మంత్రులు ఢిల్లీ బాట పట్టారు. మంత్రులు విమానాల్లో ఢిల్లీకి వెళ్లి సీఎం కుమార్తెకు సంఘీభావం ప్రకటించారు. వ్యక్తిగత, రాజకీయ పర్యటనలకు ప్రజాధనం వెచ్చించకుండా చర్యలు చేపట్టాలి. దీంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హస్తినకు పయనమై వెళ్లారు. ఇలా మంత్రులు ఢిల్లీ వెళ్లిన రాజకీయపరమైన పర్యటనకు కూడా ప్రభుత్వం నుంచి విమాన చార్జీలతో పాటు టీఏ,డీఏలు తీసుకున్నారు. అప్పటి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ అయితే ఏకంగా వ్యక్తిగత పర్యటన కోసం ఢిల్లీలో మకాం వేసి, పర్యాటక అభివృద్ధి సంస్థ నుంచి బిల్లులు పొందారు’’ అని యం పద్మనాభరెడ్డి వివరించారు.


Read More
Next Story