గుండకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి వృధాగా పోతున్న నీరు

ఉన్న నీళ్లు ఏటి పాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరీవాహక ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు


గుండ్లకమ్మ గొల్లుమంది. ఉన్న నీళ్లు ఏటి పాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరీవాహక ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. రిజర్వాయర్‌ గేట్లు పదేపదే కొట్టుకుతోతున్నా పట్టించుకునే నాధుడు లేకుండా పోయారని వాపోతున్నారు.

ఈసారి రెండో గేటు వంతు..
ప్రకాశం జిల్లాలోని శ్రీ కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ 2వ గేటు మరోసారి కొట్టుకుపోయింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వరద నీరు ప్రాజెక్ట్ ను ముంచెత్తడంతో 3వ గేటు కొట్టుకు పోయింది. ఈసారి రెండో గేటు కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్ట్ నీరు సముద్రం పాలవుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటును ఏర్పాటు చేస్తున్నారు.
జాగ్రత్తగా ఉండమని కలెక్టర్ హెచ్చరిక..
గుండ్లకమ్మ రిజర్వాయర్‌ గేటు కొట్టుకుపోవడంతో ప్రాజెక్ట్ పరివాహకప్రాంత ప్రజలకు జిల్లా కలెక్టర్‌ దినేశ్ కుమార్‌ హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గేట్ల మరమ్మతులకు టెండర్లు పిలిచామని కలెక్టర్‌ తెలిపారు.
గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్‌) రెండో గేటు అడుగు భాగం కొట్టుకుపోయింది. ఇప్పటికే ఒక గేటు కొట్టుకుపోయి ఏడాది గడిచిపోయినా దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేయలేదు. మిగిలిన గేట్ల మరమ్మతుల్నీ అధికారులు గాలికివదిలేశారు. దీంతో శుక్రవారం రాత్రి 2వ నంబరు గేటు కొట్టుకుపోయింది. గుండ్లకమ్మ జలాశయం కింద కుడి, ఎడమ కాలువల పరిధిలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వాయర్‌లో చేపల వేటతో 2వేలకు పైగా మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నాయి.
3.8 టీఎంసీల నీటి సామర్థ్యం...
గుండ్లకమ్మ జలాశయం పూర్తి సామర్థ్యం 3.8 టీఎంసీలు. గతేడాది ఆగస్టులో 3వ గేటు కొట్టుకుపోయే నాటికి జలాశయంలో 3 టీఎంసీల నీళ్లున్నాయి. గేటు కొట్టుకుపోవడంతో 1.5 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోయాయి. గేటు మరమ్మతులు చేయాలంటే మొత్తం జలాశయం ఖాళీ చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులు సూచించారు. తాత్కాలికంగా మరమ్మతు చేసిన తర్వాత జలాశయంలో నిల్వను 1.7 టీఎంసీలకే పరిమితం చేశారు.
తుపానుతో పెరిగిన నీటి మట్టం..
మిగ్‌జాం తుపానుకు ముందు జలాశయంలో 1.3 టీఎంసీలే ఉన్నాయి. తుపాను నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా రావడంతో జలాశయంలోకి 2.5 టీఎంసీల నీరు చేరింది. బుధవారం రెండు గేట్లు ఎత్తి కొంత నీరు దిగువకు వదిలారు. ఉద్ధృతి తగ్గిందనుకొని తిరిగి మూసివేశారు. పైనుంచి ప్రవాహం పెరగడంతో రెండో గేటులోని అడుగు భాగం కొట్టుకుపోయింది. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. మూడేళ్ల కిందటే గుర్తించినా అధికారులు మరమ్మతులు చేయకపోవడం పట్ల రైతు సంఘం నాయకుడు రావుల వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ అధికారులు ఇప్పటికైనా శ్రద్ధ చూపి మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేశారు.


Next Story