ఆంధ్రప్రదేశ్ లో చెలరేగిన హింస దేశం మొత్తం చూసే విధంగా మారింది. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు.
ఎపిలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు జిల్లాల్లో చోటు చేసుకున్న పరిణామాలు దారుణంగా ఉన్నాయి. రాళ్లు రువ్వుకోవడాలు, కత్తులు, గొడ్డళ్లు, ఇనుప రాడ్లు చేతపట్టుకొని రోడ్లపై స్వైర విహారం చేస్తూ రాళ్ల దాడులకు పార్టీల వారీగా వైరి వర్గాలు దిగాయి. వందల మందికి గాయాలయ్యాయి. వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నేరుగా ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుని ఇళ్లకు వెళ్లారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అభ్యర్థులు ఇరువురూ నేరుగా రంగంలోకి దిగి తమ మందీ మార్బలాన్ని ఉపయోగించి రాళ్ల దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఎస్పితో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అయినా పోలీసుల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నిక ముందు రోజు చిన్న చిన్న గొడవలు, ఎన్నికల రోజు దాడులు, మరుసటి రోజు హింస చోటు చేసుకున్నాయి. పల్నాడు జిల్లాలోనూ ఇవే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో ఈవిఎంలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరుగా పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవిఎంను నేలకేసి కొట్టారు. ఇటువంటి పరిణామాలు జరిగిన నేపథ్యంలో వీడియో బయటకు రావడంతో ఈనెల 20న కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ సమీపంలో ఒక ఫ్యాక్టరీకి చెందిన గెస్ట్ హౌస్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారని తెలుసుకున్న ఎపి, తెలంగాణ పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నగరంలోనూ స్ట్రాంగ్ రూము వద్ద వైఎస్సార్సీపీ వారు తెలుగుదేశం అభ్యర్థిపై దాడికి పాల్పడ్డారు. అంతకు ముందు ఉదయం పూట చంద్రగిరిలో టీడీపీ వారు ఒక ఇంటిపై దాడిచేసి నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గురజాల నియోజకవర్గంలోనూ దాడులు జరిగాయి.
ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు
పల్నాడు ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా దాడులు జరిగే అవకాశం ఉందని ఎవరిని అడిగినా చెబుతారు. అలాగే తాడిపత్రిలోనూ గతంలో ఎన్నికల గొడవలు జరిగాయి. తెలిసి కూడా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనియాంశమైంది. కనీసం మునిసిపల్ ఎన్నికల్లో తీసుకున్న చర్యలు కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోకపోవడం పలు సందేహాలు తావిస్తోంది. గతంలో ఎన్నికల గొడవల్లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని వారిని బైండోవర్ చేస్తారు. ఇది సాధారణ అంశం. అయితే ఆ పనికూడా పోలీసులు చేయలేదు. నేరస్తులను వెచ్చల విడిగా వదిలేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలను ఎన్నికల తరువాత గృహనిర్భంధం చేశారు. దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.
ఈవిఎంల ధ్వంసంలో ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్
పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు (పోలింగ్ కేంద్రం 202)లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈనెల 20నే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ సెక్షన్ల కింద ఎమ్మెల్యేకు 7ఏళ్లు శిక్షపడే అవకాశం ఉందని ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.
పల్నాడు జిల్లాలో మొత్తం 8ఈవిఎంలు ధ్వంసమైనట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా ఎన్నిక జరిగిన సాయంత్రం ప్రకటించారు. అయితే ఈవీఎంలలోని చిప్ లు బాగానే ఉన్నందున రీపోలింగ్ అవసరం లేదన్నారు. ఈవిఎంల ధ్వంసం కేసులు ఎన్ని నమోదు చేశారు. ఎంత మందిపై కేసు నమోదైందనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఎస్పిని సస్పెండ్ చేసి, కలెక్టర్ ను బదిలీ చేయడంతో ఎన్నికల సంఘం చేతులు దులుపుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల వారి ఫిర్యాదు మేరకు హడావుడిగా కొన్ని కేసులు నమోదు చేశారు. నేరుగా ఒక బూత్ లోకి వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎంను విసిరి కొట్టి ధ్వంసం చేశారు. ఈవిఎం ధ్వంసం విషయం వీడియో బయటకు వచ్చే వరకు పోలీసులకు కూడా తెలియలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. అధికార పార్టీ వత్తిడులకు పోలీసులు తలవంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీడియోలను చూసి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ ద్వరా పోలీసుల పనితీరును దుయ్య బట్టారు. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఎమ్మెల్యేను సాయంత్రానికి అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నెల్లి కోసం ఎపి పోలీసులు, తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా సంగారెడ్డి జిల్లా కంది వద్ద మంగళవారం కారు నుంచి ఎమ్మెల్యే పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. కారును, డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల అధికారులు సీసీ పుటేజీలను ఎస్పి మల్లిక గార్గ్ కు అందించినట్లు సమాచారం. ఈ మేరకు క్షుణ్ణంగా పోలీసులు వీడియోలను పరిశీలిస్తున్నారు. హింసకు కారకులైన వారిని గుర్తించే కార్యక్రమం చేపట్టారు. మిగిలిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఈవీఎంల ధ్వంసం చేసిన వారిని కఠిన శిక్షలు విధించేలా చర్యలు ఉండాలని పోలీసులు శాఖ ఇప్పుడు భావించడం విశేషం.
నిఘా వ్యవస్థ ఏమైంది?
రాష్ట్రంలోని ఏయే నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంలో పోలీస్ నిఘా వ్యవస్థ ఫెయిల్ అయిందా? లేక అధికార పార్టీకి కొమ్ము కాసిందా అనేది ఇక్కడ చర్చనియాంశమైంది. ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులును చివర్లో మార్చారు. డిజిపి, ఇత పోలీసు అధికారులను కూడా మార్చారు. అప్పటి వరకు ఎన్నికల కమిషన్ కూడా ఎందుకు వెయిట్ చేసిందనేది చర్చకు దారితీసింది. నిఘా విభాగం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు వచ్చాయి. ఈసీ ఈ విషయంలో ఎటువంటి చర్యలు నిఘా విభాగంపై తీసుకుంటుందనేది కూడా ఉత్కంఠగా మారింది.
వారం ముందు డిజిపిని మారుస్తారా?
వారం రోజులు ఎన్నికలు ఉన్నాయనగా డిజిపి కె రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చారు. వారం రోజుల ముందు కొత్త డిజిపిని నియమిస్తే ఆయన సమీక్ష నిర్వహించి అందరినీ అప్రమత్తం చేయడం ఎలా కుదురుతుందనే ఆలోచన కూడా ఎన్నికల సంఘం చేయలేదు. రెండు నెలల ముందుగానే డిజిపి వంటి వారిని మర్చి ఎన్నికల కమిషన్ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో అవేమీ జరగలేదు.
ముందస్తు చర్యలు లేవు: మాజీ డిజిపి నండూరి సాంబశివరావు
ఈ ఎన్నికల్లో హింస జరుగుతుందని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ముందస్తు చర్యలు అసలు తీసుకోలేదనిపిస్తుంది. పోలీసులను కాస్త ఎక్కువ మందిని తెప్పించుకోవాల్సింది. సామాన్య ఓటరును భయపెట్టకుండా నేరస్తులను భయపెట్టాల్సిన అవసరం ఉంది. ఈవిఎంలు ధ్వంసం అయ్యాయంటే తప్పకుండా అక్కడ రీపోల్ నిర్వహించాలి. మిషనరీ ధ్వంసమైనా రీపోల్ ఆర్డర్ ఇవ్వలేదంటే ఏమి జరిగింది? ఎక్కడా ఫ్రొఫెషనాలిటీ కనిపించలేదు. ఈవిఎం ధ్వంసం అయితే కర్ర విరిగినట్లు అధికారులు భావించడం ఆశ్చర్యంగా ఉంది. నేను గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు ఈవీఎంలు ధ్వంసం చేస్తే వెంటనే రీపోల్ పెట్టించాము. పోలీసులు పెట్టిన కేసుల్లో ఎన్నికల చట్టాలకు సంబంధించిన సెక్షన్స్ ఎందుకు వేయలేదనేది కూడా చర్చగా మారింది. నేరస్తుల వద్ద మర్యాదగా ఉంటే సరిపోతుందా? సాధారణ ఓటర్ల పట్ల మర్యాదగా పోలీసులు వ్యవహరించాలి. నేరస్తుల వద్ద కఠినంగా వ్యవహరించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పోలీసుల వ్యవహారం ఉంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ను వేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది ఆలోచించాల్సి ఉంది. నేను వైజాగ్ లో ఓటు వేసేందుకు వెళ్లాను. అక్కడ సిబ్బందికి కనీస శిక్షణ కూడా లేదని ఎపి మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు ఫెడరల్ ప్రతినిధితో అన్నారు.