
వ్యవసాయ శాఖ రైతులతో సంబంధాలు కోల్పోతోందా!!!
గ్రామ స్థాయి అధికారులు రైతులకు వ్యవసాయ లో మెళకువలు యివ్వడం లేదని రైతులు వాపోతున్నారు
రాష్ట్రం లో నగదు బదిలీ పథకాల అమలు మొదలయ్యాక తమకు పంటల విషయం లో ఎటువంటి సలహా సూచనలు అందటం లేదని రైతులు వాపోతున్నారు. ఈ పనులను చేయడానికి క్రింద స్తాయి లో నియామకం అయిన వ్యవసాయ అధికారులు దీన్ని దృవీకరిస్తూన్నారు.
రాష్ట్రం లో రైతు బంధు పథకం 2018-19 తరువాత కేంద్రం పిఎం కిసాన్ మొదలు పెట్టాక ఈ పరిస్థితి మరింత ఎక్కువ అయ్యిందని వారు ఏకాభిప్రాయం తో వున్నారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) లు తమకు ఎలాంటి సూచనలు చేయటం లేదని దృవీకరిస్తున్నారు నారాయణపేట జిల్లా, మరికల్ మండలం, చిత్తనూరు గ్రామ రైతు ఆర్. దేవేందర్ రెడ్డి. “మేము పురుగు మందులను అవి అమ్మే షాపు యాజమానుల సూచనల మేరకే వాడుతున్నాము. నీళ్ళు లేనప్పడు ఆముదాలు, కంది, పత్తి పండించాము, జూరాల ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చాక వరి, పత్తి పండిస్తున్నాము. కంది కేవలం 10 శాతం మాత్రమే వుంది,” అని చెప్పారు.
మొదటి సేంద్రీయ గ్రామం గా గుర్తింపు వచ్చిన జనగామ జిల్లా, ఎనబావి గ్రామ రైతు, ఈ. మహేందర్ AEO లు కేవలం IKP కేంద్రాలలో వడ్ల కొనుగోలుకు టోకెన్ లు మాత్రమే జారీ చేస్తున్నారని ఏ రకమైన సలహాలు యివ్వటం లేదని చెప్పారు. రైతు బంధు లేదా పిఎం కిసాన్ పడిందా లేదా అని మాత్రమే చూస్తున్నారు అన్నారు. కొత్త పద్దతులు ఎవరు చెప్పటం లేదు. మా గ్రామం సేంద్రీయ వ్యవసాయం వైపు వెళ్ళడానికి కారణం అయిన ఎన్జీవో కూడా వాళ్ళకు నిధులు ఆగిపోయాయి అని వాళ్ల కార్యక్రమాలు ఆపేశారు.
రైతు తన బ్యాంక్ ఖాతా నెంబర్ లేదా తన పొలం వివరాలు మీ సేవ కేంద్రానికి వెళ్ళి సరిచేసుకోగలడు అందుకు మా సేవలు అవసరం లేదు. మా పని మా ఆధ్వర్యం లో వున్న 5,000 ఎకరాలలో వుండే రైతులకు పంటల విషయం లో సలహా సూచనలు చేయడం మా ప్రధాన విధి. ఏ పొలం లో ఏ పంట వుందో నమోదు చేయడం రెవెన్యూ అధికారులు చేయాల్సిన పని. కానీ నగదు బదిలీ కార్యక్రమాలను మాకు అప్పచెప్పి వాటి పురోగతిని హెడ్ ఆఫీసు వాళ్ళు అడుగుతుంటారు. వాటి అమలు విషయం లో జిల్లా, మండల, క్రింది స్తాయి అగ్రి ఎక్స్టెంషన్ అధికారులకు ర్యాంకింగ్ యిస్తున్నారు. దీనితో మాకు రైతులకు వుండాల్సిన సంబంధం తెగిపోయి నమ్మకం కూడా పోయింది, అని ఒక వ్యవసాయ విస్తరణ అధికారి చెప్పారు.
వ్యవసాయ శాఖ కు ఒక ప్రణాళికా లేకపోవటం కూడా ఈ పరిస్థితి కి మరింత ఆజ్యం పోస్తోంది. అది చివరి ప్రణాళికను 2019-20 కాలానికి మాత్రమే చేసింది. ఆ తరువాత రాష్ట్రం లో దీని ఫలితంగా ఏక పంట విధానం మరింత ఎక్కువ అయ్యి నేడు వరి, పత్తి మాత్రమే రాష్ట్రం లో అధిక భాగం పండుతున్నాయని ఆ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రం లో ఈ వానాకాలం లో 133.09 లక్షల ఎకరాలలో పంటలు వెయ్యగా వరి 67,30,408 ఎకరాలలోనూ పత్తి 45,94,685 ఎకరాల లో రైతులు పండించారు. ఈ పంటలకు మాత్రమే మద్దతు ధర వుండటం కూడా ఈ పరిస్థితి కి ఆజ్యం పోసింది. దీని వలన వరి విస్తీర్ణం 2017 నుండి రాష్ట్రం లో వానాకాలం లో 50 శాతం యాసంగి లో 75 శాతం పెరిగింది.
ఆర్బీఐ తన 2024 లో యిచ్చిన నివేదికలో రాష్రం ఏర్పాడ్డాక 2013-14 నుండి అది పండ్లు, కూరగాయలు, చెరకు, దినుసులు, ధాన్యాలు పండించటంలో ఎలా వెనక పడిందో బయట పెట్టింది. యివి మునుపు వున్న విస్తీర్ణం కంటే చాలా తగ్గిపోయాయని అది చెప్పింది. పళ్ళు 7,41,316 ఎకరాల నుండి 3,95,368 ఎకరాలకు, కూరగాయలు 5,43,631 ఎకరాల నుండి 1,23,522 ఎకరాలకు, చెరకు 96,371 ఎకరాల నుండి 66,718 ఎకరాలకు పడిపోయింది అని ఆ నివేదిక పేర్కొంది.
ఈ పరిస్థితి వలన భూమి సారాన్ని కోల్పోతొందని అలాగే భూమి లో నీరు అడుగంటుతోందని రిపోర్ట్ లు చెబుతున్నాయి.
వ్యవసాయ శాఖ రైతులతో నేరుగా చేస్తున్న కార్యక్రమం వీడియొ కాన్ఫరెన్సింగ్ వున్న కేవలం 1581 రైతు వేదికల ద్వారా ప్రతి మంగళవారం శాస్త్రవేత్తల తో పెట్టే చర్చ మాత్రమే అని ఒక సీనియర్ అధికారి చెప్పారు. చర్చ రాష్ట్రం మొత్తానికి ఒకే విషయం పైన వుంటుందని అది ఆయిల్ పామ్ గురించి అయినట్టయితే ఆ పంట వున్న ప్రాంత రైతులు మాత్రమే పాల్గొంటారని అది ఒక గంట పాటు వుంటుందని ఆయన చెప్పారు.
అధికారులకు మలకపేట్ లోని (State Agricultural Management and Training Institute, SAMETI) సమేటి లో కొత్తగా వచ్చే రసాయనాల గురించి, రైతులు వాడే అధిక సాంద్రత గల రసాయనాల స్థానం లో వేప నూనె తో ఎలా కీటకాలను కట్టడి చేయగలమో నేర్పే శిక్షణ, వరి లో శ్రీ వరి లాంటి కొత్త పద్దతులు, కొత్త యంత్రాల వాడకం వీటి గురించి మాకు శిక్షణ యిచ్చి రైతులకు నేర్పే కార్యక్రమాలు యిప్పడు లేవు అని మరో సీనియర్ అధికారి చెప్పారు. దీనివలన కొత్త గా చేరిన క్రింది స్థాయి అధికారులకు తగిన జ్ఞానం పెరగటం లేదని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమల ప్రాధాన్యతను చెప్తూ కొత్త గా పత్తి లో వచ్చిన మెలకువల వలన పత్తి విత్తన వినియోగం తగ్గిస్తే రైతుకు ఖర్చులు తగ్గుతాయి. మామిడి పంటలో ఒక ఎకరానికి యిది వరకు పెట్టే 100 నుండి 150 చెట్ల స్థానంలో 500 నుండి 600 చెట్లు పెట్టే అవకాశం వుందని చెప్పారు.
యివి ఏవి లేకపోవటం తో మాది కేవలం ఒక సర్విస్ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఎన్నికల సమయం లో రెండు నుండి మూడు నెలలు మమ్మల్ని ఆ పనులకు వాడుకుంటారు. ఒక ఎంఆర్వొ పెద్దగా తిరగక పోయిన తనకు నెలకు రు. 33,000 యిస్తారు కానీ మాకు రు. 900 మాత్రమే ఫీల్డ్ అలవెన్సు యిస్తున్నారు. సగం మండలాలలో మాకు ఆఫీసు లు కూడా లేవు. వాటిలో చాలా వాటిని రాష్ట్రం ఏర్పాడ్డాక సృష్టించారు. అధికారులకు గత 15 సంవత్సరాలుగా పదోన్నతులు కూడా లేవు. యిది తీవ్రమైన అసంతృప్తి కి దారి తీస్తోంది, అని మరో అధికారి చెప్పారు.

