హ్యాట్సాఫ్ కైలాష్ మాస్టారు...ఆయన సాధించిన ఘనత ఏమిటంటే...
x
గోండు భాషలో కైలాష్ మాస్టారు రాసిన ‘పండోర్న మహాభారత్ కథ’ పుస్తకం

హ్యాట్సాఫ్ కైలాష్ మాస్టారు...ఆయన సాధించిన ఘనత ఏమిటంటే...

గోండు గూడెంలో జన్మించిన తొడసం కైలాష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూనే తన మాతృభాష అయిన గోండిలో మహాభారతాన్ని రాసి అందరి ప్రశంసలు అందుకున్నారు. కైలాష్ విజయగాథ


మారుమూల గిరిజన జిల్లా అయిన ఆదిలాబాద్ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలోని వాఘాపూర్ కుగ్రామానికి చెందిన తొడసం కైలాష్ మాస్టారి పేరు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రధాన వార్తల్లోకి ఎక్కింది.

- గిరిజన గోండు గూడెంలో పుట్టిన తొడసం కైలాష్ ఎంఏ ఇంగ్లీషు, పొలిటికల్ సైన్సులో డబుల్ మాస్టర్స్ డిగ్రీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 23 ఏళ్లుగా పనిచేస్తూ,మహా భారతాన్ని మొట్టమొదటిసారి ‘పండోర్న మహాభారత్ కథ’ పేరిట గోండు భాషలో రాసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
- గిరిజన పిల్లల కోసం మహాభారతాన్ని గోండు భాషలో రాసిన ‘పండోర్న మహాభారత్ కథ’ పుస్తకాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.
- గోండు భాషలో మహాభారతాన్ని రాసిన కైలాష్ మాస్టారిని మాజీ ఉప రాష్ట్రపతి యం వెంకయ్యనాయుడు, ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, ఎస్టీ కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, గోండ్వానా జాతీయ అధ్యక్షుడు సిడాం అర్జున్, గోండు గిరిజన నాయకులు అభినందించారు.
నాలుగు నెలల్లో రాసిన మహాభారత కథ
గిరిజనుల్లో తొడసం తెగకు చెందిన కైలాష్ మాస్టారును తన మాతృభాష అయిన గోండిలో మహాభారతం లేక పోవడం బాధించేది. నేటికి ప్రజల జీవనశైలికి అద్దంపట్టేలా నైతిక విలువలతో కూడిన మహాభారతాన్ని గోండు భాషలోకి అనువదించాలనే తన కలను కైలాష్ నాలుగు నెలల పాటు శ్రమించి సాకారం చేసుకున్నారు. ‘పండోర్న మహాభారత్ కథ’పేరిట గోండు భాషలో రాసిన పుస్తకంపై తొడసం కైలాష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గోండు భాషలో పలు పుస్తకాలు రాస్తున్న కైలాష్ కథా కమామీషు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

గోండును అధికార భాషగా 8వ షెడ్యూల్ చేయించాలనే లక్ష్యంతో...
‘‘నా పేరు తొడసం కైలాష్. నేను ఉన్నత విద్య అభ్యసించి ఇంద్రవెల్లి మండలం గౌరవాపూర్ మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా గిరిజనుల మాతృభాష అయిన గోండిని అధికార భాషగా 8వ షెడ్యూల్ చేయించాలనే లక్ష్యంతో నేను గోండు భాషలో రచనలకు శ్రీకారం చుట్టాను. కేంద్రప్రభుత్వం గోండు భాషను గుర్తించాలంటే 20వేల పదాలు కావాలి. దీనిలో భాగంగానే గోండు భాషలో రచనలు చేస్తున్నాను.’’

చిన్ననాడే మహాభారతం నాటిక చూసి స్ఫూర్తి పొందా...
‘‘చిన్ననాడే మా వాఘాపూర్ గ్రామంలో మహాభారతంపై వేసిన వీధి నాటికలు చూసి దాని నుంచి స్ఫూర్తి పొందాను. నేను ఉట్నూరులోని పాఠశాలలో చదువుకునేటపుడు మహాభారత్ సీరియల్ దూరదర్శన్ లో చూశాను.మహా భారతం అంటే చిన్న నాటి నుంచి నాకెంతో ఇష్టం. దీంతో నేను పదవ తరగతిలోకి వచ్చాక మహాభారతం పుస్తకం కొని చదివాను. మళ్లీ కరోనా విపత్తు సమయంలో మహాభారత్ సీరియల్ మరోసారి దూరదర్శన్ లో ప్రసారం అయింది. రెండోసారి అది చూశాక ఎంతో స్ఫూర్తినిస్తున్న మహాభారత గ్రంథాన్ని గోండు భాషలోకి తర్జుమా చేసి గిరిజన పిల్లలకు దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను.’’

ఐ ఫోన్ లో గోండు భాషలో మహాభారతాన్ని టైపు చేశాను...
‘‘నేను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే తీరిక సమయాల్లో మహాభారతాన్ని గోండు భాషలో రాయడం మొదలు పెట్టాను. పట్టుదలతో ఐ ఫోన్ కొని దానిలోనే గోండు భాషలో మహాభారతాన్ని టైపు చేస్తూ వచ్చాను.తన భార్య ఉమాదేవికి గర్భసంచికి కేన్సర్ వ్యాధి సోకడంతో ఒక వైపు ఆమెకు ఆసుపత్రిలో చికిత్స చేపిస్తూనే కొద్దిగా విరామ సమయం దొరికినా మహాభారతాన్ని గోండు భాషలోకి అనువదించాను. అలా కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేసి, ఎలాంటి అక్షర దోషాలు లేకుండా ‘పండోర్న మహాభారత్ కథ’ పుస్తకాన్ని ముద్రించాను. అలా ముద్రించిన మహాభారతం గోండు భాషలో వెలువరించిన పుస్తకాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టరు రాజర్షి షా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఎక్కువ కాపీలు ముద్రించి గిరిజన విద్యార్థులకు అందుబాుటలోకి తీసుకువచ్చేందుకు ఉట్నూరు ఐటీడీఏ నిధులను కేటాయిస్తామని జిల్లా కలెక్టరు హామి ఇవ్వడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.’’

కాండిరంగ వేసుడింగ్ పిల్లల కథల పుస్తకం
‘‘గిరిజన పిల్లలకు గోండు భాషలో కాండిరంగ వేసుడింగ్ పేరిట పిల్లల కథల పుస్తకం రాశాను. ఈ పిల్లల పుస్తకానికి పిల్లల నుంచి ఎంతో ఆదరణ లభించింది. గోండు భాషలో గిరిజన పిల్లలకు స్ఫూర్తినందించే పిల్లల కథలను ఈ పుస్తకంలో రాశాను. దీంతో పాటు తండ్రి లేక పోయినా పట్టుదలగా కష్టపడి ప్రాక్టీసు చేసి క్రికెట్ రంగంలో అత్యుత్తమ క్రికెటరుగా రాణించిన విరాట్ కోహ్లీ విజయగాథను గోండు భాషలో రాశాను. ఈ పుస్తకానికి కూడా పిల్లల నుంచి మంచి ఆదరణ లభించింది.’’

గోండీ భాషలో మొట్ట మొదటి సారిగా ఏఐ యాంకర్ సుంగాల్ తుర్పోను సృష్టించి...
‘‘ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గోండి భాషలో కవిత్వం వినిపిస్తున్నాను. నేను గోండి భాషలో రాసిన కవిత్వం, కథలు, స్పూర్తిదాయకమైనా సందేశాలను ఏఐ ద్వార చదివించి వాటిని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పోస్టు చేస్తున్నాను.దీనికోసం ఏఐ యాంకర్ సుంగాల్ తుర్పోను సృష్టించాను. తెలుగు లిపితో గోండి భాషలో రాసిన కవిత్వం ఏఐ ద్వార చదివించడం నాకెంతో గర్వకారణం.’’

కైలాష్ టీచరుకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా సత్కారం

తొడసం కైలాష్ బ్లాగ్
‘‘నిజానికి తెలుగు లిపితో గోండి భాషలో రాస్తే చాలా ఇబ్బంది. కానీ దీన్ని ఏఐ ద్వార అధిగమించాను. నేను రాసిన ‘సద్వీచార్’ అనే పుస్తకాన్ని అచ్చు తప్పు లేకుండా ఏఐ సాంకేతికతతో ఎడిటింగ్ చేశాను. ఈ పుస్తకం యువతను మేలుకొలిపేదిగా ఉంది.నా యూట్యూబ్ ఛానల్ కైలాష్ తొడసం బ్లాగు ద్వారా విడుదల చేశాను.త్వరలోనే పుస్తకాన్ని విడుదల చేస్తాను.

గోండీ భాషపై అధ్యయనం
‘‘ప్రస్తుత తరుణంలో గోండి భాషకు ఆదరణ తగ్గిపోతున్న సందర్భంలో నేను భాషపై లోతుగా అధ్యయనం చేసి,ఇప్పుడు వాడుకలో లేని కొన్ని పదాలను, నేను పూర్వీకులు ఉపయెగించిన భాషను గుర్తు చేసుకొని స్వచ్ఛమైన గోండి భాషలో పుస్తకాన్ని రాశాను.ఈ పుస్తకం రాసే సమయంలో ఏవైనా సందేహాలు వస్తే మా అక్క సరస్వతిని అడిగి తెలుసుకున్నాను. గోండిలో ఉచ్చారణ దోషాలు లేకుండా ఏఐ ద్వార ఎడిటింగ్ చేస్తున్నాను.’’

గోండి భాషలో వార్తలు
‘‘గోండి భాషలో వార్తలు ఉంటే బాగుండు అని అనుకున్నాను. కానీ గోండి భాషలో వార్తా ఛానల్స్ ఏమీ లేవు. ఇటువంటి సందర్భాల్లో నేనే నా యూట్యూబ్ ఛానల్ కైలాష్ తొడసం బ్లాగ్ ద్వార ప్రతి రోజు ఉదయం “సాడ కాండీర ప్రార్థన త్ సాటి నేట సమాచార్” అంటే పాఠశాల అసెంబ్లీలో వార్తలు రాసి యూట్యూబ్ లో ఏఐ యాంకర్ “సుంగాల్ తుర్పో”ని సృష్టించి వార్తలు చదిస్తున్నాను. ఈ వార్తల్ని అన్ని ఆశ్రమ పాఠశాలలు, గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినిపిస్తున్నారు. ఈవిధంగా నేను మరుగున పడిపోతున్న గోండి భాషకు ఊపిరి పోస్తున్నాను’’

గోండి భాషలో రోబో రూపొందిస్తాను...
**భవిష్యత్తులో నాకు అవకాశాలు వచ్చి ప్రభుత్వం, ఇతరుల నుంచి ఆర్థిక సహకారం అందితే గోండిలో రోబో తయారు చేయాలని ఉంది. భవిష్యత్తులో గిరిజనుల ఆహారం జొన్న రొట్టెలు, జొన్న గటక, మక్క గటక, మాటీ భాజీ, గిరిజన వాయిద్య పరికరాలపై కూడా పుస్తకాలు రాసి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. గోండి భాషను బతికించి గిరిజన విద్యార్థులకు అందించేందుకు నా వంతు కృషి కొనసాగిస్తాను. ’’ అంటూ తొడసం కైలాష్ తన గోండు భాష రచనా వ్యాసంగంపై సాగిస్తున్న జర్నీ గురించి వివరించారు.

కైలాస్ టీచరుకు సన్మానం

ఎన్నెన్నోఅవార్డులు
తొడసం కైలాస్ మాస్టారిని పలు అవార్డులు వరించాయి. 2018వ సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా కైలాష్ ఎంపికయ్యారు. హైదరాబాద్ నగరానికి చెందిన శారదా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు కైలాష్ మాస్టారికి ఉత్తమ సేవా పురస్కారం అవార్డునిచ్చి సత్కరించారు. 2019వ సంవత్సరంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కైలాష్ మాస్టారికి టీచర్ ఎక్స్ లెన్స్ అవార్డునిచ్చి సన్మానించారు. 2013వ సంవత్సరంలో రోశయ్య కైలాష్ కు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును ప్రదానం చేశారు.

Read More
Next Story